భోళాశంకర్.. ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ

సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతులు రాలేదు. పెంచిన టికెట్ రేట్లతో ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేక ప్రస్తుతం అమల్లో…

సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా అనుమతులు రాలేదు. పెంచిన టికెట్ రేట్లతో ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేక ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లతోనే సినిమా రిలీజ్ అవుతుందా? ఈ ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

మరోవైపు ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ విషయంపై తామేం చేయలేమంటున్నారు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి కొన్ని నిబంధనలు పాటించాలని, కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలని అంటున్న అధికారులు.. అలాంటి కీలకమైన 11 డాక్యుమెంట్లను భోళాశంకర్ నిర్మాత ఇంకా సమర్పించలేదని చెబుతున్నారు.

ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలంటే సినిమా బడ్జెట్ వంద కోట్లు దాటినట్టు లెక్కలు చూపించాలి. అంతేకాదు, సినిమాలో 20శాతం షూటింగ్ ను ఆంధ్రప్రదేశ్ లో చేసినట్టు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి డాక్యుమెంట్లు కొన్నింటిని నిర్మాత ఇంకా అందజేయలేదంట. దీంతో ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు సందిగ్దంలో పడింది.

రీసెంట్ గా చిరంజీవి కొన్ని వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఆ కారణంగానే ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపుపై అనుమతులు రాలేదని చాలామంది అంటున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు, ఈ అంశానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు సజ్జల లాంటి నేతలు.

నిబంధనల ప్రకారం, పత్రాలన్నీ సమర్పిస్తే అనుమతి ఇవ్వడానికి తమకేం అభ్యంతరం లేదన్న సజ్జల, గతంలో వాల్తేరు వీరయ్య సినిమాకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మరికొన్ని గంటల్లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అనుమతి వస్తే సరేసరి. లేకుంటే, బ్రో సినిమా టైపులో టికెట్ రేట్లు పెంచకుండానే సినిమాను విడుదల చేస్తారు.