సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా జపాన్ లో ఆయనకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విషయం ఈరోజు మరోసారి రుజువైంది.
రజనీ నటించిన జైలర్ సినిమాను, తమిళనాడులో, ఆయన అశేష అభిమానుల సమక్షంలో చూడాలని జపాన్ కు చెందిన ఓ జంట ఫిక్స్ అయింది. దీని కోసం వీసా ఫార్మాలటీస్ అన్నీ పూర్తి చేసుకొని జపాన్ నుంచి చెన్నైకు చేరుకుంది. తాము అనుకున్నట్టుగానే అభిమానుల సమక్షంలో చెన్నైలో జైలర్ సినిమా చూసి ఎంజాయ్ చేశారు.
ఇలా చెన్నై వచ్చి జైలర్ చూసిన వ్యక్తి పేరు యసుదా హిడెతొషి. ఇతడు జపాన్ లో రజనీకాంత్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అక్కడో పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నాడు ఇతడు. సూపర్ స్టార్ పుట్టినరోజు నాడు, ఆయన సినిమాలు రిలీజైన రోజు.. ఈయన హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈసారి మాత్రం ఏకంగా చెన్నై వచ్చేశాడు.
ఇతడు జపాన్ లో ఓ హోటల్ మేనేజర్. రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా నుంచి సూపర్ స్టార్ కు వీరాభిమానిగా మారిపోయాడు. ఇప్పుడు జైలర్ సినిమా చూసేందుకు భార్యతో కలిసి చెన్నై వచ్చాడు.
10 రోజుల కిందటే చెన్నై చేరుకున్న ఈ జపాన్ వీరాభిమానికి రజనీకాంత్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అలా రజనీతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం అందుకున్నాడు హిడెతోషి.