ఒకవైపు కమర్షియల్ సినిమాలతో యమ బిజీగా ఉండే విజయ్ సేతుపతి, నిత్యామేనన్ లు మలయాళంలో ఒక చిన్న బడ్జెట్ సినిమా చేశారు. అదే 19(1) (ఏ). ఒక పొలిటికల్ డ్రామా ఇది. వర్తమానంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా.. మలయాళీ యువ దర్శకురాలు ఇందు వీఎస్ ఈ సినిమాను రూపొందించారని స్పష్టం అవుతుంది. సెమీ ఫిక్షనల్ అనాలి.
భారత రాజ్యాగంలో పౌరులకు భావప్రకటన స్వేచ్ఛను కల్పించింది ఆర్టికల్ 19(1) (ఏ). విపరీత జాతీయవాదన భావనల మధ్యన భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను హైలెట్ చేస్తూ ఈ సినిమా రూపొందింది. ప్రధానంగా కర్ణాటకలో అభ్యుదయ రచయిత గౌరీ లంకేష్ ను కాల్చి చంపడం సంఘటనను ఉద్దేశించి ఈ సినిమా రూపొందించినట్టుగా స్పష్టం అవుతుంది.
ఇందులో ఆ పాత్రను మేల్ రోల్ గా మార్చారు. ఆ పాత్ర పేరు గౌరీ శంకర్. సినిమా అంతా కేరళలో జరిగినట్టుగా చూపించారు. తమిళ మూలాలున్న మలయాళీ అభ్యుదయ రచయిత పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడు. జిరాక్స్ సెంటర్ ను నడిపే ఒక పేద కుటుంబ యువతిగా నిత్యామేనన్ కనిపిస్తుంది. మద్యానికి బానిసైన ఆమె తండ్రి.. కూతురుకు షాపును అప్పగించి ఇంటికి పరిమితమై ఉంటాడు. చదువు, వివాహం రెండూ సాధ్యం కాని పరిస్థితుల మధ్యన జిరాక్స్ షాపును నడుపుతూ మనుగడ సాగించే యువతిగా నిత్యా నటన అత్యంత వాస్తవిక రీతిలో ఆ పాత్రపై సానుభూతిని జనింపజేస్తుంది!
సొంత ప్రాంతం తమిళనాడులోని ధర్మపురికి వెళ్తూ.. తన తాజా రచనను టైప్ చేసి ఉంచమని నిత్య జిరాక్స్ సెంటర్లో ఇచ్చి వెళ్తాడు గౌరీ శంకర్. ఆ రెండు పాత్రలకూ అదే ప్రథమ పరిచయం. అతడెవరో ఆమెకు తెలియదు కూడా. అతడు తిరిగి వస్తే.. తను చేసిన టైపింగ్ కు కాస్త డబ్బులు వస్తుందని ఆశతో ఎదురుచూస్తుంటుంది నిత్య. అయితే మరుసటి రోజుకూ అతడు రాడు. టీవీలో అతడు హత్యకు గురయినట్టుగా.. అగంతకుల కాల్పుల్లో గౌరీ శంకర్ మరణించినట్టుగా చూపిస్తూ ఉంటారు. అతడెవరో నిత్యకు అప్పుడు తెలుస్తుంది.
స్థానికంగా, దేశవ్యాప్తంగా గౌరీ హత్యపై నిరసనలు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఈ హత్య కరడు గట్టిన జాతీయ వాదులు చేసినట్టుగా వార్తలు వస్తుంటాయి. పోలీసులు ఆ హత్యపై విచారణ ప్రారంభిస్తారు. అంతకు ముందు గౌరీ రచనలను ప్రచురించిన పబ్లిషర్ ను ప్రశ్నిస్తారు. ఆ విచారణ పరంపరలో గౌరీ వ్యక్తిత్వాన్ని చూపించింది దర్శకురాలు. గౌరీని హత్య చేసింది రెండో అభిప్రాయాన్ని వినిపించనీయకూడదనే వాళ్లని నిర్ధారణ అవుతుంది.
ప్రఖ్యాత అభ్యుదయ రచయిత తన చివరి రచనను తన చేతిలో పెట్టి వెళ్లాడని నిత్యకు అర్థం అవుతుంది. మరోవైపు ఆమె తండ్రి ఆమె కోసం తను ఏం చేయలేకపోయిననే బాధలో కుమిలిపోతూ ఉంటాడు. గౌరీ చివరి రచనను అతడి కుటుంబానికి, పబ్లిషర్ కు, పోలీసులకు కూడా పంపుతుంది నిత్య. తనెవరో తెలియకుండానే.. వారందరికీ వాటిని చేరుస్తుంది. రచయిత చివరి రచన మరుగున పడికోకుండా.. తన వంతు ప్రయత్నం చేస్తుంది. తను కూడా తన పరిస్థితుల్లో ఏటికి ఎదురీదడం ప్రారంభిస్తుంది. తదుపరి చదువుల దిశగా అడుగు వేయడంతో సినిమా ముగుస్తుంది.
చాలా చిన్న కథ, సింపుల్ కథ. దీన్ని సుమారు వంద నిమిషాలకు పైగా నెరేట్ చేయడంలో యువదర్శకురాలి ప్రతిభ కనిపిస్తుంది. ఒక అర్థవంతమైన చర్చనీయాంశంపై సమర్థవంతమైన నెరేషన్ 19(1) (ఏ). కెమెరా వర్క్, మ్యూజిక్ కూడా మలయాళీ సినిమాల సహజశైలిలో సాగుతూ ప్రేక్షకుడు రిమోట్ కు పని చెప్పకుండా చేస్తుంది. ఈ తరహా నాన్ కమర్షియల్ ప్రయత్నానికి విజయ్ సేతుపతి, నిత్యామేనన్ లు తమ వంతు సహకారం అందించడం కూడా స్వాగతించాల్సిన అంశం.