ఆ జడ్జి తమ కేసును విచారించొద్దని ఓ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడం హాట్ టాఫిక్‌గా మారింది. ఇంత వరకూ జడ్జిలపై ఫిర్యాదు అంటే ఒక్క ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే గుర్తొచ్చేవారు. ఇప్పుడు జగన్‌ను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరిపిస్తున్నారు.
కోల్‌కతా జడ్జిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫిర్యాదు చేయడం ఏపీలో ప్రధాన ఆకర్షణగా మారింది. దీనికి కారణాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో మమతాబెనర్జీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఎన్నికల్లోనూ, ఓట్ల లెక్కింపులోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని, కావున ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ కౌశిక్ చందా విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి అనుగుణంగా వేశారా అనే విషయమై ఓ నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు జడ్జి ఆదేశాలు ఇచ్చారు.
జస్టిస్ కౌశిక్ చందాకు బీజేపీ నేపథ్యం ఉందని, ఆయన తన పిటిషన్ విచారణ చేపట్టొద్దని కోరుతూ మమతాబెనర్జీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కార్యదర్శికి లేఖ రాశారు. ఈ మేరకు లేఖను తన తరపు న్యాయవాది ద్వారా అందజేశారు.
అలాగే జస్టిస్ కౌశిక్‌ను హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమించడంపై కూడా సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే…ఈ విషయమై ప్రభుత్వ వైఖరికి మద్దతుగా కొంత మంది న్యాయవాదులు కోల్‌కతా హైకోర్టు ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించడం విశేషం.