ప్రభుత్వం ఉద్యోగాలిస్తామంటే ఎవరైనా వద్దంటారా..? రెగ్యులర్ పోస్టుల మాట దేవుడెరుగు.. కరోనా కష్టకాలంలో కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగమైనా చాలు అనుకుంటున్నారు చాలామంది. ప్రైవేటు ఉపాధి కూడా కరువయ్యే సరికి ఏదో ఒక ఉద్యోగం దొరికితే కుదురుగా పనిచేసుకుంటామని అంటున్నారు. ఈ దశలో ఏపీ సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 6,03,756 పోస్ట్ లు భర్తీ చేశామని, రాబోయే 9 నెలల కాలంలో 10,143 ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ జాబ్ క్యలెండర్ తో నిరుద్యోగులు సంతోషపడ్డారు, జగన్ కు మనసులోనే కోటి దండాలు పెట్టుకున్నారు.
ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మెచ్చుకోవాల్సిన ప్రతిపక్షాలు మాత్రం తమ వక్రబుద్ధిని చాటుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగులంతా తమ అక్కసు వెళ్లగక్కారు. ఇలాంటి వారందరికీ ఓ పొలిటికల్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
బాబు-జాబు.. అప్పుడు లేవని లోకేష్ నోరు..
గతంలో బాబు వస్తాడు, జాబు వస్తుంది అని ప్రచారం చేసుకున్న టీడీపీ.. ఐదేళ్ల కాలంలో ఎన్ని పోస్టులు భర్తీ చేసిందో చెప్పగలదా? ఆ మాట పక్కనపెట్టి, ఇప్పుడు జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ని డాబు క్యాలెండర్ అంటూ పరాచకాలాడుతున్నారు నారా లోకేష్.
వాలంటీర్లను ఉద్యోగులంటారా, సచివాలయ పోస్టుల్ని ఉద్యోగాలంటారా, వైన్ షాపులో చేసే పనిని కూడా జాబ్ అంటారా అంటూ రెచ్చిపోయారు. అసలింతకీ లోకేష్ కి వచ్చిన సమస్య ఏంటి? జాబ్ చేసేవారు బాగున్నారు, ఇచ్చినవారు బాగున్నారు, మధ్యలో లోకేష్ లాంటి రాజకీయ నిరుద్యోగికి వచ్చి ఇబ్బంది ఏంటనేదే అసలు ప్రశ్న.
రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ నిరుద్యోగి అయిన లోకేష్, రికమండేషన్ మీద మండలికి ఎన్నికై, మంత్రి పదవి కొట్టేశారు. అయితే 2019లో జరిగిన మెరిట్ ఎగ్జామ్స్ లో ఘోరంగా ఫెయిలయ్యారు. అడ్డదారిలో జాబులు కొట్టేసిన లోకేష్ కి ఏం తెలుసు ఉద్యోగాల విలువ అంటూ నిరుద్యోగులు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు.
రెండో అతిపెద్ద రాజకీయ నిరుద్యోగి నాదెండ్ల..
సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా విమర్శలు చేశారు. జాబ్ క్యాలెండర్ పై జాబ్ లెస్ నాదెండ్ల కామెంట్లు చేయడం సబబే. వైఎస్ఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో అసెంబ్లీ స్పీకర్ అయిన నాదెండ్ల.. ఆ తర్వాత నిరుద్యోగిగానే కాలం వెళ్లదీశారు.
ఇప్పటికీ ఆయన జనసేనలో నిరుద్యోగే. పార్టీ గెలిచే ప్రసక్తే లేదని తెలిసినా తన ప్రయత్నాలు తాను చేస్తున్న దీర్ఘకాలిక నిరుద్యోగి నాదెండ్ల.. ఇప్పుడు ఏపీలో నిరుద్యోగుల తరపున వకాల్తా పుచ్చుకోవడం విశేషం. పనిలో పనిగా ఓ చెత్త లాజిక్ ని బయటపెట్టి తన టాలెంట్ చూపించారు నాదెండ్ల.
వాలంటీర్లు జీతాలు పెంచాలని అడిగినప్పుడు అవి ఉద్యోగాలు కావు, సేవ అని సర్ది చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ లో ఆయా పోస్ట్ లు భర్తీ చేశామంటూ ఎందుకు లిస్ట్ తయారు చేసిందని ప్రశ్నించారు.
పదో తరగతి విద్యార్హతతో, ఉన్న ఊరిలోనే తమ పని తాము చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ప్రజలకు సేవ చేయాలనుకునేవారే వాలంటీర్లుగా ఉన్నారు. దానికి ప్రభుత్వం రూ.5వేలు గౌరవ వేతనం కూడా ఇస్తోంది.
అంతకంటే ఎక్కువ చదువుకుని, పట్టణాల్లో తక్కువ జీతానికి పనిచేసేవారు కూడా ఉన్నారు. మరి వాళ్లందరివి ఉద్యోగాలయితే, వాలంటీర్లవి ఉద్యోగాలు కావా, వాటిని ప్రభుత్వం తమ లెక్కల్లో చూపించుకుంటే తప్పేంటి?
అంకెల గారడీ యనమలకే బాగా తెలుసు..
ఏపీలో జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ను అంకెల గారడీ అని విమర్శిస్తున్నారు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. విదేశాల్లో రూట్ కెనాల్ కోసం చేసిన అంకెల గారడీని ఆయన మరచిపోయినట్టున్నారు. ఐదేళ్ల పాటు బడ్జెట్ పేరుతో చేసిన గారడీని కూడా యనమల పూర్తిగా మరచిపోయారేమో.
జగన్ కోటి మందికి ఉద్యోగాలిస్తానన్నారని, ఇంటికో ఉద్యోగం అన్నారని చెబుతున్నారు. రెండేళ్లలోనే 6.03లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్.. ఐదేళ్ల కాలంలో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో యనమల కాస్త వేచి చూస్తే బాగుంటుందేమో.
శ్వేతపత్రం కావాలా రామకృష్ణా..?
జగన్ విడుదల చేసిన ఉద్యోగాల క్యాలెండర్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. సచివాలయాల పోస్ట్ లు కళ్లముందున్నా, సచివాలయాల సేవల్ని ప్రజలు నిత్యం అందుకుంటున్నా, ఇంకా రామకృష్ణ లాంటి రాజకీయ నిరుద్యోగులకు నమ్మకం కుదరకపోతే ఎలా?
చంద్రబాబుకి వంతపాడటం అలవాటయ్యాక, కమ్యూనిస్ట్ పార్టీని చాపచుట్టేసిన రామకృష్ణ, టీడీపీకి అద్దెమైకులా తయారయ్యారు. ఉద్యోగం లేకపోయినా టీడీపీ ఇచ్చే తాయిలాలతో బతికేస్తున్న సీపీఐ రామకృష్ణ… పద్ధతి మార్చుకోకపోతే ఎల్లకాలం రాజకీయ నిరుద్యోగిగా ఉండాల్సిందే.
ఈ లిస్ట్ లో మరికొంతమంది రాజకీయ నిరుద్యోగులు కూడా ఉన్నారు. తమకు రాజకీయ ఉద్యోగాలు లేకుండా, యువతకు ఉద్యోగాలు వస్తుంటే వీళ్లు తట్టుకోలేకపోతున్నారు.