ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని వర్గాల వారికి ఏదో రకమైన ప్రయోజనం కలిగింది. తాము అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 6 లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇచ్చినట్టు జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే 10 వేలకు పైగా వివిధ స్థాయిల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. దీనిపై టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. టీడీపీ నిరుద్యోగులను వీధుల్లోకి పంపి అల్లరి చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.
గ్రూప్-1 పరీక్షల ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై అభ్యర్థులతో లోకేశ్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. లోకేశ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యక్తిగతంగా జగన్‌ను టార్గెట్ చేశారు.
‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు జాబ్ రెడ్డిగా.. ఆ తర్వాత డాబు రెడ్డిగా మారారు. ఇటీవల జగన్ విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు.. డాబు క్యాలెండర్. ఇచ్చిన హామీ ప్రకారం 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి’ అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జాబు రావాలంటే బాబు రావాలని ఊరూరా ఊదరగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు నిరుద్యోగంపై మాట్లాడ్డం ఒకింత ఆశ్చర్యంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లోకేశ్ ఘాటు వ్యాఖ్యలపై వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. తమ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను డాబు క్యాలెండర్‌గా విమర్శిస్తున్న లోకేశ్, ఇతర టీడీపీ నేతలకు వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఎలా ఉండాలో, టీడీపీ పాలనలో విడుదల చేసినది ఉంటే చూపాలని సవాల్ విసురుతున్నారు. తమ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగమైనా ఇవ్వని టీడీపీ, ఇప్పుడు తగదునమ్మానని విమర్శలు చేయడం ఆ పార్టీకే చెల్లిందని మండిపడుతున్నారు.
జాబ్ క్యాలెండర్‌తో నిరుద్యోగుల ఆశలు నెరవేరుస్తున్న తమ ప్రభుత్వంపై జనంలో సానుకూల దృక్పథం వస్తుందనే భయం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ హయాంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి, నిరుద్యోగుల పాలిట చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ ఐదేళ్ల పాలనలో జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తని నేతలు, ఇప్పుడు డాబు ప్రకటనలు చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. లోకేశ్‌కు తప్ప మరెవరికీ చంద్రబాబు పాలనలో ఉద్యోగం రాలేదని దెప్పి పొడుస్తున్నారు.