ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమ జంటపై జరిగిన దాడి ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో అమ్మాయిని దుండగులు రేప్ చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.
జిల్లాలోని తాడేపల్లి పరిథిలో ఉన్న సీతానగరంలో నిన్న రాత్రి పుష్కర ఘాట్ వద్ద ఉన్న ఇసుకలో ఇద్దరు ప్రేమికులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అక్కడకు దగ్గర్లో ఉన్న ఇద్దరు దుండగులు, ఈ ప్రేమ జంటపై కన్నేశారు. ఎవరూ లేని సమయం చూసి వాళ్లపై దాడిచేశారు.
ముందుగా యువకుడిపై దాడిచేసి అతడ్ని తాళ్లతో కట్టిపడేశారు. ఆ తర్వాత అమ్మాయిపై దాడి చేసి ఆమెను రేప్ చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి అక్కడ్నుంచి పారిపోయారు. జరిగిన ఘటనపై ఈరోజు ఉదయం యువతి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పటల్ కు తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి కంప్లయింట్ ఇవ్వడాన్ని పోలీసులు అభినందించారు.