‘దేశం’ కళ్లకు మీడియా గంతలు

నిజమైన మిత్రుడు సరైన సలహాలు ఇస్తాడు.సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా సాయం చేసేది, ఆ పార్టీకి అను'కుల' మీడియా. పార్టీతో సామాజిక బంధాలు పెనవేసుకుని, ఆ పార్టీ కోసం…

నిజమైన మిత్రుడు సరైన సలహాలు ఇస్తాడు.సరైన దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలా సాయం చేసేది, ఆ పార్టీకి అను'కుల' మీడియా. పార్టీతో సామాజిక బంధాలు పెనవేసుకుని, ఆ పార్టీ కోసం అహరహం కష్టపడుతూ వుంటుంది. తెల్లవారిలేచింది మొదలు వైకాపాను దుయ్యబట్టడం, తేదేపాను నెత్తిన మోయడం తప్ప మరో పని లేదు. ఈ మీడియాలో ఒకటి కాదు, చాలా వున్నాయి. 

ప్రింట్ మీడియా నుంచి వెబ్ మీడియా వరకు సకలా కళా వల్లభులు వున్నారు. నిజానికి వీరంతా చేయల్సింది తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం. కానీ చేసేది తెలుగుదేశం తప్పులు దాచేసి, భజన చేయడం.ఇదే ఆ పార్టీకి శాపంగా మారుతోంది.

పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం గట్టి దెబ్బ తింది. కానీ గుర్తులు లేవు కాబట్టి గెలిచేసినట్లే అని ఈ అను'కుల' మీడియాలు టముకేసాయి. దాంతో తెలుగుదేశం పెద్దలు గుడ్డిగా నిజమే అని నమ్మేసారు. మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. గుర్తులపై పోటీ. పైగా బ్యాలట్ నే. ఈవిఎమ్ లపై నెట్టేయడానికీ లేదు. ఏమయింది? దారుణ పరాజయం మిగిలింది. 

పోనీ ఇప్పుడయిన సరైన పోస్ట్ మార్టం చేస్తున్నారా? సరైన విశ్లేషణలు సాగించి, తమ సామాజిక బంధాల పార్టీకి సరైన దిశా నిర్దేశం చేస్తున్నరా? లేదు. రకరకాలు కుంటి సాకులు వెదుకుతున్నారు. కిందా పడిన మీదే అంటున్నారు. చిత్ర విచిత్ర వార్తా కథనాల విన్యాసాలు చేస్తున్నారు. ఓట్లు వేయని వారంతా తెలుగుదేశం జనాలే. వారు ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి ఎందుకు బదనామ్ కావడం అని సైలంట్ అయిపోయారట. లేదంటే దేశం ఓటు బ్యాంక్ యాభై శాతం దగ్గరకు చేరేదంట..ఓ మీడియా తీర్మానం.

అసలు పర్సంటేజ్ లెక్కలు తీయాల్సింది ఇలా కాదు. ఆ లెక్కలు వేరు. అలా అయితే తెలుగుదేశం మంచి ఓట్లు తెచ్చుకున్నట్లే అంటోంది మరో మీడియా. అసలు పెద బాబు, చినబాబుల తప్పేం లేదు. మాజీలు, తాజాలు నిద్రపోయారు. పని చేయలేదు. లేదంటే సూపర్ ఫలితాలు వచ్చేసేవి అంటోంది ఇంకో మీడియా. 

అసలు చంద్రబాబు రూపాయి తీసి ఖర్చు చేయకపోతే నాయకులు ఎందుకు ఖర్చు చేస్తారు? అసలు అన్నింటికి మించి రాజకీయ నాయకులు అంటేనే లొసుగుల మయం. అలాంటి వారు లొసుగులు దాచి పోరాటం ఎలా సాగిస్తారు. బాబుగారు తన లొసుగుల వల్లే హైదరాబాద్ నుంచి అర్జెంట్ గా అమరావతి వచ్చిన సంగతిని కావాలని విస్మరిస్తున్నారు. 

ఇవన్నీ చాలక భాజపా కు దగ్గర కావాలన్న తెలుగుదేశం ఆలోచన సరి కాదని జనసేన కు దగ్గరైతే ఈ శాతం ఓట్లు, ఆ శాతం ఓట్లు కలిసి, గెలుపుఖాయమని సలహాలు ఇచ్చేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ వన్ ప్లస్ వన్ టూ కాదని పొరపాటున కూడా చెప్పడం లేదు. పైగా ఇప్పటికే బిసి లు తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయారు. జనసేన తో ఇప్పటికే లోపాయకారీ పొత్తు కొనసగుతోందన్న విషయాన్ని దాచి పెడుతోంది. ఈ సంగతి గమనించే బిసిలు పార్టీకి దూరం అయిపోతున్నారన్న సత్యం మరుగున పెడుతోంది. 

అసలు ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తింది లేదన్న సంగతిని పొరపాటున కూడా చెప్పరు. మోడీకి, భాజపాకు జంకి పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న సంగతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించిన వైనం గుర్తు చేయరు. దేశం కప్పదాటు వ్యవహారాన్ని ప్రజలు గమనించినా, ఈ మీడియా గమనించనట్లే వుంటుంది. తెలుగుదేశానికి అప్రియమైన మాటలు చెప్పదు. 

ప్రియమైన మాటలతో మభ్య పెడుతూ, మబ్బుల్లో వుంచుతూనే వుంటుంది. పార్టీ, పార్టీ నేతలు కూడా ఈ మాయ మాటలనే నమ్ముతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు విజయం తథ్యం అనే నమ్ముతూ బతికేస్తున్నారు.

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు

అల్లు అర్జున్ కి నేను పిచ్చ ఫ్యాన్