సిగ్గు…సిగ్గు ప‌డుతోంది!

చంద్ర‌బాబును చూసి సిగ్గే సిగ్గు ప‌డుతోంది. అధికారం కోసం ప్ర‌త్య‌ర్థిని అడుక్కోడాన్ని చూసి… ఔరా ఏమీ దుస్థితి అని విమ‌ర్శించే వాళ్లే ఎక్కువ‌. త‌న చేతికి అధికారం ఇస్తే పోల‌వ‌రాన్ని ఏదో చేసాస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు…

చంద్ర‌బాబును చూసి సిగ్గే సిగ్గు ప‌డుతోంది. అధికారం కోసం ప్ర‌త్య‌ర్థిని అడుక్కోడాన్ని చూసి… ఔరా ఏమీ దుస్థితి అని విమ‌ర్శించే వాళ్లే ఎక్కువ‌. త‌న చేతికి అధికారం ఇస్తే పోల‌వ‌రాన్ని ఏదో చేసాస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబును చూసి నిర్వాసితులు అవాక్క‌వుతున్నారు. త‌మ‌కు సాయం చేయ‌డానికి చంద్ర‌బాబుకు ఐదేళ్ల అధికారం చాల‌లేదా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని పోల‌వ‌రం ముంపు మండ‌లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట‌లు వింటే… ఒక్క చంద్ర‌బాబు త‌ప్ప ఇలాంటి సిగ్గులేని మాట‌లు మ‌రొక‌రు మాట్లాడ‌లేర‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు చేత‌కాక‌పోతే త‌ప్పుకోవాల‌ని చంద్ర‌బాబు కోరారు. 

పోల‌వ‌రం ఎందుకు పూర్తి కాదో తాను చూస్తాన‌న్నారు. వైసీపీ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి కాలేద‌న్నారు. మూడేళ్ల‌లో రూ.8 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన ప్ర‌భుత్వం పోల‌వ‌రం నిర్వాసితుల‌కు రూ.20 వేల కోట్లు ఇవ్వ‌లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌తి సోమ‌వారం పోల‌వరం అంటూ హంగామా సృష్టించిన చంద్ర‌బాబు… త‌న పాల‌న‌లో ఎందుకు పూర్తి చేయ‌లేదో ముందుగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. అస‌లు నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌కుండానే ప‌నులు మొద‌లు పెట్టిన ఘ‌న‌త త‌న‌దే అని చంద్ర‌బాబు విస్మ‌రించిన‌ట్టున్నారు. త‌న హ‌యాంలో నిర్వాసితుల‌కు రూ.20 వేల కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి వుంటే ఇవాళ ఈ క‌ష్టాలు ఉండేవి కాదు.

ఎన్‌డీఏలో భాగ‌స్వామిగా ఉండి పోల‌వ‌రం ప్రాజెక్టుకు నిధులు తెచ్చుకోలేని అస‌మ‌ర్థ సీఎం చంద్ర‌బాబు కాదా? అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఏంటి? త‌న పాల‌న‌లో చేసిన అప్పులనూ కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ ఖాతాలో వేయ‌డం చంద్ర‌బాబుకే చెల్లింది. 

తాను చేసిన అప్పుల‌ను ఎవ‌రి ప్ర‌యోజ‌నాల‌కు వాడుకున్నారో చంద్ర‌బాబు చెప్పాలి. మ‌రీ ముఖ్యంగా త‌న‌కు అధికారం అప్ప‌గించాల‌ని అడుక్కోవ‌డం ఏంటో? మ‌రీ ఇంత బ‌రితెగింపా?  అధికార‌మ‌నేది ప్ర‌జ‌ల భిక్ష‌.

జ‌గ‌న్‌ను అధికార భిక్ష వేయాల‌ని అడుక్కోడానికి చంద్ర‌బాబుకు ఏ మాత్రం సిగ్గు అనిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.