అదే నిర్లక్ష్యం.. ప్రాణాలతో చెలగాటం

ఎన్ని రూల్స్ పెట్టినా, నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో బాధ్యత లేకపోతే ఏ కార్యక్రమమైనా వృధానే. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా ఇలానే జరుగుతోంది. ప్రభుత్వాలన్నీ మూకుమ్మడిగా వ్యాక్సినేన్ డ్రైవ్ ను…

ఎన్ని రూల్స్ పెట్టినా, నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో బాధ్యత లేకపోతే ఏ కార్యక్రమమైనా వృధానే. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా ఇలానే జరుగుతోంది. ప్రభుత్వాలన్నీ మూకుమ్మడిగా వ్యాక్సినేన్ డ్రైవ్ ను చేపడుతుంటే.. క్షేత్రస్థాయిలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. 

నిన్నటికినిన్న హైదరాబాద్ లో ఓ యువతికి కరోనా వ్యాక్సిన్ డబుల్ డోస్ ఇచ్చారు. తాజాగా బిహార్ లో ఓ మహిళకు ఒకేసారి 2 రకాల వ్యాక్సిన్లు వేసేశారు.

5 నిమిషాల్లో కోవాగ్జిన్, కోవీషీల్డ్

కోవాగ్జిన్ తీసుకున్నవాళ్లు, రెండో డోసుగా మళ్లీ దాన్నే తీసుకోవాలి. కోవీషీల్డ్ లో కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. దీనిపై ప్రభుత్వాలన్నీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. అటు ఆరోగ్య సిబ్బంది, వైద్యులు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. అయితే బీహార్ లో మాత్రం ఓ మహిళకు 5 నిమిషాల వ్యవథిలో ఇటు కోవాగ్జిన్, అటు కోవీషీల్డ్ కలిపి ఇచ్చేశారు.

పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్ లో ఒకే చోట రెండు రకాల వ్యాక్సిన్లు వేస్తున్నారు. స్వచ్ఛంధంగా ఎవరు ముందుకొస్తే వాళ్లకు ఆ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సునీలా దేవి అనే మహిళ ముందుగా కోవాగ్జిన్ టీకా వేయించుకుంది. కానీ అవగాహనరాహిత్యం వల్ల రెండో వరుసలో కూడా నిల్చొంది. దీంతో ఆమెకు 5 నిమిషాల వ్యవథిలోనే కోవీషీల్డ్ కూడా వేశారు. 

తప్పు ఎక్కడ జరిగిందంటే.. కోవిన్ పోర్టల్ లో నమోదుచేసిన తర్వాత వ్యాక్సిన్ ఇస్తే బాగుండేది. తప్పు జరిగేది కాదు, కానీ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తాపీగా పోర్టల్ ఓపెన్ చేసి తప్పు తెలుసుకున్నారు. వెంటనే ఆమెను అబ్జర్వేషన్ లో పెట్టారు.

హైదరాబాద్ లో మరో నిర్లక్ష్యం

హైదరాబాద్ లో కూడా ఇలాంటిదే మరో నిర్లక్ష్యం జరిగింది. వ్యాక్సిన్ కోసం వచ్చిన ఓ యువతికి ఒకే వ్యాక్సిన్ ను 2 సార్లు వేశారు. అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన 21 ఏళ్ల లక్ష్మీప్రసన్న వ్యాక్సిన్ కోసం వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతూ టీకా వేసిన పద్మ అనే నర్స్, అలానే ఫోన్ లో మాట్లాడుతూ.. లక్ష్మీప్రసన్నకు రెండో డోస్ కూడా వెంటనే వేసింది.

దీంతో అమ్మాయి అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను వనస్థలిపురంలోని ఓ హాస్పిటల్ లో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప పరిస్థితి ఏంటనేది చెప్పలేం అంటున్నారు వైద్యులు.