ఇది ఏప్రిల్ ఫూల్ క‌థ‌నం కాదు…

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రంటారు. స‌రిగ్గా దీన్ని నిజం చేస్తూ ….తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీకి అస్స‌లు ఊహించ‌ని పార్టీ నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌నుంది. తిరుప‌తిలో ఉప…

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌రంటారు. స‌రిగ్గా దీన్ని నిజం చేస్తూ ….తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీకి అస్స‌లు ఊహించ‌ని పార్టీ నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌నుంది. తిరుప‌తిలో ఉప ఎన్నిక‌లో వైసీపీకి సీపీఐ మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.  

టీడీపీ అనుబంధ పార్టీగా పేరున్న సీపీఐ నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌నుంద‌నే స‌మాచారంతో వైసీపీ షాక్‌కు గుర‌వుతోంది. సీపీఐ అనూహ్య నిర్ణ‌యం తీసుకోవ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు లేక‌పోలేదు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక బ‌రిలో సోద‌ర వామ‌ప‌క్ష పార్టీ సీపీఎం త‌మ అభ్య‌ర్థిని నిన్న ప్ర‌క‌టించింది. 

నెల్లూరు యాద‌గిరి అభ్య‌ర్థిత్వాన్ని సీపీఎం కేంద్ర క‌మిటీ స‌భ్యుడు వి.శ్రీ‌నివాసులు ప్ర‌క‌టించారు. అయితే అభ్య‌ర్థి ఎంపిక ఏక‌ప‌క్షంగా జ‌రిగింద‌ని, మాట మాత్రం కూడా త‌మ‌తో చ‌ర్చించ‌కుండా అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తే తామెలా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని సీపీఐ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. దీంతో సీపీఎంకు రెడ్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టైంది.

ఇదిలా ఉండ‌గా మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ-సీపీఐ పొత్తు కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల టీడీపీ పొత్తు ధ‌ర్మాన్ని పాటించ‌క‌పోవ‌డంతో సీపీఐ అగ్ర‌నేత‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు క‌ర్నూలు జిల్లా నంద్యాల‌, చిత్తూరు జిల్లా తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలో టీడీపీ పొత్తు ధ‌ర్మాన్ని ఖాత‌రు చేయ‌కుండా సీపీఐ అభ్య‌ర్థులున్న చోట మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా, తానే పోటీ చేసింది.

తిరుప‌తి కార్పొరేష‌న్ ప‌రిధిలోని 3వ డివిజ‌న్‌లో టీడీపీ తిరుప‌తి పార్ల‌మెంట్ ఇన్‌చార్జ్ న‌ర‌సింహ‌యాద‌వ్ త‌మ్ముడు బ‌రిలో నిలిచాడు. ఇదే డివిజ‌న్ నుంచి సీపీఐ త‌న అభ్య‌ర్థిని నిలిపింది. పోటీ నుంచి త‌ప్పుకుని మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని సీపీఐ అగ్రనేత నారాయ‌ణ ప్రాథేయ‌ప‌డినా వినిపించుకోలేదు. దీంతో నారాయ‌ణ టీడీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

దొంగ‌లు దొంగ‌లూ  క‌లిసిపోయార‌ని, వైసీపీకి అమ్ముడు పోయి పోటీకి దిగాడ‌ని ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీని ఓడ‌గొట్టాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. త‌మ‌కు టీడీపీ నేత‌లు ద్రోహం చేశార‌ని, వీళ్ల వ్య‌వ‌హారశైలిలో మార్పు రాక‌పోతే రానున్న‌ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో గ‌ట్టిగా బుద్ధి చెప్పాల్సి వ‌స్తుంద‌ని నారాయ‌ణ హెచ్చ‌రించారు.

ఇదే సంద‌ర్భంలో మ‌రో ముఖ్య‌మైన అంశాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వ‌స్తుంది. డోన్‌లో 16వ వార్డు నుంచి క‌ర్నూలు జిల్లా ఏఐటీయూసీ జిల్లా అధ్య‌క్షుడు, సీపీఐ నేత‌ సుంక‌న్న త‌న స‌మీప టీడీపీ అభ్య‌ర్థి శ్రీ‌రాములుపై 897 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఇక్క‌డ సుంక‌న్న‌కు వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు వైసీపీతో పాటు ప్ర‌చారం చేయాల‌ని సీపీఐ నేత‌లు సూత్ర‌ప్రాయంగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ఇంత కాలం చంద్ర‌బాబ‌కు లెప్ట్ అండ్ రైట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రామ‌కృష్ణ‌, నారాయ‌ణ మాట‌ల్లో ఇటీవ‌ల వ‌చ్చిన మార్పును గ‌మ‌నించాల్సి ఉంది. ప్ర‌జాద‌ర‌ణ ప‌క్క‌న పెడితే టీడీపీ అనుబంధ పార్టీగా ముద్ర‌ప‌డిన సీపీఐ నుంచి అనూహ్య మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌న్న సంకేతాలు వైసీపీని సంభ్ర‌మాశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. చివ‌రిగా ఒక్క మాట‌… ఇది ఏప్రిల్ ఫూల్ వార్తా క‌థ‌నం ఎంత మాత్రం కాదు.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్