మాజీ మంత్రి అనిల్‌కుమార్‌కు లోన్‌యాప్ రికవరీ ఏజెంట్ వేధింపులు తప్పలేదు. సదరు ఏజెంట్ అయిన అమ్మాయి వేధింపులు తట్టుకోలేక, ఒక దశలో సహనం కోల్పోయి చెప్పుతో కొడ్తానని తీవ్ర హెచ్చరికలు చేశారు. కనీస మర్యాద లేకుండా రికవరీ ఏజెంట్ అమ్మాయి సంభాషణపై జనం మండిపడుతున్నారు. సంబంధం లేదమ్మా అని ఎంతో వినయంగా మాజీ మంత్రి అనిల్ చెబుతున్నా, వితండ వాదం, లెక్కలేనితనంతో రికవరీ ఏజెంట్ మాట్లాడ్డంపై పౌర సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
మాజీ మంత్రి అనిల్‌కుమార్‌పై వేధింపులకు సంబంధించి ఆడియో కాల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మాజీ మంత్రి సహనాన్ని సదరు అమ్మాయి పరీక్షకు పెట్టారు. చివరికి మాజీ మంత్రే వివరాలు తెలుసుకుని ఫోన్ పెట్టేయాల్సిన పరిస్థితి ఎదురైంది.
హలో అనిల్‌కుమార్ గారా సార్ మాట్లాడుతోంది…తీయటి అమ్మాయి గొంతు పలకరించింది. అవునమ్మా అని ఎంతో మర్యాదగా మాజీ మంత్రి సమాధానం. పాతపాటి అశోక్‌కుమార్ ఏమవుతారు మీకు? …ఏజెంట్ ప్రశ్న. ఆయన ఎవరమ్మా? అని మాజీ మంత్రి ప్రశ్న. తెలియదా సార్ మీకు… మీ బ్రదర్ అని చెప్పి, మీ నెంబర్ ఇచ్చాడని అమ్మాయి చెబుతుంది. తెలియదమ్మా అని మాజీ మంత్రి సమాధానం. నెల్లూరే కదా అని ఆ అమ్మాయి ప్రశ్నిస్తుంది.
ఏం కావాలి? అని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నిస్తారు. ప్రత్యామ్నాయంగా మీ నెంబర్ ఇచ్చారని, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు సదరు రికవరీ ఏజెంట్ అమ్మాయి చెబుతుంది. ఆ తర్వాత ప్రియాంక అనే అమ్మాయి లైన్లోకి వస్తుంది. అశోక్ కుమార్ అనే వ్యక్తిది లోన్ పెండింగ్‌లో ఉందని, మీకు బావ అవుతానని చెప్పి మీ నెంబర్‌ను ప్రత్యామ్నాయంగా ఇచ్చాడంటుంది.
అమ్మా నేనెవరో తెలుసా? అని అనిల్ ప్రశ్నిస్తారు. ఎవరండి? అని రికవరీ ఏజెంట్ ప్రశ్నిస్తుంది. అమ్మా నేను అనిల్‌కుమార్ యాదవ్‌ను, మాజీ మంత్రిని అని వివరిస్తారాయన. కరెక్టే సార్, తనే మీ నెంబర్ ఇచ్చాడని చెబుతుంది. తనకు ఏమీ తెలియదని మాజీ మంత్రి వివరిస్తారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టాలని సూచిస్తారాయన. కానీ ఆ అమ్మాయి అంతటితో ఆగలేదు. మీరే చెల్లిస్తారని చెప్పాడని దబాయిస్తుంది.
తనకు అన్నతమ్ముడు, ఇతరత్రా అలాంటి పేరున్న బంధువులెవరూ లేరని అనిల్‌కుమార్ యాదవ్ తేల్చి చెబుతారు. బావ అవుతాడని మరోసారి ఆ అమ్మాయి నొక్కి చెబుతుంది. అలాంటి వారెవరూ తన సంబంధీకుల్లో లేరని, జైల్లో పెట్టాలని మళ్లీమళ్లీ అనిల్‌కుమార్ యాదవ్ సూచిస్తారు. కానీ అమ్మాయి వినిపించుకోదు. అశోక్‌కు ఫోన్ చేశానని, మీరే చెల్లిస్తారని చెబుతున్నాడని అనిల్‌తో రికవరీ ఏజెంట్ వాదనకు దిగుతుంది.
ఎవరు కడ్తారు? అతన్ని తీసుకెళ్లి లోపల వేయాలని అనిల్ మరోసారి సూచిస్తారు. అయితే డబ్బులు ఎవరు కడ్తారని ఆ అమ్మాయి నిలదీస్తుంది. సహనం కోల్పోయిన మంత్రి చెప్పుతో కొడ్తానని హెచ్చరిస్తారు. వాడెవడో ముక్కుమొహం తెలియని వ్యక్తి తన నంబర్ ఇస్తే, ఇలా ఫోన్ చేసి అడగడం ఏంటని మండిపడతారు.
రూ.8 లక్షలు ఎవరు కడ్తారు? ఇద్దరు కలిసే కదా వాడుకున్నదని అడ్డగోలుగా వాదిస్తుంది. అయితే మాజీ మంత్రి నోటికి పని చెప్పడంతో , మాట్లాడ్డం తమకు తెలుసని ఆ అమ్మాయి ఎదురు దాడికి దిగుతుంది. తనకు అశోక్ అనే బావ లేడని చెబుతుంటే, మరి మీ నెంబర్ ఎందుకిచ్చాడని వితండ వాదానికి దిగుతుంది. అప్పటికే సహనం కోల్పోయిన అనిల్‌కుమార్ యాదవ్ మీ పేరు ఏంటి? బ్యాంక్ పేరు, అది ఎక్కడ వుంటుందనే వివరాలు అడిగారు. నెల్లూరులో వుంటుందని అ అమ్మాయి చెప్పగానే, ఫోన్ కట్ చేస్తారాయన.
అయితే ఇలాంటి వేధింపులే నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పీఏకు తాజాగా ఎదురయ్యాయి. ఈ విషయమై నెల్లూరు ఎస్పీ దృష్టికి మంత్రి కాకాణి తీసుకెళ్లారు. నెల్లూరు ఎస్పీ ఓ టీంను ఏర్పాటు చేసి, రికవరీ ఏజెంట్ల ఫోన్‌కాల్స్ వెనుక కుట్రలను నిగ్గు తేల్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ఫోన్ చేసి, మీ నెంబర్లు ఇచ్చారని చెబితే, రుణం తీసుకున్నోడికి పలుకుబడి ఉన్న ప్రజాప్రతినిధులు ఫోన్ చేస్తారని రుణయాప్ నిర్వాకుల వ్యూహం.
తమ నెంబర్లు ఎందుకిచ్చావని, మర్యాదగా రుణం చెల్లించాలని ప్రజాప్రతినిధులు మందలించడం వల్ల ప్రయోజనం వుంటుందనే ఎత్తుగడ వేశారని కాకాణి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అనిల్‌కు కూడా వేధింపులు ఎదురైనట్టుగా చర్చ జరుగుతోంది.