ఫాదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విడుదలైన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సెలబ్రిటీ తండ్రీకూతుళ్ల మధ్య సాగిన ఆ సంభాషణ నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. పెళ్లికి ముందు సెక్స్, గర్భదారణ తదితర అంశాలపై కూడా తండ్రితో ఆ కూతురు ముచ్చటించింది. ఆ తండ్రి తనదైన స్టైల్‌లో కుండబద్దలు కొట్టినట్టు అభిప్రాయాలు చెప్పారు. బాలీవుడ్ దర్శకుడు అనుగార్ కశ్యప్, ఆయన కుమార్తె అలియా మధ్య సాగిన సంభాషణ వీడియో యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ వీడియోకి ‘ఇబ్బందికర ప్రశ్నలు’ అనే శీర్షిక పెట్టడం గమనార్హం.
అలియా సంధించిన ప్రశ్నలకు ఆమె తండ్రి అనురాగ్ కశ్యప్ ఇచ్చిన సమాధానాలు ఈ ఫాదర్స్ డే ప్రత్యేకం అని చెప్పాలి. ఏడా దిగా అలియా తన బాయ్‌ఫ్రెండ్ షేన్ గ్రెగోయిర్‌తో కలిసి తండ్రి ఇంట్లోనే నివాసం ఉండడం విశేషం. తన బాయ్‌ఫ్రెండ్ షేన్ గ్రెగోయ ర్‌ను ఇష్టపడుతున్నావా? అని అలియా తన తండ్రిని ప్రశ్నించింది. అనురాగ్ స్పందిస్తూ… గ్రెగోయిర్ చాలా మంచివాడన్నారు. ఎంతో పరిణితి కల వ్యక్తి అని, ముఖ్యంగా మగ స్నేహితుల ఎంపికలో నీవు ఎంతో జాగ్రత్తగా ఉంటావనే విషయం తనకు అర్థమై నట్టు అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చారు.
ఇక రాత్రివేళ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి అమ్మాయిలు వెళ్లడంపై అభిప్రాయం ఏంటని అలియా ప్రశ్నించారు. దానిపై ఆయన స్పందిస్తూ … చాలా మంది భారతీయ తల్లిదండ్రులు దీన్ని జీర్ణించుకోలేరనే వాస్తవాన్ని చెప్పారు. ఇదే సందర్భంలో తల్లిదండ్రులు ఓ విష యాన్ని అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. తమ రోజులకి, ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయన్నారు. మున్ముందు మరింతగా మారుతూనే ఉంటాయన్నారు. మన పిల్లలు మనలా అణచివేతను ఇష్టపడరని తేల్చి చెప్పారు. మన భయాల్ని, అభిప్రాయలను పిల్లల మీద రుద్దడం ఆపేయాలని సూచించారు.
పెళ్లికి ముందే సెక్స్, ప్రిగ్నెన్సీ తదితర అంశాలపై అనురాగ్ సమాధానం ఇస్తూ…గతంలో సెక్స్ అనే పదం పలకడాన్ని కూడా నేరంగా చూసేవారన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. సెక్స్ గురించి చాటుమాటుగా తెలుసుకో వాల్సిన అవసరం లేదన్నారు. అది మన శరీరానికి సంబంధించిన ఓ ఫీలింగ్ అని అన్నారు. సెక్స్ వల్ల ఎదురయ్యే పరిణామాలు, వాటి మంచీ చెడుల గురించి వివరిస్తానని, ఆ తర్వాత నిర్ణయాన్ని నీకే వదిలేస్తానని కూతురితో అనురాగ్ కశ్యప్ తేల్చి చెప్పారు.
అలాగే పెళ్లికి ముందే గర్భం ధరించడంపై నీవు ఏం చేయాలనుకుంటున్నావో ముందుగా తెలుసుకుంటానని కూతురితో అన్నారాయన. ఆ తర్వాత నీ నిర్ణయాన్ని గౌరవించడంతో పాటు మద్దతుగా నిలుస్తానని కూతురికి భరోసా ఇచ్చారు. కానీ అంతిమంగా దాని మూల్యాన్ని భరించాల్సింది నీవే అని కూడా కూతురికి తేల్చి చెప్పడం గమనార్హం. ఈ తండ్రికూతుళ్ల మధ్య సాగిన ‘ఇబ్బందికర ప్రశ్నలు’ సంభాషణ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.