అమ‌రావ‌తికి శాపం, శ‌త్రువు ఎవ‌రంటే?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు ఏం చేయాలో బీజేపీకి దిక్కుతోచ‌న‌ట్టుంది. అందుకే అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో ఆ పార్టీ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని గ్రామాల్లో మొత్తం 75 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ కార్య‌క‌లాపాలు ఏం చేయాలో బీజేపీకి దిక్కుతోచ‌న‌ట్టుంది. అందుకే అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో ఆ పార్టీ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నుంది. అమ‌రావ‌తి రాజ‌ధాని గ్రామాల్లో మొత్తం 75 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది. అయినా ఇప్పుడు అమ‌రావ‌తికి ఏమైంది? రాజ‌ధాని అక్క‌డే ఉంది క‌దా? మ‌రి బీజేపీ పాద‌యాత్ర ఎందుకు చేస్తున్న‌ట్టు?  

రాజ‌ధానిని మార్చిన‌ప్పుడు కిమ్మ‌న‌కుండా ప్రేక్ష‌క‌పాత్ర పోషించి, ఇప్పుడు ఏ ప్ర‌యోజ‌నాల్ని ఆశించి అమ‌రావ‌తిలో పాద‌యాత్ర చేయాల‌ని బీజేపీ సంక‌ల్పించిందోన‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌ని ఆ ప్రాంత వాసులు ఉధృతంగా ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో మాత్రం బీజేపీ అటు వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. సుజ‌నాచౌద‌రి లాంటి ఒక‌రిద్ద‌రు బీజేపీ నాయ‌కులు మాత్రం సామాజిక కోణంలో మాత్ర‌మే రాజ‌ధాని ఎక్క‌డికీ త‌ర‌లిపోద‌ని మాట్లాడారు.

ఈ నేప‌థ్యంలో ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాల‌నే డిమాండ్‌తో ఈ నెల 29న తాడేప‌ల్లి మండ‌లం ఉండ‌వ‌ల్లిలో బీజేపీ పాద‌యాత్ర ప్రారంభించ‌నుంది. తుళ్లూరు వ‌ర‌కూ ఈ యాత్ర కొన‌సాగుతుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితం రాజ‌ధానిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అప్ప‌టి నుంచి ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తున్న ఆ పార్టీకి ఉన్న‌ట్టుండి, రాజ‌ధానిపై ప్రేమ ఎందుకు పుట్టిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. 

అమరావ‌తికి ఏదైనా చేయాల‌నే మంచి సంక‌ల్పం కంటే, పార్టీ ప‌రంగా ఒక కార్య‌క్ర‌మం చేసే ఆలోచ‌న‌లో భాగంగానే పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

నిజంగా అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాల‌ని బీజేపీ అనుకుంటే అదేం పెద్ద ప‌నికాదు. హైకోర్టులో ఆ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌పున అఫిడ‌విట్ వేసేవాళ్లు. అమ‌రావ‌తిని అక్క‌డే కొన‌సాగించ‌డానికి అన్ని ర‌కాలుగా చేతిలో ప‌వ‌ర్స్ పెట్టుకుని, ఇప్పుడు టింగురంగా అంటూ పాద‌యాత్ర పేరుతో అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించాల‌ని అనుకోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

రాజ‌ధానికి శాపం, శ‌త్రువు ఎవ‌రైనా ఉన్నారంటే అది బీజేపీ రూపంలోనే. ఈ వాస్త‌వాన్ని ఆ ప్రాంత ప్ర‌జానీకం గుర్తించాల్సి వుంది. స్వార్థ ప్ర‌యోజ‌నాల‌తో పాద‌యాత్ర చేప‌డుతున్న బీజేపీకి ఎలా బుద్ధి చెప్పాలో రాజ‌ధాని ప్రాంత‌వాసుల‌కు బాగా తెలుసు.