కోవిడ్ తాజా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కోవిడ్ ఉధృతి తగ్గుతుందనే కారణంగా అలసత్వం వద్దని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు.
కరోనా సెకెండ్ వేవ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించి, కార్యకలాపాలను పునఃప్రారంభించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
కరోనా సెకెండ్ వేవ్ కంట్రోల్లోకి వస్తున్న వేళ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం, సంతృప్తి పడొద్దని హెచ్చరించింది. తమ రాష్ట్రాల్లోని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సడలింపులు, కర్ఫ్యూ తదితర వాటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ముఖ్యంగా టెస్టింగ్, ట్రాకింగ్, వైద్యసేవలు, టీకాలు, నిరంతర నిఘా వంటి నియమాలను తప్పక పాటించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కోవిడ్ నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తూ దేశంలో మరోసారి కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. ఆంక్షల సడలింపుతో కొన్ని రాష్ట్రాల్లో మార్కెట్లు జనంతో కిక్కిరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో కేసులు తగ్గుతున్న వేళ.. సంతృప్తితో చతికిల పడకుండా చూసుకోవడం చాలా అవసరమని గుర్తు చేసింది. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.