ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆలోచనల లోతు తెలుసుకోవడం కష్టం. జీవితంపై ఆయన దృక్పథం, దాన్ని అర్థం చేసుకునే తీరు ఎంతో విభిన్నంగా, వినూత్నంగా ఉంటోంది.
పూరీ మ్యూజింగ్స్‌లో జీవితం గురించి ఆయన చెప్పే విషయాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే జీవితాన్ని ఎంతో మదించి, శోధిస్తే తప్ప, అలాంటి అద్భుతమైన విషయాలను చెప్పడం సాధ్యం కాదు.
తాజాగా ఆయన ‘లైఫ్ ఆంథెమ్’ అనే అంశంపై పూరీ మ్యూజింగ్స్‌లో చెప్పిన తీరు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునేలా ఉంది. బతుకంటే మూణ్నాళ్ల ముచ్చటని, దాన్ని ఎవరికి వాళ్లు ఆస్వాదించాలని చెప్పిన తీరు ఆమోఘం. ఇంతకూ ఆయన ఏమన్నారంటే…
‘ఒక్కటే జీవితం.. ఒక్కసారే బతుకుతాం. ఈ జీవితం నీది. ఎవరూ నీ కోసం పుట్టలేదు. నువ్వు ఎవ్వరి కోసం పుట్టలేదు. ఏం చేసినా నీ కోసమే చెయ్.. నచ్చిందే చెయ్.. నీకు నచ్చినట్టుగా ఉండు. మన బతుకే మూణ్నాళ్ల ముచ్చట. దానికి 16 రోజుల పెళ్లెందుకు? బానిస బతుకెందుకు? జీవితం అంటే నదిలో కొట్టుకుపోవడం కాదు. జీవితంలో పెళ్లి అనే ఒక్క తప్పు చేస్తే ఎన్ని ఫిలాసఫీలు చదివినా ఉపయోగం లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చుకో. ఎవ్వరికీ మాట ఇవ్వకు. నీకంటూ ఒక ప్రపంచం సృష్టించుకో ’ అని వివరించారు.
ప్రధానంగా 60 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. 60 ఏళ్లు అంటే రిటైర్‌మెంట్ అని ఎవర్రా చెప్పారని కాసింత ఆగ్రహంతో ప్రశ్నించడం గమనార్హం. కొత్త జీవితం ప్రారంభం కావడానికి ఆ వయసే సరైందని ఆయన గాఢమైన అభిప్రాయం. బుద్ధి, జ్ఞానం వచ్చే వయసు కూడా అదే అని ఆయన చెప్పుకొచ్చారు.