లోకేశ్‌కు సంస్కృతం చిక్కులు

లోకేశ్ తెలుగు భాషా ప‌రిజ్ఞానం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందుకు ఆయ‌న్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే ఆయ‌న పుట్టుక మాత్ర‌మే తెలుగు స‌మాజంలో. విద్యాభ్యాసం అంతా ఆంగ్ల మాధ్య‌మ‌మే.…

లోకేశ్ తెలుగు భాషా ప‌రిజ్ఞానం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందుకు ఆయ‌న్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఎందుకంటే ఆయ‌న పుట్టుక మాత్ర‌మే తెలుగు స‌మాజంలో. విద్యాభ్యాసం అంతా ఆంగ్ల మాధ్య‌మ‌మే. పైగా ప్ర‌పంచంలోనే ప్ర‌తిష్టాత్మ‌క విశ్వ‌విద్యాల‌యం చ‌దివిన ఘ‌న‌త మ‌న లోకేశ్ బాబుది. తండ్రి వార‌సత్వంగా రాజ‌కీయాల్లోకి రావ‌డంతో తెలుగు మాట్లాడాల్సిన అవ‌స‌రం లోకేశ్‌కు ఏర్ప‌డింది.

లోకేశ్ మంచి తెలుగు మాట్లాడ్డానికి, రాయ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ టీచ‌ర్‌ను కూడా చంద్ర‌బాబు నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. లోకేశ్‌కు తెలుగు గురువు పెద్ది రామారావు. ఈయ‌న ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ స‌మీప బంధువు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కూడా. 

ఈయ‌న‌కు అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం భారీ న‌జ‌రానా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా మండలి సభ్యుడిగా నియమించింది. నెలకు రూ. లక్ష వేతనం, హెచ్ఆర్ఏ కింద రూ.35 వేలు, అలాగే ప్రభుత్వ సలహాదారుతో సమానంగా ఇతర అలవెన్సు లన్నీ ఇచ్చింది.  

పెద్ది రామారావు ఏం చెప్పారో తెలియ‌దు కానీ, లోకేశ్‌లో తెలుగు జ్ఞానం ఆశించిన స్థాయిలో ఇంప్రూవ్ కాలేద‌న్న‌ది నిజం. భాష అనేది అనుభ‌వంపై అభివృద్ధి చెందుతుందే త‌ప్ప‌, త‌ర‌గ‌తి గ‌దుల్లో కాద‌ని లోకేశ్ విష‌యంలో నిరూపిత‌మైంది. కాలం గ‌డిచేకొద్ది లోకేశ్ ఫ‌ర్వాలేద‌నిపించుకుంటున్నారు. అయితే తెలుగు మాట్లాడ‌య్యా సామి అంటే….లోకేశ్ సంస్కృతాన్ని అల‌వోక‌గా ప‌ల‌కిస్తున్నారు. ఇప్పుడిదే సోష‌ల్ మీడియాలో లోకేశ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్‌కు గురి చేస్తోంది.

కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో హత్యకు గురైన టీడీపీ నాయకుల కుటుంబీకులను ఆయన శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ పోలీసులు, అధికారులు కూడా రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయిస్తున్నారని, ఏ ఒక్కరినీ మరచిపోకుండా వడ్డీ చెల్లిస్తానని హెచ్చరించారు. 

ఈ ప‌క్క‌నే ఓ కుక్క ఉంద‌ని, మొరుగుతోంద‌ని ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి గురించి ప‌రోక్షంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అలాగే సీఎం జ‌గ‌న్‌పై కూడా నోరుపారేసుకున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే వాడు సీబీఐ విచారణ చేయించాలని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు.  

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన త‌మ నేత‌పై లోకేశ్ అవాకులు చెవాకులు పేల‌డంతో వైసీపీ శ్రేణులు విరుచుకుప‌డుతున్నాయి. లోకేశ్ ఒక‌టంటే, వాళ్లు ప‌ది తిట్లు తిడుతున్నారు. ఇద్ద‌రు గ్రామ‌స్థాయి నేత‌ల‌ను కోల్పోయిన లోకేశ్‌, త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా, ధైర్యం క‌ల్పించేందుకు ఆవేశంతో మాట్లాడారు. ఒక దుర్ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో కేడ‌ర్ భ‌యానికి గురి కావ‌డం స‌హ‌జం. ఆ స‌మ‌యంలో వారికి భ‌ద్ర‌త క‌ల్పించేలా ధైర్యాన్ని నూరిపోయడం నాయ‌కుడి ల‌క్ష‌ణం.

కానీ త‌న భావాల్ని వ్య‌క్త‌ప‌రిచే భాష లోకేశ్‌లో లేక‌పోవ‌డం వ‌ల్ల వ‌చ్చిన స‌మ‌స్యే ఇదంతా. చెప్పాల‌నుకున్న‌ది మ‌న‌సులో నుంచి మాట‌గా బ‌య‌టికి వ‌చ్చే క్ర‌మంలో లోకేశ్ వాడు, వీడు అంటూ త‌న స్థాయిని దిగ‌జార్చుకుని మాట్లాడార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. 

ఇది లోకేశ్‌కు న‌ష్టం క‌లిగిస్తుంది. భావోద్వేగ ఘ‌ట‌న‌ల‌ను అడ్ర‌స్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశాల‌పై క‌స‌ర‌త్తు చేయాల్సిన అవ‌స‌రాన్ని క‌ర్నూలు ఘ‌ట‌న ఓ గుణ‌పాఠం అని చెప్ప‌క త‌ప్ప‌దు.