తెలంగాణలో రేపట్నుంచి నో లాక్ డౌన్

తెలంగాణలో రాష్ట్రంలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి తెలంగాణ అంతటా జనజీవనం సాధారణంగా ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో…

తెలంగాణలో రాష్ట్రంలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి తెలంగాణ అంతటా జనజీవనం సాధారణంగా ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం.. వైద్యశాఖ అందించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఇవాళ్టితో లాక్ డౌన్ ముగుస్తోంది. రేపట్నుంచి మరికొన్ని సడలింపులతో లాక్ డౌన్ ను మరో 10 రోజుల పాటు కొనసాగిస్తారని అంతా ఊహించారు. మరీ ముఖ్యంగా రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగిస్తారని ఆశించారు. కానీ తెలంగాణ సర్కారు మాత్రం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ఎత్తేసింది. విద్యా సంస్థలు మాత్రం జులై 1 నుంచి తెరుచుకోవచ్చని తెలిపింది.

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేయడంతో టాలీవుడ్ లో మరోసారి కార్యకలాపాలు జోరందుకోబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్స్ ప్రారంభంకాగా, సోమవారం నుంచి పూర్తిస్థాయిలో టాలీవుడ్ లో కార్యకలాపాలు మొదలు కాబోతున్నాయి. మేకర్స్ అంతా కొత్త షెడ్యూల్స్ కు రెడీ అవుతున్నారు.

ఇక రేపట్నుంచి హైదరాబాద్ లో నైట్ లైఫ్ ప్రారంభం కానుంది. సినిమా హాళ్లు, పబ్స్, బార్స్, మల్టీప్లెక్లులు అన్నీ రేపట్నుంచి పూర్తిస్థాయిలో తెరుచుకోబోతున్నాయి. 

మెట్రో సర్వీసులు, బస్సు సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అయితే లాక్ డౌన్ ఎత్తేసినప్పటికీ.. ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఇవాళ్టితో కలుపుకుంటే తెలంగాణలో 38 రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగినట్టయింది.