యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించాలని వాదించి, ఓటర్లను మెప్పించి మూడేళ్లు తిరక్కుండానే బోరిస్ జాన్సన్ తనే నిష్క్రమించాడు. థెరిసా మేకు బ్రెగ్జిట్ అమలు చేయడం రాదు, నేను చేసి చూపిస్తాను చూడండి అంటూ ప్రగల్భాలు పలికినవాడు దాన్ని గతంలో కంటె అయోయమ పరిస్థితిలో వదిలేసి గద్దె దిగాడు. ఆ దిగడం కూడా అత్యంత అవమానకరమైన పరిస్థితుల్లో, సొంత కాబినెట్ సహచరుల చేత, ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల చేత దిగిపో అని చెప్పించుకున్నాడు. చివరకు వాళ్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే విధి లేక దిగిపోయాడు. రెండున్నరేళ్ల క్రితం 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికలలో తన కన్సర్వేటివ్ (టోరీలని కూడా అంటారు) పార్టీకి 43.6% ఓట్లు, మొత్తం 650 సీట్లలో 365 సీట్లు తెప్పించిన మనిషికి యీ దురవస్థ ఎందుకు ప్రాప్తించింది?
దీనికి నాలుగు కారణాలు చెప్పుకోవచ్చు. బ్రెగ్జిట్‌ను సరిగ్గా హేండిల్ చేయలేక చిక్కుల దారపుండగా చేయడం, కోవిడ్‌ను సరిగ్గా హేండిల్ చేయలేక పోవడం, ఈయు (యూరోపియన్ యూనియన్) నుంచి బయటపడితే చాలు, మన ఆర్థిక పరిస్థితి అద్బుతంగా వెలిగిపోతుంది అని ప్రజలను నమ్మించి చివరకు దేశ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేయడం, నాలుగోది, ముఖ్యమైనది అబద్ధాలతో, దుష్ప్రవర్తనతో వ్యక్తిగతంగా ఛీ కొట్టించుకోవడం! ఇక యితనితో కలిసి ఉంటే మన పరువు కూడా పోతుంది అనుకునే చాలాకాలంగా అతన్ని అంటిపెట్టుకుని ఉన్న సమర్థులైన మంత్రులు కూడా ఒక్కొక్కరు తప్పుకున్నారు. ఈ పరిస్థితిపై బ్రిటన్ ప్రతిపక్ష నాయకుడు కీర్ స్టార్మర్ ‘‘ఓడలు ఎలకను వదిలేసి వెళ్లిపోతున్నాయి!’’ అని చమత్కరించాడు. ఓడ మునగబోతోందని గ్రహించి, దాన్ని విడిచి పారిపోయే వాటిలో మొట్టమొదటివి ఎలుకలని సామెత. సామెతను తిరగేసి, బోరిస్‌ను తక్కువ చేసి, అతని సహచరులను ఎక్కువ చేసి చూపాడు కీర్.
బ్రెగ్జిట్ గురించి చెప్పాలంటే, బోరిస్‌కి ఇయు అంటే మొదటి నుంచి యిష్టం లేదు. ‘‘టెలిగ్రాఫ్’’కు బ్రస్సెల్స్ కరస్పాండెంటుగా ఉండే రోజుల్లో బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికి ఇయు చేస్తున్న ఘోరాలంటూ కొన్ని వార్తలు కల్పించి (వాటిని యూరోమిత్స్ అన్నారు) కూడా రాసేవాడట. లండన్ మేయరుగా ఉండే రోజుల్లో ఇయులో ఉండాలా, వద్దా అని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు, ఏ వర్గంలో ఉండాలాని కొంతకాలం తర్జనభర్జన పడి, యిరుపక్షాల వారి తరఫున వ్యాసాలు రాసి, చివరకు విడిపోవాలి అనే గ్రూపులో చేరి, యిక ఆపై 2016లో జరిగిన రిఫరెండమ్‌లో దాని గురించి నానా హడావుడి చేసేశాడు. తనకు వ్యక్తిగతంగా బ్రెగ్జిట్ యిష్టం లేకపోయినా, దృఢనిర్ణయం తీసుకోలేక దానిపై ప్రజాభిప్రాయ సేకరణ ఆదేశించి, అధికాంశం ప్రజలు బ్రెగ్జిట్‌కు ఓటేయడంతో, దాన్ని ఎలా అమలు చేయాలో తోచక ప్రధాని కామెరాన్ రాజీనామా చేసి దిగిపోయాడు.
అతని స్థానంలో థెరిసా మే ప్రధాని అయింది. బ్రెగ్జిట్‌కై కఠినచర్యలు చేపట్టాలంటే తనకు బలం ఉండాలనుకుని, 2017లో మధ్యంతర ఎన్నికలకు ఆదేశించింది. తీరా చూస్తే టోరీలకు గతంలో ఉన్న 330 సీట్లకు బదులు 317 వచ్చాయి. 650 సీట్ల పార్లమెంటులో సింపుల్ మెజారిటీ కూడా దక్కకపోవడంతో ఉత్తర ఐర్లండ్‌కు చెందిన డియుపి పార్టీతో పొత్తు పెట్టుకోవలసి వచ్చింది. రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్ ఇయులో భాగస్వామి కాగా, దానిలో ఒకప్పుడు భాగంగా ఉండి, యిప్పుడు యుకెలో భాగంగా ఉన్న ఉత్తర ఐర్లండ్‌కు ఇయును విడిచి పెట్టడంపై కొన్ని అభ్యంతరాలున్నాయి. అందువలన వారితో పొత్తు పెట్టుకోవడం టోరీలలో కొందరికి అభ్యంతరకరంగా తోచింది.
బ్రెగ్జిట్‌లో భాగంగా ఆమె ఇయుతో చేసుకుందామనుకున్న ఒప్పందం పార్లమెంటులో మూడు సార్లు తిరస్కరణకు గురైంది. ఆమెపై పార్టీలో, ప్రజల్లో వ్యతిరేక ఉవ్వెత్తున పెల్లుబుకింది. దాంతో ఆమెను దింపేసి పార్టీ బోరిస్‌ను ప్రధానిని చేసింది. బోరిస్ ఉత్తర ఐర్లండ్ సమస్య తేల్చకుండా బ్రెగ్జిట్ ఒప్పందం చేసుకోబోతే పార్లమెంటు ఆమోదించలేదు. దాంతో బోరిస్ 2019 డిసెంబరులో మధ్యంతర ఎన్నికలు పెట్టాడు. యుకెలో సాధారణంగా ఐదేళ్ల కోసారి పార్లమెంటు ఎన్నికలు జరగాలి. కానీ బ్రెగ్జిట్ సమస్య పుణ్యమాని 2015 తర్వాత 2017, 2019లలో ఉపయెన్నికలు వచ్చాయి. 2019 పార్లమెంటు ఎన్నికలలో గతంలో కంటె 48 సీట్లు ఎక్కువగా 365 సీట్లు, 43.6% ఓట్లు వచ్చాయి. 1987 తర్వాత ఆ పార్టీ యిన్ని సీట్లు ఎన్నడూ గెలుచుకోలేదు. మద్దతు కోసం ఎవరి మీదా ఆధారపడ వలసిన పడలేదు. ఈ ధీమా చూసుకుని 2020 జనవరి 31న ఇయు నుంచి బ్రిటన్ తప్పుకుంది.
తప్పుకోవడమైతే తప్పుకుంది కానీ యిప్పటిదాకా వివిధ దేశాలతో విడివిడిగా ఒప్పందాలు చేసుకోవలసిన పని మిగిలిపోయింది. ఆర్థికంగా నష్టపోయింది. జాన్ స్ప్రింగ్ఫోర్డ్ ప్రకారం 2021 చివరికి ఎకనమిక్ ఔట్పుట్ 5%, ఇన్వెస్ట్మెంట్ 14% తగ్గాయి. రాబోయే రోజుల్లో బ్రిటన్ ఎగుమతులు, దిగుమతులు 15% తగ్గుతాయని యుకె ఆఫీస్ ఫర్ బజెటరీ రెస్పాన్సిబిలిటీ అంటోంది. ఇయుకు అనుకూలంగా ఉండే స్కాట్లండ్ ఇంగ్లండ్ నుంచి విడిపోయే విషయంలో వచ్చే ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానంటోంది. ఆ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. బోరిస్ తర్వాత అధికారంలోకి వచ్చేవాళ్లకు కూడా బ్రెగ్జిట్ గుదిబండే. ఒకవేళ తాము అధికారంలోకి వచ్చినా బ్రెగ్జిట్ నిర్ణయాన్ని తిరగతోడమని లేబర్ పార్టీ చెప్పింది. ఇయులో నుంచి బయటకు వస్తే వలసల బెడద లేకుండా తమందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయని, బ్రిటన్‌కు గతవైభవం సమకూరుతుందని ఆశ పడిన ఓటర్లు యిప్పుడు నిరాశలో, నిస్పృహలో మునిగారు. ఆ నిస్పృహ తాలూకు ఆగ్రహం బ్రెగ్జిట్‌ను భుజాన వేసుకుని మోసిన బోరిస్పైకి మళ్లింది.
ఇక కోవిడ్ విషయంలో బోరిస్ వాక్సినేషన్ బాగానే వేయించాడు కానీ, తక్కిన విషయాల్లో అశ్రద్ధ వహించాడని, ఎవర్నీ సంప్రదించకుండా కోవిడ్ విషయంలో తన పాలసీలను మాటిమాటికీ మార్చి వేశాడని, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశాడని అందుకే 1.71 లక్షల మంది బ్రిటన్లు కోవిడ్ కారణంగా మరణించారని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ దేశాల్లో యీ మరణాల విషయంలో బ్రిటన్‌ది ఏడో స్థానం. అతనికి దేని పట్ల శ్రద్ధ, లక్ష్యం లేదని, అన్నిటిని చాలా కేజువల్గా తీసుకుంటాడని చెడ్డపేరు వచ్చింది. లాక్డౌన్ విషయంలో తెలివిగా వ్యవహరించక పోవడంతో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిందని అన్నారు. నిజానికి అతను లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతంలో 80% చెల్లించాడు. ఆ విధంగా 1.16 కోట్ల ఉద్యోగాలను కాపాడాడు. కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయడంలో చాలా చొరవ చూపాడు. అయినా యితర వైఫల్యాల కారణంగా యిది మరుగున పడింది.
కోవిడ్ పట్ల అతను ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటే లాక్డౌన్ సమయంలో ప్రజల్నందర్నీ యింట్లోనే ఉండాలని రూల్సు పెట్టి తను మాత్రం 20 పార్టీలు నిర్వహించాడు. ఆ వార్త బయటకు రాగానే అంతా అబద్ధం అన్నాడు. తర్వాత రుజువు కావడంతో పోలీసులు విధించిన ఫైన్ కట్టాడు. ఈ పార్టీల్లో అనేకమంది పాల్గొనడం చేత కోవిడ్ ఎంతమందికి వ్యాపించిందో తెలియదు. దేశాధినేతే ప్రజారోగ్యం పట్ల అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? రూల్సు అనేవి తక్కినవాళ్లకే తప్ప తనకు వర్తించవనే విధంగా అతను ప్రవర్తించడంతో అందరికీ అసహ్యం వేసింది. ఈ స్కాండల్‌కి పార్టీగేట్ అని పేరు పెట్టి పత్రికల వాళ్లు నానా యాగీ చేశారు.
ఇక దేశ ఆర్థిక పరిస్థితి బ్రెగ్జిట్ కారణంగా, కోవిడ్ కారణంగా బాగా దెబ్బ తింది. తన సంగతేదో తను చూసుకోకుండా తగుదునమ్మానని ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం, ఆయుధసాయం చేశాడు. రష్యాపై కయ్యానికి కాలు దువ్వి ఆంక్షలు విధించాడు. దాంతో పెట్రోలు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది. ప్రజలు అవస్థ పడుతున్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణం మే నెలలో 9.1%కు చేరింది. ఇది 40 ఏళ్లలో అత్యధికం. త్వరలో యిది 11%కు చేరుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా. యూరోప్‌లోని యితర దేశాల కంటె ఇంగ్లండు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుందని కూడా అది అంటోంది. సమ్మెలు, కార్మికుల కొరత, బ్యాక్‌లాగ్స్‌తో పబ్లిక్ సర్వీసులు దెబ్బ తిన్నాయి.
దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి, అమెరికా తోక పట్టుకుని యీదడం వలన యీ పరిస్థితి వచ్చిందన్న గ్రహింపు అతనికి లేదు. వెళుతూవెళుతూ తన వారసులు అమెరికా చెప్పినట్లే వినాలని, ఉక్రెయిన్ పక్షానే నిలవాలని గొప్ప సలహా ఒకటి యిచ్చాడు. ఇరాక్‌పై యుద్ధానికి దిగాలనుకున్న అమెరికా ఇరాక్ అణ్వాయుధాలు పోగు చేసి పెట్టుకుందని అబద్ధపు ప్రచారం చేస్తే దానికి గుడ్డిగా వంత పాడినందుకు బ్రిటన్ లేబర్ ప్రధాని టోనీ బ్లయర్ అప్రతిష్ఠ పాలయ్యాడు. అయినా బోరిస్‌కు జ్ఞానం రాలేదు. పుతిన్‌ను పదవీభ్రష్టుణ్ని చేయాలని ఉవ్విళ్లూరాడు. ఇప్పుడు తనే యింటి తోవ పట్టాడు.
ఇక వ్యక్తిగత విషయాల విషయంలో బోరిస్ చాలా అప్రతిష్ఠ పాలయ్యాడు. పైకి సరదాగా, హుషారుగా కనబడుతూ, తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉన్నా అతని వ్యవహారశైలి ఘోరంగా ఉంటుందని, దగ్గరకు వెళితే కంపు కొడతాడనీ అందరూ అంటున్నారు. దువ్వుకోని జుట్టు, సరిగ్గా టక్ చేసుకోని డ్రస్, చిలిపిగా మాట్లాడడం యిలాటి వేషాలతో తమలో ఒకణ్ననే భావాన్ని కార్మికులలో కలిగించి, వాళ్ల ఓట్లను కూడా ఆకట్టుకున్న బోరిస్ నిజానికి చాలా అహంభావిట. అందరూ తనను ప్రత్యేకంగా చూడాలని ఈటన్ కాలేజి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదివే రోజుల్నుంచీ ఉండేదని అతనికి పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు చెప్పారు. 1986లో అతను విద్యార్థి యూనియన్‌కి అధ్యక్షుడు అయ్యాడు. చదువు తర్వాత జర్నలిస్టు అయ్యాడు. గుర్తింపు కోసం అతను అబద్ధపు వార్తలు కూడా సృష్టించేవాడట. ‘‘టైమ్స్’’లో పనిచేసేటప్పుడు ఒక అబద్ధపు కోట్ సృష్టించినందుకు ఉద్యోగం తీసేశారు.
1989లో ‘‘డైలీ టెలిగ్రాఫ్’’కి బ్రస్సెల్స్ కరస్పాండెంటుగా పని చేశాడు. 1999 నుంచి 2005 వరకు ‘‘ద స్పెక్టేటర్’’కు ఎడిటరుగా ఉన్నాడు. వివాదాస్పద కథనాలతో పేరు తెచ్చుకుని ఒక సెటైరికల్ టీవీషో ద్వారా ప్రజల్లోకి దూసుకువెళ్లాడు. అతని కుటుంబం మొదట్నించి కన్సర్వేటివ్ పార్టీ అభిమానులే. ఇతను 2001లో ఎంపీ అయ్యి షాడో కాబినెట్లో స్థానం సంపాదించుకున్నాడు. వివాహేతర సంబంధం విషయంలో అబద్ధం చెప్పినందుకు ఆ పదవి పోగొట్టుకున్నాడు. తర్వాత 2008-12, 2012-16 లో రెండు దఫాలుగా లండన్ మేయర్‌గా ఉన్నాడు. 2015లో ఎంపీగా ఎన్నికయ్యాడు. థెరిసా మే కాబినెట్లో ఫారిన్ సెక్రటరీగా ఉన్నాడు. రెండేళ్ల తర్వాత బ్రెగ్జిట్ విషయంలో ఆమె ప్రతిపాదించిన చెకర్స్ అగ్రిమెంటుతో విభేదించి రాజీనామా చేశాడు.
అతని వైవాహిక జీవితం వివాదగ్రస్తం. ఆక్స్‌ఫర్డ్‌లో బయటకు రాగానే 1987లో మొదటి భార్య అలెగ్రాను చేసుకున్నాడు. అత్తగారికి యితను ఏమాత్రం నచ్చలేదు. ఆరేళ్లకే విడాకులు అయిపోయాయి. 12 రోజుల తర్వాత మెరీనాతో రెండో వివాహం జరిగింది. 1993 నుంచి పాతికేళ్ల పాటు వాళ్లు అధికారికంగా భార్యాభర్తలు కానీ మధ్యలో ఎప్పణ్నుంచో విడివిడిగా ఉండసాగారు. ఎందుకంటే బోరిస్‌కు ఎంతోమంది ప్రియురాళ్లు. వాళ్లతో పిల్లలు కూడా కనేశాడు. 2000-04 మధ్య ‘‘స్పెక్టేటర్’’ పత్రిక కాలమిస్టు పెట్రోనెలాతో, 2006లో ‘‘గార్డియన్’’ జర్నలిస్టు ఏనాతో, 2009లో హెలెన్‌తో, 2012లో జెన్నిఫర్‌తో.. యిలా చాలా వ్యవహారాలే నడిచాయి. 2021 సెప్టెంబరులో అతను తనకు వివిధభార్యలతో ఆరుగురు పిల్లలున్నట్లు చెప్పుకున్నాడు. 2018లో తనూ మెరీనా విడిపోతున్నట్లు ప్రకటించాడు. చివరకు 2020 నవంబరులో అఫీషియల్‌గా విడాకులు తీసుకున్నాడు. 2019 నుంచే క్యారీ అనే ఆమెతో కలిసి ఉన్నాడు. 2020 ఏప్రిల్‌లో వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. 2021 మేలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
ఈ ఆఖరి భార్యకు ప్రతిపక్షాల వాళ్లు మేరీ ఆంటోయినెట్ అనే ముద్దుపేరు పెట్టారు. మేరీ పదహారవ లూయీ భార్య. తన విలాసాలకు ప్రజాధనం విపరీతంగా ఖర్చు పెట్టి, ఫ్రెంచి విప్లవం రావడానికి కారణాల్లో ఒకరైంది. ఈ క్యారీ కోసం బోరిస్ తన ప్రధాని నివాసానికి రోల్‌కు 840 పౌండ్లు ఖర్చు పెట్టి గోల్డ్ వాల్పేపర్లు వేయించాడు. దాంతో పాటు యితర హంగులు కూడా సమకూర్చాడు. దానికి గాను 1.13 లక్షల పౌండ్లు అయింది. ఆ ఖర్చుని పార్టీకి విరాళం యిచ్చే దాత నెత్తిన రుద్దాడు. ఈ స్కాండల్‌కు వాల్పేపర్గేట్ అని పత్రికలు పేరు పెట్టాయి.
తన అనుచరుడైన క్రిస్ పించర్కి డిప్యూటీ చీఫ్ వ్హిప్ పదవి కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఓ పార్టీలో అతను తాగి యిద్దరు మగవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలున్నాయి. అలాటివాడికి ఆ పదవి ఎలా యిచ్చావ్? అని పార్టీ సభ్యులు, మంత్రులు అడిగితే అతని గురించి అలాటి ఆరోపణ ఉన్నట్లు నాకు తెలియదు అని అబద్ధమాడాడు. అప్పుడు ఒక అధికారి ‘పించర్ 2019లో కూడా యిలాటి సంఘటనలో యిరుక్కున్నాడని నేను బోరిస్‌కు చెప్పాను. ఆయన పించర్ బై నేమ్, పించర్ బై నేచర్’ అంటూ నవ్వేశాడు.’ అని పార్లమెంటులో చెప్పాడు. తెలిసి కూడా బోరిస్ అబద్ధం చెప్పాడన్న విషయంపై రిషి సూనక్ మండిపడ్డాడు.
ఇవన్నీ తాము సహించకపోయినా ప్రజలు సహిస్తారు, అతన్ని ఆదరిస్తారు అనుకుంటూ టోరీ ఎంపీలు ఊరుకున్నారు. అయితే జూన్ నెలలో జరిగిన రెండు ఉపయెన్నికలలో తమ పార్టీ సిటింగు సీట్లు రెండు పోయాయి. వేక్ఫీల్డ్లో లేబర్ పార్టీకి 48% ఓట్లు రాగా, టోరీలకు 30% వచ్చాయి. టివర్టన్లో లిబరల్ డెమోక్రాట్లకు 53% రాగా, టోరీలకు 39% వచ్చాయి. ఈ ఫలితాలతో ఉలిక్కిపడి అతన్ని సీటు లోంచి దిగమన్నారు. అతను ఒప్పుకోకపోతే మూకుమ్మడి రాజీనామాలతో లాగి పడేశారు. బోరిస్ దీన్ని భరించలేకపోయాడు. రాజీనామా చేసేముందు బ్రెగ్జిట్ సమయంలో తనకు అత్యంత ఆప్తుడిగా ఉన్న మైకేల్ గోవ్ను హౌసింగ్ డిపార్టుమెంటు సెక్రటరీ పదవి నుంచి పీకేశాడు. ఎందుకురా అంటే రాజీనామా చేయమని అతనూ సలహా యిచ్చాడు. ఇప్పుడు పదవి పోగొట్టుకున్నాక బోరిస్ జర్నలిస్టుగా మారి, తన రచనల ద్వారా ఎందరిపై ప్రతీకారం తీర్చుకుంటాడో తెలియక టోరీ ఎంపీలు హడిలిపోతున్నారు.
మామూలుగా అయితే తర్వాతి బ్రిటిషు ప్రధాని ఎవరు అనేదానిపై మనకు ఆసక్తి ఉండదు. కానీ భారతీయ మూలాలున్న రిషి సూనక్ ప్రధాని రేసులో ముందంజలో ఉండడంతో మనకు ఉత్సాహం పెరిగింది. అతని పాలనాసామర్థ్యానికి మెచ్చి టోరీ ఎంపీలు అధికసంఖ్యలో ఆదరించవచ్చు కానీ, 1.60 లక్షల టోరీ పార్టీ సభ్యుల్లో ఎంతమంది అతని పట్ల మొగ్గు చూపుతారో తెలియదు. బ్రిటిషు అహంకారం ఎటువంటిదో బ్రెగ్జిట్ సమయంలోనే తెలిసింది. అలాటిది ఒకప్పటి తమ వలస దేశమైన ఇండియా నుంచి వచ్చి, తమను పాలించడమా? అని పార్టీ సభ్యులు ఫీలైతే రిషి ఎన్నిక సందేహాస్పదమే. ఎన్నిక జరిగేందుకు రెండు నెలల సమయముంది. ఈలోగా ఏ మార్పులు వస్తాయో చూసి, అప్పుడే మాట్లాడుకోవచ్చు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2022)