‘సీతారామం’ ల్యాండ్ మార్క్ చిత్రం

హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న…

హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఆగస్ట్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన చెప్పిన 'సీతారామం' చిత్ర విశేషాలివి.

‘’…చాలా మంచి సినిమా తీశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ మరో చరిత్ర, మణిరత్నం గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది…’’  

థియేటర్ కు జనాలు రాకపోవడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు వున్నాయి.

ఎన్టీఆర్ , రాఘవేంద్రరావు, చిరంజీవి తో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం వుండేది. నా ఇద్దరు పిల్లలు చదువు పూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా వుంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది.

నిజానికి నాకు సరిగమలు కూడా రావు. కానీ మంచి ట్యూన్ ని పట్టుకొనే అభిరుచి దేవుడు ఇచ్చాడని భావిస్తాను. ''మీరు ఎదురుగా వుంటే సంగీత సరస్వతి చక్కగా పలుకుతుందండీ''అని మహదేవన్ అన్నారు. సరిగ్గా అదే మాట ఇళయరాజా కూడా అన్నారు. అలాగే మణిశర్మ, కీరవాణితో కూడా సంగీతం పరంగా మంచి అనుబంధం వుంది. సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను ఛాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను.

మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి కి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం''అని స్వప్నతో అప్పుడే చెప్పాను.  హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ వుండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు.

ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ వుంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో వున్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలౌతుంది.