బ్రాడీని గన్నరీ సార్జంట్‌గా ప్రమోట్ చేశారు. పబ్లిక్ ఫంక్షన్స్ అనేకవాటిల్లో అతను పాల్గొంటున్నాడు. వాటిల్లో చాలా బాగా మాట్లాడుతూండడంతో అతనికి పేరొస్తోంది. వైస్ ప్రెసిడెంటు వాల్డన్ కన్ను అతనిపై పడింది. అతని పాప్యులారిటీని వాడుకుందామా అన్న ఆలోచన వచ్చింది. అతని అడ్వైజర్‌గా పని చేస్తున్న ఎలిజబెత్ (గైన్స్) డేవిడ్‌ను కలిసి బ్రాడీని కాంగ్రెస్‌మన్‌గా చేయిద్దామను కుంటున్నామని, కానీ అతను మానసికంగా స్థిరంగా ఉన్నాడా లేదా అని గమనించి చెప్పమని కోరింది. ఎందుకంటే యుద్ధం నుంచి తిరిగివచ్చినవారు, యిలా యుద్ధఖైదీలుగా ఏళ్ల తరబడి వున్నవారు గతస్మృతులతో బాధపడుతూ మెంటల్ బాలన్స్ కోల్పోతారని అందరికీ తెలిసిన విషయం.
నిజానికి బ్రాడీ విషయంలో అదే జరుగుతోంది. ఒక ఫంక్షన్ జరిగాక అతనితో బాటు కారులో మైక్ కూడా వస్తున్నాడు. తన కుటుంబం తన కంటె మైక్‌నే ఎక్కువ అభిమానిస్తోందన్న విషయం బ్రాడీని మండిస్తోంది. ‘నేను లేనప్పుడు నా స్థానంలో నా భార్యకు, కుటుంబానికి అండగా వున్నావ్’ అంటూ వెటకారంగా మాట్లాడాడు. ఇంటికి వెళ్లాక భార్యతో కూడా ‘నీకూ మైక్‌కు మధ్య వ్యవహారం నడిచిన సంగతి నాకు తెలుసులే’ అని నర్మగర్భంగా మాట్లాడాడు.
క్యారీ చేతిలో ఉన్న నాలుగువారాల వారంటు ముగిసిపోవడానికి ఒక్క రోజు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ఏమీ దొరకలేదు, మళ్లీ పొడిగించగలవా అని సాల్‌ను అడిగింది. ‘కుదరదు, నువ్వు వెంటనే ఆ నిఘా సరంజామా అంతా తొలగించాలి. ఈ బ్రాడీని వదిలిపెట్టి, ఆ నగ తాలూకు సొమ్ము ఎటు వెళ్లిందో దానిపై దృష్టి పెట్టు’ అన్నాడు సాల్. మర్నాడు బ్రాడీ కుటుంబం యావత్తు చర్చికి వెళ్లింది. ఆ సమయంలో క్యారీ, వర్జిల్, మాక్స్ వెళ్లి సామానంతా తీసేశారు.
బ్రాడీ గరాజ్‌కు తరచుగా వెళుతూండడం, దానిలో కెమెరాలు లేకపోవడం వలన అక్కడ అతన్ని గమనించ లేకపోవడం క్యారీకి బాధగా ఉంది. అందుకని ఆఖరి నిమిషంలో తను గరాజ్‌కు వెళ్లి అన్నీ క్షుణ్ణంగా చూసింది. అక్కడ నమాజ్ చేసుకునే మ్యాట్, చేతులు కాళ్లు కడుక్కునే బేసిన్ కనబడ్డాయి కానీ ఆమె వాటి గురించి ఏమీ ఆలోచించలేక పోయింది. అవి నమాజ్‌కు సంబంధించినవి అని గ్రహించి వుంటే యితను ముస్లిముగా మారాడా, టెర్రరిస్టులతో చేతులు కలిపాడా అనే కోణంలో ఓ అడుగు ముందుకు వేసేది.
క్యారీ తన ఆఫీసులో లిన్ హత్య జరిగిన 9 గంటల తర్వాత గమనించిన విషయాలు వివరించింది. ప్రిన్స్ అనుచరులందరిపై నిఘా పెడితే అతని సెక్రటరీ లతీఫ్ అనుమానస్పదుడిగా తోచాడు. అతను ఒక లాండ్రోమార్ట్ (ఇంట్లో వాషింగ్ మెషిన్లు లేనివారు అక్కడున్న వాషింగ్ మెషిన్లలో బట్టలు ఉతుక్కోవచ్చు) వద్ద కనబడ్డాడు. డబ్బు చేతులు మారే హవాలా కార్యకలాపాలకు ఆ షాపు కేంద్రమని సిఐఏకు ముందే తెలుసు. అక్కడకు వెళ్లి అతను నగ అమ్మిన డబ్బు అందించి, అల్‌ఖైదా మనుష్యులకు తలా కాస్తా పంచమని చెప్పి వుండవచ్చు.
లాండ్రోమార్ట్ దగ్గర పెట్టిన సెక్యూరిటీ కెమెరాల ద్వారా అప్పణ్నుంచి యిప్పటిదాకా 51 మంది కస్టమర్లు వచ్చి వెళ్లారని గమనించారు. వారిలో కొందరు నిజమైన కస్టమర్లు కావచ్చు, కొందరు టెర్రరిస్టులు కావచ్చు. ఎవరెవరో తెలియదు కాబట్టి యీ 51 మందిపై నిఘా పెట్టాలని నిశ్చయించుకున్నారు. ఈ 51 మందిలో రకీమ్ (ఫైజల్) అనే సౌదీ అరేబియా దేశస్తుడు క్యారీ దృష్టిని ఆకర్షించాడు. ఎందుకంటే అతను యిటీవలే మూడుసార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు.
అతను అవటానికి ప్రొఫెసరే అయినా నిజంగా అల్‌ఖైదాకు సాయపడుతున్నాడు. అతన్ని దీనిలోకి దింపినది ఐలీన్ (మోర్గన్) అనే అమెరికన్ ప్రియురాలు. వాళ్లు ఒక ఎయిర్‌పోర్టుకి దగ్గర్లోనే యీ మధ్యే యిల్లు కొన్నారు. మొత్తం డబ్బంతా ఒకేసారి చెల్లించడంతో ఏజంటు ఆశ్చర్యపడ్డాడు కూడా. విమానాల రొద మాకేమీ యిబ్బంది కాదు, యిది మాకు చాలా సౌకర్యం కూడా అన్నారు వాళ్లు. నిజానికి యింటి పైకప్పు నుంచి రైఫిల్‌తో విమానం నుంచి దిగేవాళ్లపై సులభంగా గురి పెట్టవచ్చు.
క్యారీ, ఆమెతో బాటు డేనీ (గాల్వెజ్) అనే సహచరుడు మర్నాడు రకీమ్‌ను వెంటాడి, వాళ్ల యింటికి వెళ్లి సంగతులు కనిపెట్టాలని అనుకున్నారు. అలాగే అతను కాలేజీ నుంచి బయటకు వచ్చాక కారులో వెంబడించారు. అతను వాళ్ల యింటి ముందు కారాపి వుంటే, ఎయిర్‌పోర్టు దగ్గర యిల్లెందుకు ఉంది అనే కోణంలో ఆలోచించేవారు. కానీ అతను వస్తూండగానే యింటి దగ్గర ఐలీన్‌కు ఒక ఫోన్‌కాల్ వచ్చింది. ‘‘తను వచ్చే రోడ్డు మీద ట్రాఫిక్ బాగా లేదని అతనికి చెప్పు.’’ అని.
అల్‌ఖైదాలో సిఐఏ ఏజంట్లు ఉన్నట్లే, సిఐఏలో, దాని అనుబంధ సంస్థల్లో అల్‌ఖైదా ఏజంట్లు ఉండి, యిలా సమాచారాన్ని అందించేస్తారు. దాన్ని బట్టి అవతలవాళ్లు జాగ్రత్త పడతారు. ఫోన్ రాగానే ఐలీన్ కిటికీలో అమెరికన్ జండా వేలాడదీసింది. అది ఒక సంకేతం. ఏదో ప్రమాదం ఉందని గ్రహించి రకీమ్ కారు ఆ యింటి దగ్గర ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. అతని ప్రవర్తనలో వింతగా ఏమీ తోచకపోవడంతో క్యారీ, డేనీ అతన్ని అనుమానితుల జాబితాలోంచి కొట్టేశారు.
బ్రాడీ యింట్లో పార్టీ జరుగుతోంది. మైక్ కూడా వచ్చాడు. జెసికా అతనికి యిస్తున్న ప్రాధాన్యత చూసి, బ్రాడీ తిక్కతిక్కగా అయిపోయాడు. పెద్ద గన్ తీసుకుని వచ్చి తన పెరట్లో తిరుగుతున్న లేడిని కాల్చి చంపేశాడు. అతని కొడుక్కి ఆ లేడి అంటే ప్రాణం. బ్రాడీ యింత క్రూరంగా ప్రవర్తించడం చూసి, అందరూ తెల్ల బోయారు. మెల్లగా జారుకున్నారు. ఆ రాత్రి జెసికా మొగుణ్ని దులిపేసింది. ‘నువ్వు తిరిగి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. మామూలు మనిషిలా లేవు. రాత్రిళ్లు కలవరిస్తూ ఉంటావు. నన్ను సుఖపెట్టే క్షణాలు లేవు. పోనీలే అని ఊరుకుంటున్నాను. ఇంత నిర్దయగా ఆ మూగజీవిని చంపేస్తావా? పిల్లలు నిన్ను చూసి భయపడరా? దయచేసి నువ్వు కౌన్సిలింగ్‌కు వెళ్లు. లేకపోతే నీతో వేగడం మహా కష్టం.’ అని. బ్రాడీ ఏమీ అనలేక తల వంచుకున్నాడు.
మర్నాడు బ్రాడీ వెటరన్స్ (యుద్ధభూమిలో గాయపడి తిరిగి వచ్చినవారు)కు సహాయపడేందుకు ఏర్పరచిన సమావేశానికి వెళ్లాడు. ఇప్పటివరకు రుజువు ఏవీ లభించకపోయినా క్యారీకి బ్రాడీమీద అనుమానం పోలేదు. అతన్ని వెంబడించి, మాటలు కలుపుకుని, సన్నిహితంగా మెలగి, అతన్నించి సమాచారం రాబట్టాలని నిశ్చయించుకుంది. బ్రాడీని వెంబడించి ఆ సమావేశస్థలానికి వెళ్లింది. అనుకోకుండా అతన్ని అక్కడ చూసినట్లు నాటకమాడింది.
ఆమెను చూడగానే ‘సిఐఏ డిబ్రీఫింగ్ సెషన్‌లో మనం కలిశాం కదా’ అన్నాడతను. వెంటనే ఆమె ‘అయ్యో, యిక్కడి వాళ్లకు నేను సిఐఏ అని తెలియదు. నీ ద్వారా అది బయటపడిపోతుంది. ఇక్కడకు రాకుండా ఉండాల్సింది, ఛ, ఛ’ అంటూ బయటకు వచ్చేసింది. కానీ బ్రాడీ కూడా ఆమె వెంట బయటకు వచ్చాడు. ఇద్దరూ కాస్సేపు అవీయివీ మాట్లాడుకున్నారు. ఉద్యోగధర్మంగా తనూ ఇరాక్‌లో పనిచేశానని బ్రాడీకి చెప్పింది. యుద్ధభూమిలో వుండే యిబ్బందులు మామూలు వాళ్లకు తెలియవని యిద్దరూ మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది.
ఇరాక్‌లో బ్రాడీ ఖైదీగా ఉండే రోజుల్లో గార్డుగా పని చేసిన (అఫ్సల్) హమీద్ పాకిస్తాన్ ప్రభుత్వానికి దొరికాడు. వాళ్లు అతన్ని సిఐఏకి అప్పగించారు. అతని ద్వారా నజీర్ గురించి తెలుసుకుందామని ఐడియా. అసలతను నజీర్ వద్ద పనిచేసేవాడా కాదా తెలుసుకుందామని బ్రాడీని లాంగ్లీకి పిలిపించి, పక్కనున్న అబ్జర్వేషన్ గదిలో కూర్చోబెట్టారు. అతనితో పాటు క్యారీ కూడా కూర్చుంది. వాళ్ల ఎదురుగా ఉన్న వన్‌సైడ్ అద్దాల గదిలో హమీద్‌ని కూర్చోబెట్టి సాల్ వెళ్లి అతన్ని యింటరాగేట్ చేశాడు. కానీ అతను నోరు విప్పటం లేదు.
బందీగా ఉండగా తనను చిత్రహింసలు పెట్టిన హమీద్ గురించి బ్రాడీ సాల్‌కు సీక్రెట్ మైకు ద్వారా కొన్ని వివరాలు అందించాడు. వాటి సహాయంతో అతను హమీద్‌తో ‘నీ సంగతంతా మాకు తెలుసు, నీ అంతట నువ్వే నజీర్ గురించి సమాచారమిస్తే నీ కుటుంబానికి రక్షణ కల్పిస్తాం. లేకపోతే హింసలు పెడతాం.’ అని బెదిరించాడు. అయినా హమీద్ తొణకలేదు. ఇక దానితో లైట్లు పూర్తిగా వేసి పెట్టి, విపరీతమైన శబ్దంతో మ్యూజిక్ వినిపించి అతనికి పిచ్చెక్కించారు.
ఇలా కొన్ని గంటలు గడిచాక అతను భరించలేక ‘‘నాకు పెద్దగా తెలియదు కానీ, ఒకసారి ఒక ఈమెయిల్ ఎడ్రసుకు మెసేజి పంపమంటే పంపా’’ అన్నాడు. అయితే ఆ ఈమెయిల్ ఏమిటో చెప్పమన్నారు. చెప్పాడు. అది క్యారీ, డేనీ అమాయకుడనుకుని వదిలేసిన రకీమ్ ఈమెయిల్ ఐడీయే. వెంటనే అతని యింటి ఎడ్రెస్ కూడా తెలుసుకున్నారు. క్యారీ హమీద్‌ను ‘బ్రాడీ, నజీర్ ఎప్పుడైనా ముఖాముఖీ కలిశారా లేదా చెప్పు’ అంది. ‘నా కుటుంబాన్ని రక్షించినట్లు నాకు నమ్మకం కుదిరితేనే నోరు విప్పుతా’ అన్నాడతను.
ఓ పక్క యీ ఎంక్వయిరీ జరుగుతూండగానే బ్రాడీ వచ్చి డేవిడ్‌ను కలిశాడు. ‘‘నన్ను ఒకసారి హమీద్‌ను ముఖాముఖీ కలవనివ్వండి. వాడి చేతుల్లో నేనెన్నో బాధలు అనుభవించాను. రోజులెప్పుడూ ఒకలా వుండవు, చూడు యిప్పుడు నువ్వు బందీగా ఉన్నావు. నేను స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్పాలని వుంది. దీనితో నా గతంలోంచి నేను బయటకు వచ్చే అవకాశం ఉంది.’ అని బతిమాలాడు.
అలా అనుమతించడం చట్టవిరుద్ధం. కానీ యితను రేపు వైస్ ప్రెసిడెంటుకు సన్నిహితుడయితే, తనకు మేలు చేస్తాడు కదాని డేవిడ్ ఓ యిద్దరు గార్డులతో సహా బ్రాడీని గదిలోకి పంపించాడు. బ్రాడీ హమీద్‌ను తిట్టనారంభిస్తే అతను హఠాత్తుగా యితనిపై ఉమ్మేశాడు. బ్రాడీ అతనిపై కలియబడి, నేలమీదకు తోసేశాడు. వెంటనే పక్కనున్న గార్డులు వాళ్లని విడదీసి బ్రాడీని బయటకు పంపేశారు.
నిజానికి బ్రాడీ అవేళ తన కొడుకు క్రిస్‌ను దగ్గరుండి కరాటే మ్యాచ్‌లో ఆడడానికి తీసుకెళతానన్నాడు. కానీ యిలా వచ్చేశాడు. దాంతో సమయానికి మైక్ వచ్చి తీసుకెళ్లాడు. ఇంటికెళ్లాక యీ విషయం తెలిసి బ్రాడీ చికాకు పడ్డాడు. మైక్‌కు మొక్కుబడిగా థాంక్స్ చెప్పి, క్రిస్ గదిలోకి వెళ్లి చూస్తే అతను దేవుణ్ని ప్రార్థిస్తున్నాడు. ఎందుకని అడిగితే ‘నువ్వు బతికి వుండాలని ఎనిమిదేళ్లగా మేం ప్రార్థిస్తూ వచ్చాం. ఇప్పుడు నువ్వు బాగుపడాలని ప్రార్థిస్తున్నాం’ అన్నాడు. బ్రాడీ సిగ్గుపడ్డాడు.
క్యారీ రకీమ్ యింటికి వెళ్లింది. వీళ్లు వచ్చేసరికే ఆ యిల్లు ఖాళీ చేసి రకీమ్, ఐలీన్ పారిపోయారు. సిఐఏ నుంచే సమాచారం లీకై ఉంటుందని క్యారీకి తోచింది. ఇంతలో మరో విషయం తెలిసింది. హమీద్ బందీగా ఉండగానే మణికట్టు కోసుకుని చనిపోయాడు. గదిలో వెతికితే ఓ బ్లేడు ముక్క దొరికింది. అది ఎలా వచ్చింది? అతను పట్టుబడితే తన గురించి ఏమైనా చెపుతాడేమోనని నజీర్ సిఐఏలోని తన మనుష్యుల చేత అతనికి బ్లేడు అందేట్లా చేసి వుంటాడు. సిఐఏ చిత్రహింసలు పెడుతుందన్న భయంతో హమీద్ దాని సహాయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సిఐఏలో నజీర్ మనిషి ఎవరు?
క్యారీ యీ లైనులో ఆలోచిస్తూండగానే డేవిడ్ బ్రాడీని హమీద్ గదిలోకి అనుమతించిన విషయం తెలిసింది. దాని తాలూకు వీడియో కూడా చూసింది. బ్రాడీయే బ్లేడు ముక్క తనతో పాటు తీసుకెళ్లి కొట్లాట సమయంలో హమీద్‌కు అందచేసి వుండవచ్చు అని తోచింది. తమతో పాటు గదిలో కూర్చున్నపుడు సిసి కెమెరాలు కవర్ చేయని బ్లయిండ్ స్పాట్ ఏదో గుర్తించి, అటువైపు హమీద్‌ను లాక్కెళ్లి యిచ్చి వుండవచ్చు. బ్రాడీ నజీర్ నుంచి ఆదేశాలు అందుకుంటున్నాడేమో!
ఇలా ఆలోచిస్తూ సాల్ యింటికి వెళ్లి చర్చించబోయింది. సాల్ అప్పటికే పీకలోతు వ్యక్తిగత సమస్యల్లో ఉన్నాడు. అతని భార్య మీరా యితనితో మళ్లీ కలిసుందామనే ఆశతో ఇండియా నుంచి వచ్చి పదిహేను రోజులైంది. కానీ ఆమె ఉన్ననాళ్లూ యితను పనిలో తలమునకలా మునిగి వున్నాడు. ఒక్కరోజు కూడా కూర్చుని మాట్లాడుకోలేదు. ఒక్క రాత్రీ కలిసి పడుక్కోలేదు. ఇంకెందుకు యిక్కడ, నేను వెనక్కి వెళ్లిపోతాను అంటోంది మీరా. ఆ టైములో క్యారీ వెళ్లి బ్రాడీ గురించి తన అనుమానాలు చెప్పింది.
‘ఇంతమాత్రానికే బ్రాడీ టెర్రరిస్టు అని తీర్మానించలేం. దానికి యింకా ఆధారాలు కావాలి. ఆ బ్లేడు అందించినది ఎవరో తెలుసుకోవాలి ’ అన్నాడు సాల్. డేవిడ్ అతన్ని గదిలోకి అనుమతించడం తప్పు కదా, నేను నిలదీసి అడుగుతాను అంది క్యారీ. అలా అడిగితే నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త అన్నాడు, అసలే చికాకులో ఉన్న సాల్. క్యారీకి కోపం వచ్చి బయటకు వచ్చేసింది. ఆఫీసుకి వెళ్లి తన సరంజామా సర్దుకుని పక్క వూరిలో ఉన్న అక్క యింటికి వెళ్లింది. ఉద్యోగం మానేస్తే మంచిదని ఆలోచించసాగింది. (సశేషం) (ఫోటో – ఎడమవైపు వర్జిల్, హమీద్, కుడివైపు జెసికా, మైక్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2020)
[email protected]