మందు దొరికింది.. హడావుడి తగ్గింది

ఆమధ్య ఏ మీడియాలో చూసినా, సోషల్ మీడియాలో ఎవరి అకౌంట్ టచ్ చేసినా వినిపించిన ఒకే ఒక్క పేరు ఆనందయ్య. ఆనందయ్య ఆయుర్వేదం మందుపై చర్చించని నాయకుడు లేరు, విని తరించని ప్రజలూ లేరు. …

ఆమధ్య ఏ మీడియాలో చూసినా, సోషల్ మీడియాలో ఎవరి అకౌంట్ టచ్ చేసినా వినిపించిన ఒకే ఒక్క పేరు ఆనందయ్య. ఆనందయ్య ఆయుర్వేదం మందుపై చర్చించని నాయకుడు లేరు, విని తరించని ప్రజలూ లేరు. 

ఆఖరికి హైకోర్టు కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, చుక్కల మందు ఎందుకివ్వట్లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విశేషం. అయితే ఆనందయ్య మందుకి అనుమతి లేనప్పుడు జరిగినంత ప్రచారం.. ఇప్పుడు మందు పంపిణీ చేస్తున్నప్పుడు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే దాదాపుగా ఆనందయ్య హడావిడి తగ్గిపోయింది.

గతంలో ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం ప్రాంతానికి ప్రజలు ఎగబడి వెళ్లేవారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో సందడి పూర్తిగా తగ్గిపోయింది. నాయకులు, కాస్త పలుకుబడి ఉన్నవారు ఆనందయ్యకు బల్క్ గా ఆర్డర్ ఇచ్చి మందు తయారు చేయించి తీసుకెళ్తున్నారు. తమ తమ ప్రాంతాల్లో ఉచితంగా పంచి పెడుతున్నారు. దీంతో ఆనందయ్య కంటే ఆయా నాయకులే ఎక్కువగా హైలెట్ అవుతున్నారు.

అందుబాటులోకి వచ్చేసరికి తగ్గిన డిమాండ్..

ఆనందయ్య మందుకి ఇంకా క్రేజ్ ఉంది కానీ, డిమాండ్ తగ్గిపోయింది. కుంకుడు గింజంత మందు దొరికినా అదృష్టమే అనుకున్నవారు, ఇప్పుడు ప్యాకెట్ దొరికినా లైట్ తీసుకుంటున్నారు. 

డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం.. సప్లై బాగా పెరిగిపోవడంతో, ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయింది. ఈమధ్య నకిలీ ఆనందయ్యలు కూడా చాలామంది పుట్టుకురావడంతో అసలు ఆయుర్వేదం మందు అంటేనే జనం అనుమానించే పరిస్థితి. దీంతో ఆనందయ్య మందుకి డిమాండ్ దాదాపుగా తగ్గిపోయింది.

కేసులు తగ్గడం మరో ప్రధాన కారణం..

గతంలో ఆనందయ్య మందు పంపిణీ జరిగినప్పుడు కృష్ణపట్నం గ్రామానికి ఆంబులెన్స్ లు బారులు తీరాయి. కరోనా సోకినవారు ఆస్పత్రులకి వెళ్లకుండా ఆనందయ్య ఊరికి క్యూ కట్టారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితులు లేవు. 

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గింది, కరోనా కేసుల సంఖ్య కూడా నెమ్మదిస్తోంది. దీంతో అసలు మందులతో పాటు, ఆనందయ్య మందుకి కూడా డిమాండ్ తగ్గిపోయింది. కనీసం ముందస్తు జాగ్రత్తగా వాడే ప్రివెన్షన్ ఔషధాన్ని కూడా ఎవరూ కోరుకోవడంలేదు. ఒకరకంగా మీడియాతోపాటు సోషల్ మీడియా కూడా.. దాదాపుగా ఆనందయ్యను మరచిపోయింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మాత్రం మందు పంపిణీ కొనసాగుతూనే ఉంది. ఎన్నో స్వచ్ఛంధ సంస్థలు ఆనందయ్య మందును వివిధ ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. స్థానికంగా  ఉండే నాయకులు తమకు చేతనైనంత చేయూత అందించి మందు పంపిణీ సజావుగా సాగేలా చేస్తున్నారు. 

పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ మొదలైంది. ఈరోజు సికింద్రాబాద్ లోని ఆర్య సమాజంలో ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. ప్రభుత్వం, రాజకీయ నేతల కంటే స్వచ్ఛంధ సంస్థలు ఎక్కువగా చొరవ తీసుకోవడం విశేషం.