లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ నుంచి వీడియో, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ…కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తానేదో చేస్తున్నాననే బిల్డప్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒక రోజు మీడియాతోనూ, మరుసటి రోజు తన పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రచారం పొందడానికి బాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ విధంగా చేస్తున్నప్పటికీ తగిన ప్రచారం లభించలేదనే బాధ బాబును వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రతిపక్ష నేత బాబు గురించి ఓ అసక్తికర విషయాన్ని వెల్లడించాడు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు జగన్ సర్కార్ చిత్తశుద్ధితో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నాడు. అయితే హైదరాబాద్‌లో కూర్చొని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డాడు.
కోవిడ్‌పై ఏదైనా చేయాలంటే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆయన ఆహ్వానించాడు. అయితే బాబు ఇక్కడికి రావాలంటే నిబంధనలు వర్తిస్తాయన్నాడు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలన్నాడు. ఆ తర్వాత అనుమతి పత్రంతో వచ్చినప్పటికీ 14 రోజుల పాటు క్వారంటైన్‌కు చంద్రబాబు వెళ్లాల్సి ఉంటుందని మంత్రి మోపిదేవి స్పష్టం చేశాడు.
ఇప్పటికే బాబుపై ఈ రకమైన కామెంట్స్‌తో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ప్రచార యావతో హోం క్వారంటైన్ నుంచి పదేపదే బయటికి వస్తూ వీడియో , టెలికాన్ఫరెన్స్ అంటూ బాబు చేస్తున్న హడీవుడి అంతా ఇంతా కాదు.