ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతిలో రాయలసీమ భవిష్యత్ వుంది. సీమ కరవు నేలను నీళ్లతో నింపి సస్యశ్యామలం చేస్తారా? లేక మిగిలిన పాలకుల్లా ఏమీ చేయకుండా పదవీ కాలం ముగిస్తారా? అనే చర్చకు తెరలేచింది.
కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టులకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. వీటిలో ఆరు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ పథకాలకు అనుమతి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు రాయలసీమ సాగు, తాగునీటికి ప్రాణప్రదమైనవి. ఇవి పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఆ ప్రాంత రైతాంగం, ఇతర ప్రజానీకం ఆశిస్తోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారు.
ఈ ప్రాజెక్టుల పరిధిలో పొలాలకు కాలువలు తీసి సాగునీటిని అందించాల్సి వుంది. ఉదాహరణకు సర్వరాయసాగర్ దాదాపు పూర్తయినా లింక్ కెనాల్స్ తవ్వకపోవడంతో బీడు భూములకు నీళ్లు అందడం లేదు.
ఇంత కాలం కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవనే సాకు చూపుతూ వచ్చారు. ఇప్పుడు ఆ అడ్డంకి కూడా తొలగింది. ఈ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై వుంది.
తాను అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ చనిపోయే నాటికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు వెంటనే మొదలు పెట్టి, రాయలసీమ వాసుల చిరకాల కోరికగా మిగిలిన కృష్ణా నీటిని అందించాల్సి వుంది. కృష్ణా నీళ్లు సీమ బీడు భూములను స్పృశిస్తే, ఆ ప్రాంత రైతాంగం పరవశిస్తుంది.
సీమ వాసిగా రైతుల ఆకాంక్షలకు తగ్గట్టు ఆ ప్రాంత ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజానీకం డిమాండ్ చేస్తోంది.