ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన ఐదు నెలల తర్వాత దేశ జనాభాలో ఐదు శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో 18 యేళ్ల పై బడిన వారు, ప్రస్తుత వ్యాక్సిన్లు వేయించుకోదగిన వారు 95 కోట్ల మంది వరకూ ఉంటారని అంచనా. వీరిలో ఐదు శాతం మందికి మాత్రమే ఇప్పటి వరకూ రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టత ఇస్తున్నాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై ఐదు నెలలు గడిచినా ఇప్పటి వరకూ ఐదు శాతం మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ జరిగింది. ఈ ఏడాది చివరాఖరికి అందరికీ వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తొలి ఐదు నెలల్లో ఐదు శాతం జనాభాకు వ్యాక్సిన్లేసి, మిగిలిన ఆరు నెలల్లో 95 శాతం మందికి వ్యాక్సిన్లు వేయడం సాధ్యమేనా? అనేది ప్రశ్నార్థకం.
అయితే కనీసం ఒక డోసు వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకూ దేశ జనాభాలో 27 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చారట. గత వారంలో రోజుకు 30 లక్షలకు పైగా డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్టుగా అంచనా.
నిన్న 38 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్ జరిగినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పోర్టల్ లో పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి దేశంలోని 95 కోట్ల మంది 18 యేళ్ల పై బడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే.. ఈ లెక్కలు చాలా పెరగాలని స్పష్టం అవుతోంది.
ఇప్పటి నుంచి సగటున రోజుకు 83 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరగాల్సి ఉంది. అయితే ఆ లక్ష్యానికి సగం స్థాయిని కూడా అందుకోలేదు. అలాగే జూన్ నెలలో కనీసం 12 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఇది వరకూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మరి ఇప్పటికే 20 రోజులు గడిచిపోయాయి ఈ నెలలో. కానీ ఇప్పటి వరకూ ఈ నెలలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య ఐదు కోట్లు మాత్రమేనట! మరి పది రోజుల వ్యవధిలో ఏడు కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. అంటే జూన్ నెలలో కూడా ప్రకటించుకున్న పరిమిత టార్గెట్ ను రీచ్ కావడం అసాధ్యం అని స్పష్టం అవుతోంది.
అటు ఇటుగా నెలకు 24 కోట్ల డోసుల అవసరం. అందులో కేంద్రం ప్రకటించుకున్న టార్గెట్టే సగం! ఇప్పుడు ఆ సగం టార్గెట్ లో సగాన్ని చేరడమే గగనంగా మారింది పరిస్థితి!