ప్రతిపక్ష పార్టీల నేతలపై మరోసారి మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పేదరికం, అనర్హతలను ప్రామాణికంగా తీసుకుని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ లబ్ధి అందిస్తున్నారన్నారు. జగన్‌కు అందరి తరపున కృతజ్ఞతలు చెబుతున్నట్టు రోజా అన్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిపాలన అనుభవం ఉందనే కారణంతో చంద్రబాబుకు అధికారం ఇచ్చారన్నారు. కానీ రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు అప్పుల్లో ముంచాని రోజా ధ్వజమెత్తారు.
తన పాలనలో చంద్రబాబు చేసిన మంచి ఏంటో ఒక్కసారి ఆలోచించాలని కోరారు. అదే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని జగన్‌కు అప్పగిస్తే, ప్రతి అక్కాచెల్లెమ్మకు నేరుగా వారి అకౌంట్లకే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా చూస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు, బీజేపీ, పవన్ కలిసి వచ్చి ఓట్లు వేయించుకుని ప్రజల్ని మోసగించారని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో కాపులు, ఉపకులాలకు అందించిన లబ్ధి ఎంతయ్యా అంటే కేవలం రూ.400 కోట్లు మాత్రమే అన్నారు. కాపులకు జగన్ ఎంతో మేలు చేశారంటూ గణాంకాలతో సహా రోజా వివరించారు. కానీ చంద్రబాబు మాత్రం కాపులకు ఇచ్చిన పథకాలు ఏంటంటే వారిపై అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, అవమానాలు అని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని రోజా పిలుపునిచ్చారు.
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లో వుందని రోజా అన్నారు. వైసీపీ ఎంపీలను రాజీనామా చేయాలని చంద్రబాబు సిగ్గులేకుండా కోరుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ప్రజలు ఆదరించడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని రోజా అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ వార్ ఒన్‌సైడే అని తేలిపోయిందని రోజా అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని ఆమె హితవు చెప్పారు.