Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ లో 'పరాయి' ప్రకంపనలు

టాలీవుడ్ లో 'పరాయి' ప్రకంపనలు

టాలీవుడ్ లో ఏం జరుగుతోంది. తెలుగు నిర్మాతలు అంతా వేరే భాషల హీరోలను, డైరక్టర్లను చకచకా దిగుమతి చేస్తున్నారు? కన్నడ, తమిళ డైరక్టర్లకు తెలుగు హీరోలు డేట్లు ఇస్తున్నారు. తెలుగు డైరక్టర్లకు పరాయి భాష హీరోలు డేట్లు కేటాయిస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి పరిణామమే. 

తెలుగు మార్కెట్ భయంకరంగా పెరిగింది. నాన్ థియేటడ్ హక్కుల రూపేణా వచ్చే ఆదాయం అన్నది పెరగడం చాలా కలిసి వచ్చింది. ఎప్పుడయితే పలు భాషల్లో సినిమా అంటే ఆ ఆదాయం మరింతగా పెరిగుతుంది. కేవలం ఈ అవకాశం అందిపుచ్చుకోవడం కోసమేనా అంటే కాదనే చెప్పాలి.

హీరోలు, డైరక్టర్లు తక్కువ, బ్యానర్లు ఎక్కువ కావడం వల్ల వచ్చిన పరిణామం కూడా. తెలుగు టాప్ హీరోలు ఏడాదికి ఓ సినిమా చేయడం గగనం అవుతోంది. మిడ్ రేంజ్ హీరోలు ఏడాదికి రెండు చేస్తున్నారు కానీ సక్సెస్ రేట్ తేడా కొడుతోంది. ఇలాంటి నేపథ్యంలో పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు చేతులు ముడుచుకు కూర్చోవాల్సి వస్తోంది. ఆఫీసుల నిర్వహణ తప్పదు. మరోపక్కన డైరక్టర్లు కూడా ఏళ్ల తరబడి ఖాళీగా వుండాల్సి వస్తోంది.

సినిమాకు యాభై కోట్లు తీసుకునే హీరోకు ఆ మొత్తం ఏటా వచ్చేస్తోంది. కానీ సినిమాకు పదిహేను నుంచి పాతిక కోట్లు తీసుకునే డైరక్టర్లు మాత్రం ఏడాది నుంచి రెండేళ్లు ఖాళీగా వుండాల్సి వస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తమిళ హీరోలను తెలుగులోకి తీసుకురావడం ద్వారా ఏడాదికి కనీసం మరో మూడు నాలుగు పెద్ద సినిమాలు పెరిగే అవకాశం వుంది. అంటే నాలుగు బ్యానర్లకు అవకాశం వుంటుంది. 

అదీ గాక తెలుగు హీరోలతో పాన్ ఇండియా సినిమా తీస్తే వచ్చే మార్కెట్ వేరు. రాజమౌళికి తప్ప వేరే వాళ్లు ఇంకా అంత క్రేజీ మార్కెట్ క్రియేట్ చేయలేదు. రాబోయే సిన్మాలతో అలాంటి మార్కెట్ ఏర్పాటు అవుతుందేమో చూడాలి. . అదే తమిళ హీరోలతో బహు భాషా సినిమాలు తీయడం వేరు. వరల్డ్ వైడ్ గా వుండే తమిళ మార్కెట్ ప్లస్ అవుతుంది. విజయ్ లాంటి హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా టర్నోవర్ వందల కోట్లలో వుంటోంది. మన హీరోలకు అలాంటి చాన్స్ తక్కువ.

పైగా తమిళ టాప్ హీరోలకు మన దగ్గర కనీసం లో కనీసం పది కోట్ల మార్కెట్ వుంది. కానీ మన హీరోలకు తమిళనాట అంత లేదు. బాహుబలి లాంటి సినిమాలు మాత్రమే మినహాయింపు. ఇలాంటి నేపథ్యంలో తెలుగు దర్శకులకు చేతినిండా పనీ వుంటుంది, బ్యానర్లకు సినిమాలు వుంటాయి. తమిళ హీరోలను తీసుకురాగలిగితే.  

తెలుగు హీరోల వ్యవహారం కూడా నిర్మాతలకు మింగుడుపడడం లేదు. వాళ్లే కథలను, వాళ్లే డైరక్టర్లను ఫిక్స్ చేస్తారు. వాళ్లే నిర్మాతలకు సినిమాలు కేటాయిస్తారు. యాభై కోట్ల వరకు రెమ్యూనిరేషన్ లాగేస్తూనే, మళ్లీ లాభాల్లో వాటా అంటున్నారు. 

ఇన్నింటికీ ఒప్పుకున్నా, సినిమా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు పూర్తవుతుంది? అన్నది తెలియదు. పైగా నష్టాలు వస్తే ఏ హీరో కూడా ఆదుకోరు. అందుకే మెల్లగా, పరాయి భాషల హీరోలను నేరుగా దిగుమతి చేయడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. విజయ్, ధనుష్ సినిమా ప్రకటనలు వచ్చేసాయి. సూర్య సినిమా ప్రకటన రావాల్సి వుంది. విశాల్ ఎప్పటి నుంచో స్వంత బ్యానర్ మీద దండయాత్రలు చేస్తున్నారు. అదే కనుక మన నిర్మాతలకు, డైరక్టర్లకు చాన్స్ ఇస్తే మంచి సినిమా కచ్చితంగా అందిస్తారు. 

ఇదిలా వుంటే బాలీవుడ్ లో మళ్లీ అడుగు పెట్టారు. దాసరి, రాఘవేంద్రరావు, బాపయ్య, ల తరువాత హిందీ సినిమాల మీద మనవాళ్ల దృష్టి తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ అది మొదలైంది. జెర్సీ, ఎఫ్ 2 , అలవైకుంఠపురములో సినిమాలు అక్కడ మొదలయ్యాయి. పూరి జగన్నాధ్ సినిమా నిర్మాణంలో వుంది. సల్మాన్ తో మైత్రీ సినిమా అన్నది ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. మొత్తానికి టాలీవుడ్ కు కొత్త రెక్కలు వస్తున్నాయి. ఆ రెక్కల బలంతో దేశవ్యాప్తంగా బలంగా విస్తరించాలనుకుంటోంది.  అన్నీ మంచి శకునములే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?