ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పరాభవం ఎదురైంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై ఇవాళ ఆ ప్రాంతంలో బీజేపీ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది.
రాజధాని అంశం తమ పరిధిలో లేదని, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిం చిందని హైకోర్టులో బీజేపీ ఏలుబడిలోని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానిని మార్చిన జగన్‌తో బీజేపీ నేతలు స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి.
రాజధానిపై బీజేపీ డ్రామాల్ని ఏపీ ప్రజానీకం జాగ్రత్తగా గమనిస్తోంది. నెలల తరబడి రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ, తాజాగా పాదయాత్ర చేపట్టడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్‌ను అమరావతి రైతులు గట్టిగా నిలదీశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదిలో రాజధాని నిర్మిస్తామని సోము వీర్రాజు నమ్మబలికారు.
రాజధాని రైతులు తీవ్రంగా స్పందించారు. జగన్, మీరు తోడుదొంగలై రాజధానిని నాశనం చేశారని దుయ్యబట్టారు. జగన్‌తో స్నేహం చేస్తూ, ఇప్పుడు ఎవరిని మోసగించాలని పాదయాత్ర చేస్తున్నారని నిలదీశారు. దీంతో సోము వీర్రాజు మొహం చిన్నబోయింది. రాజధానికి మద్దతుగా పాదయాత్ర చేస్తే ఘన స్వాగతం పలుకుతారని ఆశించిన బీజేపీకి చేదు అనుభవం ఎదురుకావడం గమనార్హం.
రాజధానిని కట్టని నాయకుడిని వదిలేసి తమను నిలదీస్తే ఏం లాభమని సోము వీర్రాజు ఎదురు ప్రశ్నించారు. సోమును వీర్రాజును అవమానించడం వెనుక టీడీపీ ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇదంతా పథకం ప్రకారమే బీజేపీని బద్నాం చేయడానికి కుట్ర పన్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు.