అన్నపూర్ణా పిక్చర్స్ వారు మొదటి సినిమా ''దొంగరాముడు'' డైరక్టు కథ అయినా, తర్వాత తీసిన ''తోడికోడళ్లు'', ''మాంగల్యబలం'' బెంగాలీ కథల ఆధారంగా తీసినవే. అయితే మూలకథలకు చాలా మార్పులు చేశారు. ''మాంగల్యబలం'' తర్వాత 1961లో తీసిన ''వెలుగునీడలు'' సినిమా విషయంలో అశుతోష్ ముఖర్జీ రాసిన ఓ బెంగాలీ నవల తీసుకుని దాన్ని చాలా మార్చుకుంటూ కథ రాసుకున్నారు. ఆ మూలకథ ఆధారంగా 1970లో అంటే ‘‘వెలుగునీడలు’’ వచ్చిన 9 యేళ్లకు ''సఫర్'' అనే హిందీ సినిమా వచ్చింది. ''సఫర్''ను, ''వెలుగునీడలు''ను పోల్చి చూస్తే మూలకథను మనవాళ్లు ఎలా మార్చుకున్నారో తెలుస్తుంది.
డాక్టర్ కోర్సు చదివే యిద్దరు ప్రేమికుల కథ యిది. ఇద్దరూ డబ్బు లేనివారే. హీరోకి జబ్బు పట్టుకుంటుంది. డబ్బున్న ఒకతను హీరోయిన్ను పెళ్లి చేసుకోమని వెంటపడతాడు. తను ఎలాగూ చనిపోతానని తెలిసి హీరో ఆమెను ఆ పెళ్లికి ఒప్పుకోమని నచ్చచెపుతాడు. ఆమె పెళ్లాడుతుంది. దాని పర్యవసానాలు ఏమిటన్నది కథ.
‘‘సఫర్’’లో హీరో రాజేశ్ ఖన్నా, హీరోయిన్ షర్మిలా టాగోర్ మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్. హీరోయిన్ బొమ్మ వేస్తూ హీరో క్లాసులో పట్టుబడ్డాడు. ప్రొఫెసర్ అశోక్ కుమార్ తిట్టాడు. 'అవినాశ్, మీ నాన్న నాకు ఫ్రెండు కదాని కాలేజీలో సీటిస్తే నువ్వు చేసే పని యిదా?' అన్నాడు. క్లాసు విడిచాక హీరో హీరోయిన్ వద్దకు వచ్చి తనను అపార్థం చేసుకోవద్దన్నాడు. ‘నేను వేసిన బొమ్మ నా ఊహాసుందరిది. నా రూముకి రండి, మిమ్మల్ని చూడడానికి ముందే వేసిన బొమ్మలు అనేకం వున్నాయి’ అన్నాడు. బొమ్మలు చూశాక ఆమె కన్విన్స్ అయింది. అతనిపై అభిమానం పెంచుకుంది. అతను బీదవాడు. బొమ్మలు వేసి డబ్బులు సంపాదించి చదువుకుంటున్నాడు. హీరోయిన్ కూడా పేదదే. ఆమెకు ఓ అన్న వున్నాడు. ఐయస్ జోహార్. ఉద్యోగం చేయడమంటే బోరు. నాటకాలు రాసి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం. చెల్లికి కాలేజీ ఫీజులు కూడా కట్టే స్థితిలో లేడు.
తెలుగులో కూడా హీరో, హీరోయిన్లు కాలేజీలో కలుస్తారు. సావిత్రికి అగ్గిబరాటాగా పేరుంది. ఆమె పక్కన కూచుంటే వంద రూపాయలిస్తానని ఫ్రెండ్సు పందెం కాస్తే హీరో వెళ్లి ఆమె పక్కన కూచుంటాడు. పేదవాడిని, పందెం గెలిస్తే ఫీజు కట్టుకుంటానని బతిమాలుకుంటాడు. ఆమె జాలిపడి సరేనంటుంది. హీరోయిన్ నేపథ్యం విషయంలో హిందీలో, తెలుగులో తేడా వుంది. తెలుగులో చాలా పెద్ద కథే పెట్టారు. ఎస్వీ రంగారావు రావుబహద్దర్. ఆయనకో ప్రెస్, రాజభక్తి అనే పత్రిక వుంటాయి. ఆయనకూ, భార్య సూర్యకాంతానికి పిల్లలు లేక సావిత్రిని దత్తత తెచ్చుకుంటారు. సూర్యకాంతం చాలా గారాబం చేస్తుంది. ఇంతలో ఆమెకే గిరిజ పుడుతుంది. దాంతో యీమెను నిర్లక్ష్యం చేస్తుంది. రంగారావు భార్యను ఏమీ అనలేక, ఆ పిల్లను తన గుమాస్తా ఐన రేలంగికి పెంపకానికి యిచ్చేస్తాడు. రేలంగి వద్దనే సావిత్రి పెరిగి పెద్దయి, డాక్టరీ చదువుతోంది. రంగారావు ఆస్తి క్రమంగా తరిగిపోతోంది. రేలంగికి ఫీజు కట్టడం భారమౌతోంది. అందుకని సావిత్రి ఓ డబ్బున్నవాళ్లింట్లో ఓ కుర్రాడికి ట్యూషన్ చెపుతోంది.
హీరో విషయంలో చూస్తే, హిందీలో హీరో బొమ్మలేసి డబ్బులు సంపాదిస్తాడు. తెలుగులో మారుపేరుతో కవిత్వం రాసి డబ్బులు గడిస్తుంటాడు. కాలేజీ ఫంక్షన్లో అతని చేత పాట రాయించాలని సావిత్రి ప్రయత్నిస్తుంది. ఆ సందర్భంలో కొన్ని హాస్యఘట్టాలు పెట్టారు తెలుగులో. హిందీలో హాస్యమంతా హీరోయిన్ అన్న రచనాపాటవం మీదే వుంటుంది. హిందీ సినిమాలో అశోక్‌కుమార్‌ది ఓ ముఖ్యపాత్ర. హీరోయిన్ చక్కని సర్జన్ అవుతుందని, తనకు వారసురాలు అవుతుందని ఆయన ఆశ. ఫీజు కట్టలేక కాలేజీ మానేస్తానంటే అప్పుడో సూచన చేస్తాడు. తనకు తెలిసిన ఓ యిండస్ట్రియలిస్ట్ ఫిరోజ్ ఖాన్ వున్నాడని, అతని సవతి తమ్ముడికి ట్యూషన్ చెప్పమని సూచించాడు. కానీ ఆ స్టూడెంటు ఆడవాళ్ల వద్ద చదవనంటూ మొరాయించాడు. అతని తల్లికి కూడా టీచర్ నచ్చలేదు. కానీ హీరోయిన్ పట్టుదలతో అతన్ని చదివించింది.
తెలుగులో కుర్రాడు యింత మొండివాడు కాదు. కానీ ఆ రోజు సెలవడిగాడు, వాళ్ల మామయ్య ఫారిన్నుండి తిరిగి వస్తున్నాడని. ఆ మామయ్యే జగ్గయ్య. డాక్టర్. అతను సావిత్రిని చూస్తూనే మనసు పారేసుకున్నాడు. కానీ సావిత్రి అతన్ని హద్దుల్లో వుంచింది. ఓ రోజు ఆమె డాక్టరీ చదువుతోందని తెలిసి ఆశ్చర్యపడ్డాడు. కానీ సావిత్రి మాత్రం నాగేశ్వరరావు అంటేనే యిష్టపడుతోంది. అతనితో కలిసి షికార్లు తిరుగుతోంది. అప్పుడు వచ్చేదే ‘ఓ రంగయో’ పాట. హిందీలో కూడా యిలాటి పాటే ‘నదియా చలేచలేరే ధారా’ అనే నావికుల పాట వస్తుంది. బెంగాలీ నవలలోనూ, హిందీ సినిమాలోనూ యీ పాట వచ్చేసరికే హీరోకి జబ్బు వచ్చిందని తెలిసిపోతుంది. అతను చావకూడదని అనుకోవడం, ఈమె సపర్యలతో కాస్త కోలుకోవడం కూడా జరుగుతుంది.
హిందీ సినిమాలో నావికుల పాట విని హీరో నా జీవితానికి కూడా ఓ నావికుడి అవసరం వుంది అంటాడు. వారి ప్రేమకు యీ జబ్బుతో బాటు యింకో అవాంతరం కూడా వచ్చింది. హీరోయిన్ ట్యూషన్ చెప్పే మోంటూ అన్నగారు ఫిరోజ్ ఖాన్ యీమె వెంట పడ్డాడు. అతను షేర్మార్కెట్లో వ్యాపారి. ఇప్పటిదాకా బాగానే సంపాదిస్తూ వచ్చాడు కానీ యీమె పట్టించుకోకపోవడంతో దిగాలు పడి వ్యాపారం చెడగొట్టుకుంటున్నాడు. అతను యీమె గురించి అంత వెంపర్లాడడం అతని సవతి తల్లికి మంటగా వుంది. ఓ రోజు హీరోయిన్ తన కొడుకుని దండిస్తూంటే ఆ సాకు పెట్టి ఆమె ఉద్యోగం పీకేసింది. విషయం తెలిసి ఫిరోజ్, అశోక్ కుమార్ వద్దకు వస్తే ఆమె ఎలాటిదనుకున్నావంటూ అశోక్‌కుమార్ అతన్ని తిట్టాడు. 'నేను ఆమెను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను' అన్నాడు ఫిరోజ్ ఖాన్.
అయితే అవినాశ్ చేత చెప్పించు అన్నాడు అశోక్ కుమార్. ఫిరోజ్ హీరోయిన్ అన్న దగ్గరకు వెళ్లినా అక్కడా అతనూ అదే చెప్పాడు. యీమె మీద అంత యిన్‌ఫ్లుయెన్సు వున్న యీ అవినాశ్ ఎవడ్రా అనుకుంటూ ఫిరోజ్ హీరో గదికి వెళ్లాడు. ఈ లోపునే హీరోకి తను మృత్యుముఖంలో వున్నానని తెలిసిపోయింది. జీవితం గురించి, చావు గురించి పాట పాడుకున్నాడు. ఈ దశలో ఫిరోజ్ వచ్చి హీరోయిన్‌కు నచ్చచెప్పమని కోరాడు. సరేనన్నాడు హీరో. హీరోయిన్‌కు తన రిపోర్టు చూపించాడు. బ్లడ్ కాన్సర్ ముదిరింది, నా జీవితం వ్యర్థం అయింది. నా మాట విని ఫిరోజ్ని పెళ్లి చేసుకుంటే కనీసం నా చావు వ్యర్థం కాదని బతిమాలాడాడు. ఎవరి ఆసరాతో జీవిస్తున్నానో వారికి సొంతం కాలేకపోయానని హీరోయిన్ విలపించింది. తన ప్రేమికుడి కోరికపై ఫిరోజ్‌తో పెళ్లికి ఒప్పుకుంది.
తెలుగులో యీ ఘట్టానికి ఎలా వచ్చారో చూదాం. హీరోకి దగ్గు బాగా వస్తూండడంతో డాక్టర్ వద్దకు వెళ్లాడు. క్షయ అని చెప్పి మందులిచ్చారు. సావిత్రి దిగాలు పడింది. అతని మందులు కొని పరధ్యానంతో ట్యూషన్ చెప్పేచోట మర్చిపోయింది. జగ్గయ్య వాటిని చూడగానే గుర్తు పట్టాడు. రోగి ఎవరన్నాడు. కావలసినవాళ్లంది సావిత్రి. జగ్గయ్య అక్క సంధ్య తమ్ముడి ప్రేమ గ్రహించి రేలంగి వద్దకు వచ్చి పెళ్లి ప్రపోజల్ తెచ్చింది. కానీ సావిత్రి సంబంధం తిరక్కొట్టేసింది. జగ్గయ్యకు కూడా చెప్పేసింది. ఇంతలో హీరో పరిస్థితి విషమించింది. జగ్గయ్య కూడా వచ్చి చూశాడు. హీరోకి తన పరిస్థితి తెలిసింది. ట్యూషన్ కుర్రవాడి ద్వారా సావిత్రి జగ్గయ్య సంబంధం తిరక్కొట్టిందన్న సంగతీ తెలుసుకున్నాడు. ఆమెతో వాదించి జగ్గయ్యతో పెళ్లికి ఒప్పించాడు. పెళ్లి జరిగింది. జగ్గయ్య తన ఖర్చుపై హీరోని మదనపల్లె శానిటోరియంకు పంపాడు. ఈ సందర్భంలో సావిత్రికి ఓ రంగయో పాట, కష్టజీవుల గురించి హీరో వేదన గుర్తుకు వచ్చింది. వారికోసం ఆసుపత్రి కడదామని ప్రతిపాదించింది. జగ్గయ్య సరేనన్నాడు.
ఒరిజినల్లో కూడా యీ ఘట్టం వుంది. నావికుల పాట వినగానే యిక్కడ హీరోయిన్‌కు హీరో గుర్తుకు వచ్చాడు. తన పెళ్లికి అతను రాలేదనీ గుర్తుకు వచ్చింది. అతని రూముకి బయలుదేరింది. ఇక్కణ్నుంచి ఒరిజినల్, తెలుగు సినిమా వేర్వేరు దారుల్లో నడుస్తాయి. హీరోతో సంబంధం వుందని ఫిరోజ్‌కు తన భార్యపై అనుమానం. భార్య హీరో గదికి వెళ్లినపుడల్లా తన తమ్ముణ్ని గూఢచారిగా పంపుతూ వుంటాడు. అతని అనుమానం బలపడేట్లు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈ అనుమానాలతో బిజినెస్ పాడుచేసుకుంటాడు. షేర్ మార్కెట్లో యితను వేసిన తప్పటడుగు వలన 25 లక్షలు నష్టం వస్తుంది. ఆస్తులమ్ముతాడు కానీ భార్యకు ఏ విషయమూ చెప్పడు. అది తెలిసి భార్య పోట్లాడుతుంది. నాపై విశ్వాసం లేదా? అని.
ఇలాటి పరిస్థితుల్లో అనుకోకుండా అతని చేతిలో ఓ ఉత్తరం పడుతుంది. అది యింట్లో బాధ పడలేక నీతో లేచిపోతానని హీరోయిన్, హీరోని వుద్దేశించి రాసిన లేఖ. అది నిజానికి ఆమె రాయలేదు. ఆమె హ్యేండ్ రైటింగ్ కాపీ కొట్టి హీరో ఎప్పుడో రాసిన లేఖ. ఆమె వాళ్లన్న గారింట్లో వుండే రోజుల్లో సరదాకి యీ ప్రాక్టికల్ జోక్ చేశాడు. విషయం తెలిసాక నవ్వుకుని ఆమె అది దాచుకుంది. అది యిప్పుడు బయటపడి భర్త అనుమానానికి ఊతం యిచ్చింది. అతను భార్యమీద కసి పెంచుకుని ఆత్మహత్య చేసుకుంటూ ఆమెను కేసులో యిరికించాడు. పొటాషియం సైనైడ్ గ్లాసులో కలుపుకుని తాగుతూ ఆ గ్లాసుపై ఆమె వేలిముద్రలు వుండేట్లు చూశాడు.
తెలుగు వెర్షన్లో కూడా హీరోయిన్ భర్త చనిపోయాడు. కానీ యిలాటి పరిస్థితుల్లో కాదు. హీరో ఆరోగ్యవంతుడై శానిటోరియం నుండి తిరిగి వస్తూంటే అతన్ని రిసీవ్ చేసుకోవడానికి వెళుతూ కారు యాక్సిడెంటులో పోయాడు. హీరోయిన్ను వితంతువుగా చూసి, యీ పరిస్థితిలోకి నెట్టినందుకు హీరో తనను తాను నిందించుకున్నాడు. జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఉద్బోధించాడు. ఆమె వైద్యవృత్తికే జీవితం అంకితం చేసింది.
హిందీ సినిమా యిలాటి పద్ధతిలోనే ముగుస్తుంది. హీరోయిన్‌పై హత్యానేరం మోపబడింది కానీ ఆమె అలాటిది కాదు అని కోర్టులో అత్తగారు సాక్ష్యం చెప్పింది. దాంతో విడుదల అయింది. అశోక్ కుమార్ ప్రోద్బలంతో చదువు కొనసాగించి మంచి సర్జన్‌గా తయారైంది. పేషంట్స్ తప్ప ఆమె జీవితంలో వేరెవరూ మిగలరు. హీరో సంగతి ఏమిటంటారా? తన భర్త అనుమానస్తుడిగా తయారయ్యాడని ఆమె చెప్పినపుడు ‘అది అతని ప్రేమ’ అని చెప్పి ఆమెను యింటికి పంపించి అతను ఊరొదిలి వెళ్లిపోయాడు. ఆ రాత్రే ఫిరోజ్ ఆత్మహత్య, హీరోయిన్ ఎరెస్టు జరిగాయి. ఇవేవీ హీరోకి తెలియవు. చావు ముంచుకు వచ్చాక మళ్లీ తిరిగి అశోక్ కుమార్ దగ్గరకు వచ్చాడు. హీరోయిన్ కోసం కలవరించాడు. అశోక్ కుమార్ ఆ విషయం ఆమెకు చెప్పి వెళ్లి హీరోని చూసి రమ్మన్నాడు. ఆమె వెళ్లబోతూండగా వేరే కేసు వచ్చింది. వైద్యానికే ప్రాధాన్యం యిచ్చే హీరోయిన్ ఆ కేసు ఎటెండ్ అయి ఆలస్యంగా వెళ్లింది. ఆ లోపునే హీరో పోయాడు. అతనంటే అభిమానం పెంచుకున్న హీరోయిన్ మరిది నువ్వే అతన్ని చంపావ్ అని తిట్టిపోశాడు.
నిజానికి యీ ఈ కథంతా ఫ్లాష్‌బ్యాక్‌లో చూపారు. ఆమె ఒక ఆపరేషన్ చేస్తూ చేస్తూంటే మధ్యలో ఫెయిల్ అవుతుంది. ఆమె బయటకు వచ్చేసింది. పేషంట్ కొడుకు వచ్చి నువ్వే చేతకాక నా తల్లిని చంపావ్, నువ్వు హంతకురాలివి అని తిట్టాడు, అచ్చు తన మరిది లాగే! ఆమె అధైర్యపడింది. అప్పుడు అశోక్‌కుమార్ వచ్చి ధైర్యం చెప్పాడు – 'మన డాక్టర్లమే. ప్రాణం పోయలేం. ఫెయిల్యూర్స్ వుంటాయి. నా సొంత కూతురు ఆపరేషన్ సరిగ్గా చేయలేకపోయాను. నా చేతిలో చనిపోయింది. మరింత పట్టుదలగా ఆపరేషన్లు చేసి బాధ పోగొట్టుకున్నాను. నువ్వు కూడా సొంతబాధలు మర్చిపోయి వృత్తిలో మునిగిపో' అని. హీరోయిన్‌కు అలాగే చేసింది. బెస్ట్ సర్జన్‌గా ఎవార్డు వచ్చింది. హీరోయిన్‌కు ప్రియుడూ, భర్తా, పిల్లా పాపా ఎవరూ మిగలరు. కానీ ఆశాకిరణం ఏమిటంటే, కథ చివరిలో మరిది పెరిగి పెద్దవాడై ఆమెను క్షమాపణ కోరుతూ ఉత్తరం రాయడం!
తెలుగు సినిమాకు వస్తే, హీరోయిన్ డాక్టరై అందరికీ ఉపకారాలు చేస్తూ ఎస్వీ రంగారావు కుటుంబానికి కూడా సాయపడుతోంది. గిరిజకు ఎక్కడా పెళ్లిసంబంధాలు కుదరటం లేదు. గిరిజ మంచిదే అయినా సూర్యకాంతం నోటికి దడిసి సంబంధాలు తప్పిపోతున్నాయి. ఇప్పుడు ఆరోగ్యవంతుడై వున్న హీరోకి ప్రపోజ్ చేశారు. కానీ అతను పెళ్లి వద్దన్నాడు. అప్పుడు హీరోయిన్ వెళ్లి కన్విన్స్ చేసింది. హీరోయిన్‌పై గౌరవంతో పెళ్లి చేసుకున్నాడు. గిరిజను ఆదరంగా చూసుకుని పిల్లవాణ్ని కన్నాడు. అంతేకాదు, మావగారి ప్రెస్‌లో పత్రికలో మార్పులు తెచ్చి వాళ్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాడు. అయితే అది వాళ్ల అహంకారాన్ని పెంచింది. సావిత్రి వాళ్ల యింటికి రాకపోకలు సాగించడం, పిల్లాడిని సొంత బిడ్డలా చూసుకోవడం సూర్యకాంతానికి నచ్చలేదు. కూతురి మనసులో అసూయ నూరిపోసింది. అనుమానం రగిలించి ఆమె కాపురంలో నిప్పులు పోసింది.
భార్యాభర్తల మధ్య ఈ ఎమోషనల్ గొడవతో బాటు ఆర్థికపరమైన వివాదం కూడా వచ్చింది. ప్రెస్మీద వచ్చిన డబ్బుతో కార్మికులకు బోనస్ యివ్వకుండా కారు కొనడమేమిటని హీరో అత్తమామలను నిలదీశాడు. కార్మికులు చేసే సమ్మెకు మద్దతిచ్చాడు. పంతానికి పోయిన మావగారు పోలీసులను పిలిచి లాఠీచార్జి చేయించాడు. భర్త మంచితనం తెలిసి అతన్ని కాపాడుకోబోయిన గిరిజకు తల పగిలింది. సావిత్రి ఆపరేషన్ చేసి కాపాడింది. గిరిజకు కనువిప్పయింది. క్షమాపణ కోరింది. అన్ని అనర్థాలకు మూలకారణమైన సూర్యకాంతం కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంది. కథ సుఖాంతమైంది
మూలరచన ఐన బెంగాలీ నవల రాసిన అశుతోష్ ముఖర్జీ వృత్తిరీత్యా ఓ డాక్టర్. ''చివరకు మిగిలేది'' సినిమా కథ రాసినది కూడా ఆయనే. వ్యక్తిగత సమస్యలతో డాక్టర్లు ఎమోషనల్‌గా ఎలా ఒత్తిడి గురవుతారో, అది వృత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో రాస్తారు. దాని మీదే ఆయన ఫోకస్. హిందీ సినిమా దాన్ని అనుసరించే తీశారు. అసిత్ సేన్ డైరక్ట్ చేశారు. తెలుగులో దుక్కిపాటి మధుసూదనరావుగారు వైద్యవృత్తి కంటె ఫ్యామిలీ సెంటిమెంటుపైననే దృష్టి పెట్టి కథ రాయించారు. సొంత పిల్లలు పుట్టాక దత్తత తీసుకున్నవాళ్లను నిర్లక్ష్యం చేయడం ఆయన నిజజీవితంలో స్వయంగా చూసి కథలో జోడించారట. ఆదుర్తి సుబ్బారావు ప్రతిభావంతంగా డైరక్టు చేశారు. అభినయం సంగతి చెప్పనే అక్కరలేదు. ఒకరితో మరొకరు పోటీ పడి నటించారు. –
ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)