తిరుమ‌ల‌ను ఏం చేయాల‌నుకుంటున్నారు?

ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రాన్ని ఏం చేయాల‌నుకుంటున్నార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భ‌క్తుల విష‌యంలో విప‌రీత‌మైన నియ‌మ నిబంధ‌న‌లు పాటించే టీటీడీ ఉన్న‌తాధికారులు…. వీఐపీల విష‌యానికి వ‌చ్చే స‌రికి సాగిల‌ప‌డుతుండ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి…

ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుమ‌ల పుణ్య‌క్షేత్రాన్ని ఏం చేయాల‌నుకుంటున్నార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భ‌క్తుల విష‌యంలో విప‌రీత‌మైన నియ‌మ నిబంధ‌న‌లు పాటించే టీటీడీ ఉన్న‌తాధికారులు…. వీఐపీల విష‌యానికి వ‌చ్చే స‌రికి సాగిల‌ప‌డుతుండ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. 

తాజాగా గురువారం ఉద‌యం మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు దాదాపు 150 మందితో క‌లిసి తిరుమ‌ల శ్రీ‌వారిని వీఐపీ ప్రొటోకాల్ ద‌ర్శ‌నం చేసుకోవ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

వంద‌లాది మందిని వెంటేసుకుని క‌లియుగ దైవం ఎదుట బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేసిన‌ట్టుగా వ్యవ‌హ‌రించ‌డంతో తిరుమ‌ల ప‌విత్ర‌త‌కు భంగం క‌లిగించార‌ని సామాన్య భ‌క్తులు మండిప‌డుతున్నారు. మంత్రి త‌ర‌పున వంద‌లాది మందికి ప్రొటోకాల్ ద‌ర్శ‌నం ఇవ్వ‌డంపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తిరుమ‌ల శ్రీ‌వారిని వీఐపీ దేవుడు చేయాల‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

టీటీడీ ఉన్న‌తాధికారి త‌న ఇష్టానుసారం ద‌ర్శ‌నాలకు అనుమ‌తి ఇస్తున్నార‌ని సొంత‌ పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న‌కు ఇష్ట‌మైతే చాలు….రూల్స్ వ‌ర్తించ‌వు. ఇష్టం లేక‌పోతే మాత్ర‌మే రూల్స్‌ని తెర‌పైకి తెస్తారని అధికార పార్టీకి చెందిన నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. గ‌తంలో శ్రీ‌నివాస‌రాజు జేఈవోగా ఉన్న స‌మ‌యంలో విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా చ‌క్క‌గా చేసుకెళ్లే వార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఒక‌వైపు భ‌క్తులు గంట‌ల త‌ర‌బ‌డి స్వామి వారి కోసం వేచి వుంటే, మంత్రి నేతృత్వంలో భారీ సంఖ్య‌లో స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ల‌డం మాత్రం అధికార పార్టీకి చెడ్డ‌పేరు తెస్తోంది. ఇప్ప‌టికైనా టీటీడీ ప‌రిపాల‌న బాధ్యులు సామాన్యుల్ని దృష్టిలో పెట్టుకుని ధ‌ర్మ‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

ఇదిలా వుండ‌గా మందీమార్బ‌లంతో తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డంపై విమ‌ర్శ‌లు రావ‌డంతో మంత్రి అప్ప‌ల రాజు స్పందించారు. సామాన్య భ‌క్తుల్లా క్యూ లైన్‌లో వెళ్లామ‌న్నారు. సామాన్య భ‌క్తులెవ‌రికీ త‌మ వ‌ల్ల అసౌక‌ర్యం క‌ల‌గ‌లేద‌ని చెప్పుకొచ్చారు.