మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్యన ఏర్పడిన ప్రభుత్వానికి తొలి ఝలక్ ను ఇచ్చారు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ. మహారాష్ట్రకు పొరుగు రాష్ట్రాల నుంచి దశాబ్దాల వలస విషయంలో ఉన్న తేనెతుట్టెను కదిల్చారు కొశ్యారీ. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి.. మహారాష్ట్రీయుల్లో చిచ్చు పెట్టేలా ప్రాంతీయ తత్వాన్ని రేపే వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రకు పొరుగు నుంచి వచ్చిన రాజస్తాన్, గుజరాతీలను పంపించి వేస్తే.. మహారాష్ట్రలో డబ్బే మాయం అవుతుందన్నట్టుగా కొశ్యారీ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది.
మహారాష్ట్రకు వలసల విషయంలో మరాఠీలకు ముందు నుంచినే గుజరాతీ, రాజస్తానీలపై ఒకింత అసహనం ఉంది. ఈ వ్యవహారంలో వాదోపవాదాలు ఎలా ఉన్నా.. ఒక గవర్నర్ హోదాలోని వ్యక్తి ఈ తరహాలో మాట్లాడటం నిస్సందేహంగా సబబు కాదు. ఈ మధ్యనే శివసేనలోని చీలిక వర్గం ఆధారంగా బీజేపీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. దీనిపై ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంటుంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ మరాఠా వాదాన్నితప్పు పట్టేలా వ్యాఖ్యానించడం వివాదంగా మారింది.
దీంతో తక్షణం ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా స్పందించారు. గవర్నర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు, విచారం వ్యక్తం చేశారు! ఈ తిరుగుబాటు కూటమి ప్రభుత్వానికి కొశ్యారీ అండదండలైతే ఉన్నాయి. గతంలో ఉద్ధవ్ ఠాక్రేను కూడా ఈ గవర్నరే ముప్పుతిప్పలు పెట్టారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నియమిత గవర్నర్ అయిన కొశ్యారీ ఇలా వ్యాఖ్యానించడం ప్రతిపక్ష పార్టీలకూ, ఠాక్రే వర్గానికి అనుకూలమైన పాయింట్ గా మారుతోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రే ఆ వ్యాఖ్యలను తప్పు పడుతూ ప్రకటన చేసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రతిపక్షాలు గవర్నర్ పై దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి. అసలే డొంక తిరుగుడు పద్ధతిలో,బోలెడంత డ్రామా తర్వాత షిండే ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి తరుణంలో.. గవర్నర్ వ్యాఖ్యలు షిండేకు తలపోటుగా మారే అవకాశాలు, ప్రతిపక్షాలకు అవకాశాలను ఇచ్చేవిలా ఉన్నాయి.