ఉత్తరాంధ్రాకు బీజేపీ ద్రోహం

ఏపీ విభజన తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలు అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో నడుస్తాయి అనుకుంటే ఉల్టా సీదా అయిందని ఉత్తరాంధ్రా అభివృద్ధి వేదిక మండిపడుతోంది. ఎనిమిదేళ్ళు అయినా కేంద్రం విభజన హామీలను ఏ మాత్రం…

ఏపీ విభజన తరువాత ఉత్తరాంధ్రా జిల్లాలు అన్ని విధాలుగా అభివృద్ధి పధంలో నడుస్తాయి అనుకుంటే ఉల్టా సీదా అయిందని ఉత్తరాంధ్రా అభివృద్ధి వేదిక మండిపడుతోంది. ఎనిమిదేళ్ళు అయినా కేంద్రం విభజన హామీలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఉత్తరాంధ్రా జిల్లాలకు తీరని అన్యాయం చేసిందని వేదిక ప్రతినిధులు విమర్శిస్తున్నారు.

తాజా అధ్యయనం చూస్తే ఉత్తరాంధ్రాలోని ఆరు జిల్లాలు అత్యంత దారుణంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఉమ్మడి ఏపీతో పోలిస్తే వ‌లసలు మరింత ఎక్కువ అయ్యాయని, పేదరికం పెరిగిందని, అక్షరాస్యత కూడా తగ్గిందని కూడా వారు నివేదికలను చూపిస్తున్నారు.

ఇప్పటికి విభజన చట్టంలోని అనేక అంశాలు అమలు కాలేదని ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఎం.శ్రీనివాస చెప్పారు. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ విషయంలో నూటికి నూరు పాళ్ళూ బీజేపీ నాయకత్వాన కేంద్ర ప్రభుత్వం తప్పు ఉందని అన్నారు. ఉత్తరాంధ్రాను మరింతగా దిగజార్చేలా కేంద్రం చర్యలు ఉన్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రాలోని ఆరు జిల్లాలకు సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలను తాము సిద్ధం చేస్తున్నామని, కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. తుచ తప్పకుండా విభజన హామీలు నెరవేర్చిన నాడే ఉత్తరాంధ్రా ప్రాంతానికి న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ఈ నెల 31న విజయనగరంలో నిరహించే సదస్సులో విజయనగరం సహా ఉత్తరాంధ్రా సమస్యల మీద చర్చిస్తామని ఆయన అంటున్నారు. మొత్తానికి కమలం పార్టీ నేతలు వెనకబడిన జిల్లాల ప్రజల చెవులలో పువ్వులు పెట్టారని అంటున్నారు.