చంద్రబాబుకు జాకీలు వేయడంలో ఎల్లో మీడియాకు మరెవరూ సాటి రారు. 2019లో కూడా ఇట్లే చంద్రబాబు పాలనపై ఆకాశమే హద్దుగా పొగడ్తలు కురిపించి, చివరికి అధికారం నుంచి దిగిపోయేలా చేశారు.
చంద్రబాబు పాలనలో ప్రజావ్యతిరేకతకు కారణాలేంటో వాస్తవాలు రాసి వుంటే, ఆయన ఏదో రకంగా తప్పుల్ని సరిదిద్దుకునే వారేమో. అబ్బే, ఆ పని చేయలేదు. ఆహా బాబు, ఓహో లోకేశ్ అంటూ తెగ ప్రశంసలు కురిపించడం, అవే నిజమని తండ్రీకొడుకులు నమ్మి అధికారాన్ని చేజేతులా పోగొట్టుకున్నారు.
తాజాగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో తెలంగాణలో చంద్రబాబుకు అడగడుగునా నీరాజనం పట్టారని ఎల్లో మీడియా తెగ సంబరపడుతూ చెబుతోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల ర్యాలీలతో చంద్రబాబుకు ఖమ్మం జిల్లా పరిధిలోని యువకులు స్వాగతం పలికారట!
జై చంద్రబాబు, జైజై చంద్రబాబు నినాదాలతో తెలంగాణ అంతా మార్మోగుతోందట. తెలంగాణ యువకుల అభిమానానికి చంద్రబాబు మంత్రముగ్ధుడై ఓ వరం ఇచ్చారట! ఇప్పుడు గోదావరి ముంపు ప్రాంతాలను సందర్శించడానికి వెళుతున్నానని, సమయం లేదని, కావున మరోసారి మీ ప్రాంతానికి వచ్చి తప్పనిసరిగా దర్శనమిస్తానని చెప్పారట!
ఎల్లో మీడియా పొగడ్తల్ని నమ్మి, నిజంగానే తెలంగాణలో తనకు బ్రహ్మరథం పడ్తారని చంద్రబాబు నమ్ముతారేమో అనే సెటైర్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఘన స్వాగతం పలకడం చూసి, ఇంకా తెలంగాణలో తనకు ప్రజాదరణ ఉందనుకుని కొంపదీసి 2023లో ఆ రాష్ట్ర ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంటారా? అని నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.
ఎందుకంటే 2018లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే, కేసీఆర్‌కు ఆయుధం ఇచ్చినట్టైంది. మళ్లీ ఆంద్రోళ్ల చేతిలోకి తెలంగాణ వెళ్లాలా? అంటూ సెంటిమెంట్‌ని రగిల్చి కేసీఆర్ భారీ లబ్ధి పొందారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఆవిర్భావానికి ప్రధాన కారకుడు చంద్రబాబే అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. బాబు పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా కేసీఆర్ టీడీపీ నుంచి బయటికెళ్లి టీఆర్ఎస్ స్థాపించడాన్ని గుర్తు చేస్తున్నారు.
అలాంటి చంద్రబాబుకు తెలంగాణ జననీరాజనం పడుతుందని చెప్పడం కంటే అతిశయోక్తి మరేదైనా ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.