ఐదారు సీట్లు గెలిచినా టీడీపీకి ఉపయోగమేనట

ఇది ఏపీలో కాదండోయ్. అక్కడ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటుంటే ఐదారు సీట్లు ఏం సరిపోతాయి? ఈ కలలు కంటున్నది తెలంగాణాకు సంబంధించి. తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని బాబు ఏపీ…

ఇది ఏపీలో కాదండోయ్. అక్కడ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటుంటే ఐదారు సీట్లు ఏం సరిపోతాయి? ఈ కలలు కంటున్నది తెలంగాణాకు సంబంధించి. తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని బాబు ఏపీ -తెలంగాణ సరిహద్దులో ఉన్న వరద ముంపు ప్రాంతాల్లో (తెలంగాణా నుంచి ఏపీలో కలిసిన విలీన మండలాలు) పర్యటించినప్పుడు వ్యాఖ్యానించారు. ఏలూరు జిల్లా మీదుగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు భద్రాచలంలో బస చేశారు. రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం గోదావరి ముంపు ప్రాంతాల్లో తిరిగారు. గోదావరి వరద నుంచి భద్రాచలంను కాపాడిన కరకట్టను పరిశీలించారు చంద్రబాబు. 2003లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం నీట మునిగింది.

ఆ తర్వాత గోదావరికి కరకట్ట కట్టారు. అప్పుడు కట్టిన కరకట్ట వల్లే ఈసారి రికార్డ్ స్థాయిలో వరద వచ్చినా భద్రచాలం సేఫ్ గా ఉందని అంటున్నారు. అందుకే తన హయాంలో నిర్మించిన కరకట్టను పరిశీలించిన చంద్రబాబు.. స్థానికులతో మాట్లాడారు, తర్వాత ఖమ్మం, మహబూబ్ బాద్ లోక్ సభ టీడీపీ కమిటీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. తెలంగాణలో టీడీపీకి అద్భుతమైన స్పందన ఉందన్నారు చంద్రబాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇదంతా బాబు చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఇది కేవలం ఆయన భ్రమ మాత్రమే. 

పోనీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి అద్భుతమైన స్పందన ఉందనుకుందాం. దానివల్ల పార్టీకి ఏం ఉపయోగం? రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఏమిటి? అది ఆలోచించాలి కదా. చంద్రబాబు తెలంగాణపై  సీరియస్ గానే ఫోకస్ చేస్తున్నారా? ఆయన ఎంత ఫోకస్ చేసినా  తెలంగాణలో గత వైభవం అంతరించిందనే చెప్పాలి. సరే … తెలంగాణా పట్ల బాబు ఆలోచన ఏమిటో చూద్దాం.  ప్రస్తుతం రాష్ట్రలో బహుముఖ పోటీ నెలకొంది.

అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. బీఎస్పీ కన్వీరన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జోరుగా తిరుగుతున్నారు. ఈ రెండు పార్టీలకు కొంత ఓటు బ్యాంక్ వస్తుందని వివిధ సర్వేలు చెబుతున్నారు. జనసేన కూడా తెలంగాణలో పోటీ చేస్తామని ప్రకటించింది. హైదారాబాద్ లో మజ్లీస్ పార్టీ ఉండనే ఉంది.

దీంతో తెలంగాణలో ఈసారి హంగ్ ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉన్నారట చంద్రబాబు. హంగ్ వస్తే చిన్న పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఓ ఐదారు సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ కావచ్చనే అంచనాతోనే తెలంగాణపై చంద్రబాబు దృష్టి పెట్టారని ఆ పార్టీ వారు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఆంధ్రా ఓటర్లు భారీగానే ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ దాదాపు 10 నియోజకవర్గాల్లో సెటిలర్లే కీలకం. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం  చేయాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారంటున్నారు. సెప్టెంబర్ లో ఖమ్మంలో సభ తర్వాత గ్రేటర్ లో మరో బహిరంగ సభకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మొత్తంగా ఓ ఐదారు సీట్లు గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర  పోషించవచ్చన్న అంచనాతో ఉన్నారని తమ్ముళ్లు చెబుతున్నారు.

బాబు ఊహాగానాలు బాగానే ఉన్నాయిగానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. టీడీపీకి తెలంగాణలో సరైన నాయకత్వం లేదు. ఓటు బ్యాంకు కూడా ఇప్పుడు లేకుండా పోయింది. కేవలం రెండు, మూడు నియోజకవర్గాలు తప్పించి తెలంగాణలో ఎక్కడా టీడీపీ బలంగా లేదు. ఎల్. రమణ పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏదో నామమాత్రంగా పార్టీని అక్కడ ఉంచారు తప్ప దానిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. మహానాడులో కూడా తెలంగాణకు పెద్దగా ప్రాధాన్యత దక్కేలేదు. ఇక టీడీపీ కార్యక్రమాలు తెలంగాణలో పెద్దగా జరిగింది లేవు. జరుగుతున్నదీ లేదు. ఇక్కడ అసలు ఆ పార్టీ ఉన్న దాఖలాలు కూడా లేవు. 

ముఖ్యమైన నేతలందరూ ఇతర పార్టీలకు జంప్ అయ్యారు. కొద్దో గొప్పో ఉన్న నేతలు కూడా కేవలం ఏ పార్టీలో చోటు లేకనే ఇక్కడ ఉంటున్నారు తప్పించి, టీడీపీ బలోపేతం అవుతుందని, ఇక్కడేదో సాధిస్తామన్న ధ్యాస ఉన్న వారిలో లేదు. బాబుకు తొలుత ఆంధ్రప్రదేశ్ లో విజయం ముఖ్యం. అక్కడ పార్టీ బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావడానికి తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఆయన భవిష్యత్ లో తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశమూ లేదు. 

జాతీయ పార్టీగా ఉండాలని అనుకుంటున్నందున ఈసారి కొద్ది స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఆయన కసరత్తు చేసే అవకాశమూ కన్పించడం లేదు. అంత ఓపికా, అంత సమయమూ చంద్రబాబుకు లేదు. ఆయన అనుకున్నట్లు ఐదారు సీట్లు వస్తే అదృష్టం. అంతే.