భూమా అఖిల‌, మౌనిక‌ల‌పై కోర్టుకెక్కిన త‌మ్ముడు

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, ఆమె చెల్లి మౌనిక‌ల‌పై స్వ‌యాన త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి హైకోర్టులో కేసు వేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఆస్తి వివాదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలో కిందికోర్టులో అక్క‌ల‌పై త‌మ్ముడు…

మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, ఆమె చెల్లి మౌనిక‌ల‌పై స్వ‌యాన త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి హైకోర్టులో కేసు వేయ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఆస్తి వివాదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలో కిందికోర్టులో అక్క‌ల‌పై త‌మ్ముడు విఖ్యాత్‌రెడ్డి వేసిన కేసు నిల‌బ‌డ‌లేదు. త‌మ్ముడితో క‌లిసి అక్క‌లు ఆడుతున్న డ్రామాగా న్యాయ‌స్థానంలో నిరూపించ‌డంతో కేసు కొట్టి వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే హైకోర్టులో అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డి ప్ర‌య‌త్నించ‌డం గ‌మ‌నార్హం. కేసుకు దారి తీసిన ప‌రిస్థితులు ఏంటంటే…

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం (ఇప్పుడు గండిపేట‌) మంచిరేవుల‌లో స‌ర్వేనంబ‌ర్ 190, 192/A, 92/Bల‌లో  ప్లాట్ నంబ‌ర్ 9, ప్లాట్ నంబ‌ర్ 20ల‌లో భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి పేరుతో వెయ్యి గ‌జాల స్థ‌లం ఉండేది. 2014లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లి వ‌స్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో శోభ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. 2016లో ఆ భూమిని భూమా నాగిరెడ్డి దాదాపు రూ.2 కోట్ల‌కు అమ్మిన‌ట్టు తెలిసింది. రిజిస్ట్రేష‌న్ సంద‌ర్భంలో భూమా నాగిరెడ్డి, ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్లు అఖిల‌ప్రియ, మౌనిక సంత‌కాలు చేశారు. నాగిరెడ్డి కుమారుడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. అప్ప‌టికి అత‌ని వ‌య‌సు 17 ఏళ్లు.

గ‌త కొన్నేళ్లుగా భూముల‌కు విప‌రీత‌మైన రేట్లు వ‌చ్చాయి. నాగిరెడ్డి అమ్మిన ప్లాట్ల విలువ‌ ప్ర‌స్తుతం రూ.6 కోట్లు. దీంతో భూమా అఖిల‌ప్రియ‌, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌, ఆమె త‌మ్ముడు జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డిల‌కు స‌ద‌రు ప్లాట్ల‌పై క‌న్ను ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. ఇలాంటి వాటిల్లో మాస్ట‌ర్ ప్లాన్స్ వేయ‌డంలో అఖిల దంప‌తులు దిట్ట‌లనే పేరుంది. మౌనికారెడ్డితో అఖిల‌ప్రియ‌, త‌మ్ముడు జ‌గ‌త్‌ల‌కు మంచి సంబంధాలు లేవ‌ని స‌మాచారం. క‌నీసం వాళ్ల మ‌ధ్య ప‌ల‌క‌రింపులు కూడా లేవ‌ని తెలిసింది. అయితే ఉమ్మ‌డి ప్రాప‌ర్టీ కావ‌డంతో ఆమెను కూడా క‌లుపుకుంటుంటారు.

ఈ నేప‌థ్యంలో 2019, న‌వంబ‌ర్ 14న ఇద్ద‌రు అక్కల‌తో పాటు ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన వారిపై కిందికోర్టులో జ‌గ‌త్ కేసు వేశాడు. అప్ప‌ట్లో జ‌గ‌త్‌కు అఖిల‌ప్రియ మ‌రిది శ్రీ‌సాయిచంద్ర‌హాస్ లాయ‌ర్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాగే అక్కలపై న్యాయ పోరాటం చేస్తున్న త‌మ్ముడు జ‌గ‌త్ ఒకే ఇంట్లో ఉంటున్న‌ట్టు అడ్ర‌స్ ఉండ‌డం కూడా వారి డ్రామాల‌ను ఎత్తి చూపింద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి. కింది కోర్టులో న్యాయ పోరాటం భూమా అఖిల‌, త‌మ్ముడికి క‌లిసి రాలేదు. కేసు కొట్టివేశారు.

ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన ఎస్‌.సుధాక‌ర్‌రెడ్డి (రాజేంద్ర‌న‌గ‌ర్‌), హ‌రిత వెంక‌ట చీమ‌ల (రాజేంద్ర‌న‌గ‌ర్‌), సుబ్బ‌రాయ‌ప్ర‌పుల్లా చంద్ రేటూరి (హైద‌రాబాద్‌), ప్ర‌వీణ రంగోల (వెస్ట్‌గోదావ‌రి), స‌య్య‌ద్ఎథెశ్యామ్‌హుస్సేన్ (హైద‌రాబాద్‌)ల‌కు అనుకూలంగా తీర్పు వ‌చ్చింది.

దీంతో అత‌ను తాజాగా తెలంగాణ హైకోర్టులో ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన ఐదుగురితో పాటు త‌న ఇద్ద‌రు అక్క‌ల‌పై కూడా కేసు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే ఈ ద‌ఫా త‌న అక్క‌ల చిరునామాల‌ను వేర్వేరుగా ఇచ్చాడు. అలాగే లాయ‌ర్‌ను కూడా మార్చుకున్నాడు. భూమా నాగిరెడ్డి బ‌తికున్న కాలంలో ఒక ర‌క‌మైన రౌడీయిజానికి పాల్ప‌డితే, ఇప్పుడు వారి పిల్ల‌లు చ‌ట్టాన్ని దుర్వినియోగం చేస్తూ, బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డుతున్నార‌ని స్థ‌లం కొనుగోలుదారులు వాపోతున్నారు. 

తాను మైన‌ర్‌గా ఉన్న‌ప్పుడు స్థ‌లం అమ్మార‌ని, ఇప్పుడు మేజ‌ర్‌ని అని, త‌న‌కు భాగం కావాల‌ని జ‌గ‌త్ న్యాయ‌పోరాటానికి దిగ‌డం వెనుక అఖిల‌ప్రియ, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్ ప్రోత్సాహ‌మే కార‌ణ‌మ‌ని స్థ‌లం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.  

ఇదిలా ఉండ‌గా నంద్యాల జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో ఓ బ్యాంక్‌లో త‌న‌ఖా పెట్టిన భూముల్ని అఖిల‌ప్రియ , ఆమె కుటుంబ స‌భ్యులు అమ్మ‌కంపై కూడా వివాదం నెల‌కుంది. ఇళ్ల‌ను నిర్మించుకోవాల‌ని భావించి లోన్ కోసం బ్యాంకులకు వెళ్ల‌గా ….ఆ భూమి త‌న‌ఖాలో ఉన్న విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో కొనుగోలుదారులు ల‌బోదిబోమంటున్నారు. 

అఖిల‌ప్రియ త‌మ‌ను మోసం చేసింద‌ని, న్యాయం చేయాలంటూ పోలీసు స్టేష‌న్ చుట్టూ సామాన్య ప్ర‌జానీకం తిరుగుతోంది. అధికార పార్టీ నేత‌ల చుట్టూ తిరుగుతున్నా, ఎందుక‌నో వారు కూడా ప‌ట్టించుకోలేద‌నే విమ‌ర్శ‌లున్నాయి.