చాలా మంది కామెంట్లు పెట్టారు, చాలా మంది అడిగారని.. ఈ వీడియో చేస్తున్నా.. ఇదిగో ఇదే నా ఫ్రిడ్జ్ టూర్! ఇదే నా ఫ్రిడ్జ్, డోర్ తీస్తే.. ఇక్కడే నీళ్ల బాటిళ్లు పెడతా. ఇందులోంచి ఐస్ క్యూబ్స్ చేసుకుంటా, ఇది ఎగ్స్ ట్రే. ఇక్కడ కాయగూరలు, పప్పులు ధాన్యాలు కూడా ఫ్రిడ్జ్ లో దాస్తా.. దీంతో వాటికి పురుగు పట్టకుండా ఉంటుంది…. ఈ తరహాలో సాగుతున్నాయి యూట్యూబ్ లో సెలబ్రిటీల ఫ్రిడ్జ్ టూర్లు!
సెలబ్రిటీలు అంటే.. వీరు వీర లెవల్ సినీ తారలు కాదు. సీరియల్ నటీమణులు, టీవీ యాంకర్లు.. వీల్లంతా యూట్యూబ్ చానళ్లు తెరిచి హల్చల్ చేయడం రొటీనే. ఇన్నాళ్లూ వీళ్ల రచ్చ హోం టూర్ వరకే ఉండేది. తమ హోం టూర్ అంటూ.. ఇళ్లంతా కలియదిరుగుతూ చూపించే వాళ్లు. ఆసక్తి ఉండే వారు చూసే వారు. యూట్యూబ్ చానళ్ల వాళ్లు కూడా సదరు తారలతో ఇంటర్వ్యూలు చేసినప్పుడు… వారి ఇళ్లంతా చూపించమని కోరుతూ వీడియోలు చూసే వారు.
సినిమాల్లో, సీరియళ్లలో కనిపించే వీరు ఎలాంటి ఇళ్లలో ఉంటారనేది వారిని తెరపై చూసే వారికి కొంతమేర ఆసక్తి ఉండవచ్చు. ఆ మేరకు వాటికి వ్యూస్ వస్తుంటాయి. అయితే సొంతంగా యూట్యూబ్ చానళ్లను తెరిచేసిన తారలకు చివరకు అందులో ఏం వీడియోలు పెట్టాలో తెలియక.. ఈ ఫ్రిడ్జ్ టూర్ ట్రెండ్ మొదలుపెట్టారు. అయితే ఇది ఎదురుతంతోంది.
ఈ తారల ఇంట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా.. ఈ రోజుల్లో అదేం పెద్ద విషయం కాదు. సామాన్యుల ఇళ్లలో కూడా పెద్దపెద్ద ఫ్రిడ్జ్ లుంటాన్నాయి. ఓ మోస్తరు జీతం పొందే వారు కూడా లక్ష, లక్షన్నర పెట్టి ఫ్రిడ్జ్ లు కొంటున్నారు. వాటికి టచ్ స్క్రీన్లే ఉంటున్నాయి. ఫ్రిడ్జ్ కే ఇంటర్నెట్ కనెక్ట్ చేసి డోర్ కు ఉన్న స్క్రీన్ పై యూట్యూబ్ వీడియోలు చూసే ఆప్షన్లు, వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం కూడా పెద్ద విడ్డూరం కాదు. అలాంటి ఫీచర్లు సామాన్యులకే చేరువయ్యాయి.
అన్నింటికీ మించి.. పప్పులు, ఉప్పులూ ఫ్రిడ్జ్ లో దాచి.. అదో పెద్ద ఘనత అయినట్టుగా, ఫ్రిడ్జ్ చూపించడం అంటే అదో టూర్ అన్నట్టుగా అతి చేయడం కామెడీ గా మారింది. దీంతో ఈ చోటా సెలబ్రిటీల ఫ్రిడ్జ్ టూర్లు ప్రహసనం పాలవుతున్నాయి. ఈ అతిపై ట్రోలింగ్స్ సాగుతున్నాయి. అయితే ఈ ఫ్రిడ్జ్ టూర్లకు కూడా లక్షల్లో వ్యూస్ ఉండటంతో.. తారలు మాత్రం నవ్వులపాలైతే ఏం, వ్యూస్ వస్తున్నాయి కదా అన్నట్టుగా టూర్లను కొనసాగిస్తున్నారు.
ఫ్రిడ్జ్ టూర్ల తర్వాత ఇక బీరువా టూర్లు, బట్టల కలెక్షన్లు, నగల కలెక్షన్ల మీద పడతారేమో! వాటికి ఇంకా ఎక్కువ వ్యూస్ గ్యారెంటీ!