తనది 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే గొప్పలు చెప్పుకోవడం కాదు. అందుకు తగ్గట్టు హూందాగా వ్యవహరిస్తే గౌరవం దక్కుతుంది. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానని చంద్రబాబు చెప్పుకుంటూ…అందరూ తన మాటే వినాలని ప్రతిపక్ష నేతగా ఆయన డిమాండ్ చేయడం చూశాం.
కరోనా విపత్తు వేళలో రాజకీయాలు చేయమంటూ ఆయన ఇటీవల ప్రకటించడం చూశాం. అయితే ఇలా ప్రకటన చేసిన ఒక్కరోజు కూడా కరోనాను రాజకీయంగా వాడుకోకుండా ఉండలేకపోయాడు. హైదరాబాద్‌లో ఇంట్లో కూర్చొని సీఎం, గవర్నర్, ప్రధానికి రోజుకొకరికి చొప్పున ఏదో ఒక అంశాన్ని తీసుకుని లేఖలు రాస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
రాజకీయాలు వద్దు అంటూనే రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లింది. ఇదే జనసేనాని పవన్‌కల్యాణ్‌ను తీసుకుంటే ఇలాంటి లేఖలేవీ రాయలేదు. కానీ పెద్దగా రాజకీయ ప్రస్తావనలు ఆయన చేయడం లేదు. జగన్ సర్కార్‌కు సూచనలు మాత్రం చేస్తూ వస్తున్నాడు.
గురువారం ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ తర్వాతే రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడదామని అన్నాడు.
కరోనా సమయంలో రాజకీయాలు, ప్రభుత్వంపై విమర్శలు చేయడం మన ఉద్దేశం కాదని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశాడు. సంయమనం పాటిస్తూ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అధికారుల నుంచి తగిన సహాయం, సేవలు అందేలా చూడాలని సూచించాడు.
కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్‌కల్యాణ్ ఎంతో రాజకీయ పరిణతి కనబరిస్తే…40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే బాబు చేస్తున్నదేంటి? ఎంత సేపూ కరోనాపై కూడా రాజకీయ లాభాలు ఏరుకోవడమేనా? తన పార్టీ శ్రేణులతో కరోనా బాధితులకు సాయం అందించేలా బాబు ఎందుకు సమన్వయపరచడం లేదో అర్థం కాదు. అనుభవం కేవలం ప్రచారానికి కాకుండా…ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తే లాభం ఉంటుంది. విపత్తు సమయంలో ఎలా మెలగాలో కనీసం తన పార్ట్నర్ పవన్ నుంచైనా చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులు నేర్చుకుంటే మంచిది.