రాజకీయాల్లో లౌక్యం ఎంతో ముఖ్యం. చేయలేని దాన్ని కూడా చేస్తామనడం రాజకీయాల్లో సర్వసాధారణం. ఇంకొందరు నేతలు మరింత ముందుకెళ్లి …ఏకంగా అరచేతిలో వైకుంఠం చూపుతుంటారు. ఇలాంటి నేతలకు ఉదాహరణగా మన చంద్రబాబు నాయుడిని మించి మరొకరు లేరనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి.
అవకాశాలు, పరిస్థితులను బట్టి అభిప్రాయాలు, యూటర్న్ తీసుకోవడం రాజకీయ నేతల ప్రాథమిక లక్షణాలేమో అని చంద్రబాబును చూసిన వారికి ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. ఇలా చాలా నెగెటివ్ అంశాలకు చంద్రబాబు ఓ రోల్ మోడల్.
ఇందుకు పూర్తి విరుద్ధం చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ మాట చెబితే జనాల నుంచి ప్రతికూలత వ్యక్తమవుతుందనే భయం జగన్‌లో ఏ మాత్రం లేదు. ఓట్లు పోతాయనే ఆందోళన అంతకంటే లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయ నేతల్లో ఉండాల్సిన లౌక్యం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌లో ఎంత మాత్రం లేదు. ఇందుకు తాజా ఉదంతమే నిదర్శనం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేయబోయే ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన సందర్భంగా ప్రత్యేక హోదాపై సీఎం అన్న మాటలను తెలుసుకుందాం.
“ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని పదే పదే అడగటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదని, లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి ఆధిక్యత ఉంది. దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారుతాయనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. దేవుడి ఆశీస్సులతో ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని కోరుకుంటున్నా” అని అన్నారు.
25కు 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఎన్నికల సమయంలో జగన్ ఊరూరా ప్రచారం నిర్వహించారు. 22 ఎంపీ సీట్లను ఏపీ ప్రజానీకం కట్టబెట్టింది. అయితే జగన్ ఆశించినట్టు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాలేదు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని సీఎంగా జగన్ తన మొట్టమొదటి ఢిల్లీ పర్యటన సందర్భంగా తేల్చి చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకు నాటి సీఎం చంద్రబాబునాయుడు అంగీకరించారు. అంతేకాదు, ప్రత్యేక హోదా దక్కించుకున్న రాష్ట్రాలకు ఏం ఒరిగిందని సాక్ష్యాత్తు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ప్రధాన ప్రతిక్షం వైసీపీని నిలదీశారు. అనంతర రాజకీయ పరిణామాల్లో ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు రాజీనామా, టీడీపీ కేంద్రమంత్రులు మోదీ కేబినెట్ నుంచి బయటకు రావడం చకచకా జరిగిపోయాయి.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి, అధికారంలోకి వైసీపీ రావడానికి ప్రత్యేక హోదా అంశం కూడా తోడైంది. అయితే ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ జగన్ డొంక తిరుగుడు వ్యవహారాలకు తావు లేకుండా తన నిస్సహాయతను ప్రకటించడం సొంత పార్టీ శ్రేణులకు కూడా ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తున్నాయి. కనీసం కేంద్రంపై పోరాడుతూ ఉంటామని జగన్ చెప్పి ఉంటే బాగుండేదని వైసీపీ శ్రేణుల అభిప్రాయం. కానీ జగన్ అలా చేసే రకం కాదు కదా? తాను ఏమనుకుంటున్నారో అదే చెప్పడం ఆయన నైజం. ఈ ధోరణి ఒక రకంగా జగన్‌కు లాభం, మరో రకంగా నష్టం కూడా.
ఉదాహరణకు కాపులకు రిజర్వేషన్లను కల్పించలేనని జగన్ గత సార్వత్రిక ఎన్నికల ముందు తేల్చి చెప్పారు. దీంతో కాపుల ఓట్లు పోతాయని వైసీపీ ఆందోళనకు గురైంది. మరోవైపు జగన్ తీరుతో కాపుల ఓట్లు మళ్లీ గంపగుత్తగా తమకే పడతాయని టీడీపీ నమ్మింది. 2014లో కాపులకు రిజర్వేషన్ ఇస్తానన్న హామీని నిలబెట్టుకోలేని చంద్రబాబు ప్రభుత్వం, కేవలం జగన్‌పై వ్యతిరేకతే తమకు శ్రీరామ రక్ష అని కాపుల ఓట్లపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి.
నిజం చెప్పిన జగన్‌నే ఆదరించారు తప్ప, మోసగించిన చంద్రబాబును కాదనే వాస్తవం గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. అలాగే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ జగన్ ససేమిరా అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీని ఇవ్వలేనని భీష్మించుకుని, ఓటమిని మూటకట్టుకున్నారు. ఇదే చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల రుణాలను మాఫీ చేయలేక చతికిల పడ్డారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఆశావహ దృక్పథాన్ని మెచ్చుకోవాలి. కానీ నిస్సహాయతను ఎవరూ అంగీకరించరు. అదే ఇప్పుడు జగన్‌పై వేలెత్తి చూపడానికి అవకాశం కల్పిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న ఏపీ ప్రయోజనాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్దయగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరోవైపు మొదటి నుంచి మోదీ సర్కార్‌ను నిలదీయడంలో ఏపీ పాలక ప్రతిపక్షాలు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి.