కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాడని, దీంతో మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందని, అక్కడ బీజేపీ విజయపతాకం ఎగరేస్తుందని ఆ పార్టీ నాయకులు యమ సంబరపడుతున్నారు. మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో అధికారం బీజేపీదేనని జబ్బలు చరుచుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నట్లుగా మునుగోడు ఉపఎన్నిక అసలు జరుగుతుందో లేదో చెప్పలేం. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తాడో రాడోనని అనుకోవడం కాదు ఇక్కడ.
రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా స్పీకర్ వెంటనే ఆమోదించేసి వెళ్లి యుద్ధ రంగంలోకి దూకు అనేస్తాడా? అనడు. ఎందుకంటే ఉపఎన్నిక జరగాలో వద్దో డిసైడ్ చేసేది ముఖ్యమంత్రి కేసీఆర్. స్పీకర్ రాజీనామా ఆమోదిస్తేనే కదా ఉప ఎన్నిక జరిగేది. కాబట్టి ఆమోదించాలా, వద్ద అని స్పీకర్ కు చెప్పాల్సింది ఎవరు? కేసీఆరే కదా. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ సర్వస్వతంత్రుడు. కానీ ఇప్పటి స్పీకర్లు అలా లేరు కదా. ముఖ్యమంత్రి ఎంత చెబితే అంతే. అందుకే రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రే అవుతాడు. తన పార్టీకి ఉప ఎన్నిక లాభంగా ఉందనుకుంటే రాజీనామా ఆమోదించమని చెబుతాడు. లేదనుకుంటే పెండింగ్ లో పెట్టమని చెబుతాడు.
స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులతో సహా ఎవరికీ లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినా స్పీకర్ పెండింగ్ లో పెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఉపఎన్నికలు తమకు చేటు చేస్తాయని అనుకుంటే టీఆర్ఎస్ కు ఉపఎన్నికలు అడ్డుకునే శక్తి ఉంది. ఉపఎన్నిక అనేది బీజేపీ వ్యూహం కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో ఇరుక్కునే చాన్స్ లేదని కొంతమంది అంటున్నారు. ఎవరు రాజీనామాలు చేసినా ఆమోదించకుండా నాన్చి.. చివరికి ఆరేడు నెలల ముందు ఆమోదిస్తారని అంటున్నారు. ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ దూకుడుగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామా చేయగానే ఇలా ఆమోదించేసి ఉపఎన్నికలకు వెళ్లారు. ఎదురు దెబ్బతిన్నారు. కాబట్టి కేసీఆరే ఆ పొరపాటును రిపీట్ కానివ్వరు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ అలాంటి రిస్క్ తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు అనుకోవడం లేదు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది చివరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే పదిహేను నెలల వరకూ సమయం ఉంటుంది. ఆరు నెలల పదవీ కాలం ఉంటే ఎన్నికలు నిర్వహించరు. రాజీనామా చేసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ఉంది. ఈ ప్రకారం చూస్తే ఏడాది పదవీ కాలం ఉన్నా ఉపఎన్నిక నిర్వహించడం కష్టమే. రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదు.. ఎవరు రాజీనామా చేసినా నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఎంత కాలం అయినా సాగదీయడానికి చాన్స్ ఉంది. అది స్పీకర్ అధికారం.
తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేందుకే రాజీనామా చేస్తున్నారని అనిపిస్తే.. టీఆర్ఎస్ రాజీనామాను ఆమోదించకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అయితే ఓడిపోతామనే ఉపఎన్నికలకు భయపడుతున్నారని బీజేపీ విమర్శించవచ్చు. అయితే బీజేపీ వ్యూహం ప్రకారం .. తమకే లాభిస్తుందని.. ఎన్నికలలో తామే గెలుస్తామని టీఆర్ఎస్ అనుకుంటే.. వెంటనే రాజీనామాలు ఆమోదం పొందే చాన్స్ ఉంది. కాబట్టి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే ఉపఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేదు.