రాజద్రోహం కేసు పెట్టి, అరెస్ట్ చేసినా తానింకా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రేయోభిలాషిగానే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆలోచిస్తున్నారు. పార్టీకి ఎవరి వల్ల నష్టమో జగన్‌కు చెబుతున్నారు.
కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఒక వైపు ఆరోపిస్తూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూనే, మరోవైపు “ఇదో జగన్ శ్రేయోభిలాషిగా నేను చెప్పేది చెబుతున్నా. ఆపై మీ ఇష్టం” అన్నట్టుగా ఉంది రఘురామ తీరు.
ఏపీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రేమతో ఈ రోజు పదో లేఖ రాశారు. గత 9 లేఖల్లో ఎన్నికల హామీలు, వాటిలో అమలుకు నోచుకోని పథకాల గురించి జగన్ దృష్టికి రఘురామ తీసు కెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హామీల గురించి గుర్తు చేయడం అయిపోవడంతో, ఇప్పుడు పార్టీకి నష్టం కలిగిస్తున్న వారిపై జగన్‌కు ఫిర్యాదు చేయడం ఈ పదో లేఖ ప్రత్యేకత.
ప్రధానంగా ఎంపీ విజయసాయిరెడ్డి వల్ల పార్టీకి ఉత్తరాంధ్రలో నష్టం జరుగుతోందని సీఎం దృష్టికి రఘురామకృష్ణంరాజు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏ విధంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందో కూడా లేఖలో వివరించడం గమనార్హం. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం విషయంలో అశోక్ గజపతి రాజు కేసు గెలిచారని లేఖలో రఘురామ పేర్కొన్నారు.
అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ముఖ్య నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి నష్టం చేకూరుతుందని లేఖలో రఘురామ ప్రస్తావించారు.
విజయసాయి రెడ్డిని, మంత్రులను పార్టీ మంచి కోసం నియంత్రించాల్సిన అవసరాన్ని జగన్‌కు గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్టు జగన్ శ్రేయోభిలాషిగా రఘురామ సీఎంకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పార్టీ శ్రేయోభిలాషిగా రఘురామ చెప్పిన విషయాలను జగన్ ఏ మాత్రం ఆలకిస్తారో!