cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

కరోనా సంక్షోభం అయినా చంద్రబాబుకు అవకాశమే అన్నమాట!

కరోనా సంక్షోభం అయినా చంద్రబాబుకు అవకాశమే అన్నమాట!

ప్రతి సంక్షోభాన్ని  అవకావంగా మార్చుకోవాలి..ఇది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విధానం. లేదా సంక్షోభాన్ని సృస్టించి తనకు అనుకూలంగా మార్చుకోవడం కూడా ఆయన కు బాగా తెలిసిన విషయమే. చంద్రబాబు ఇప్పుడు  కరోనా సంక్షోభాన్ని కూడా తనకు ఉపయోగపడేలా చేసుకోవాలని విశ్వయత్నం చేస్తున్నారు.

ఒక చిన్న రాయిని కూడా  ఆయన వదలి పెట్టడం లేదు. అది విజ్ఞతతో కూడినదేనా, ప్రజలంతా నిజమైన తీవ్ర సంక్షోభం లో ఉన్న సమయంలో దిక్కుమాలిన రాజకీయాలు చేయవచ్చా?లేదా అన్న ఆలోచన లేకుండా ఆయన ఎపిలోని ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారు. మరికొందరితో దాడి చేయిస్తున్నారు. ఇలాంటివి ఆయనకు కొత్త కాదు.

1983 లో కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయిన తదుపరి  తెలుగుదేశం లోకి వచ్చిన తర్వాత , అంటే తన మామ ఎన్.టి.రామారావు వద్దకు వచ్చిన తర్వాత నుంచి ఏ అవకాశాన్ని ఆయన వదలిపెట్టలేదంటే అతిశయోక్తి కాదు. చివరికి  తన మామపై కూడా ప్రయోగించారు. అలా ఎక్కువ సార్లు సఫలం అయ్యారు. కొన్నిసార్లు విఫలం అయ్యారు.చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. తాను చాలా నీతివంతమైన వ్యక్తినని, విలువలు కలిగిన నేతనని ప్రచారం చేయించుకోవడం లో దిట్ట.అలా ప్రచారం చేయించుకోవడానికి వీలుగా ఆయన కొన్ని కార్యక్రమాలు  కూడా పెట్టుకుంటారు.

ఒక వర్గంమీడియాను తనకు అనుకూలంగా మలచుకున్న తర్వాత ఈ ప్రాసెస్ ను చాలా సమర్దంగా నిర్వహించుకుంటారు. పైకి నీతులు చెబుతూనే, లోపల చేయాల్సిన వన్ని చేస్తుంటారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.ఎన్.టి.ఆర్ 1985లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను వేదించో, ఒప్పించో కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. ఆ అవకాశాన్ని వాడుకుని ప్రభుత్వంలోని వ్యవసాయ,మార్కటింగ్ తదితర శాఖలన్నీ తన కంట్రోల్ లోకి వచ్చేలా చేసుకున్నారు.తర్వాత హైకోర్టు తప్పపట్టింది అది వేరే విషయం.దాంతో ఆ తర్వాత హైకోర్టులను ఎలా మేనేజ్ చేయాలన్నదానిపై కూడా చాలా స్పష్టమైన అవగాహనతో ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటే ఆశ్చర్యం కాదు.1989 లో టిడిపి అదికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తన పట్టు పెంచుకోవడానికి అన్ని అవకాశాలను ఆయన వినియోగించుకున్నారు.

కొన్నిసార్లు ఎన్.టి.ఆర్.కు అసహనం కలిగినా ఈయన మేనేజ్ చేసుకోగలిగేవారు. అంతేకాదు. ఎన్.టి.ఆర్ అప్పట్లో లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం పెద్ద సంచలనం. అప్పుడు ఆ వివాహాన్ని వ్యతిరేకించినట్లు కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి కధ నడిపారు. ఆ తర్వాత ఆయన లక్ష్మీపార్వతి ద్వారా కూడా తన వర్గం ప్రయోజనాలు సమకూరేలా జాగ్రత్తపడ్డారు. 1994 లో ఎన్.టి.ఆర్.మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు ఆయన క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఆ తర్వాత ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ఉదాహరణకు ఎన్.టి.ఆర్. మద్య నిషేధం అమలు చేశారు. అదే సమయంలో ఉపాది అవకాశాల దృష్ట్యా డిస్టిలరీల ఏర్పాటు ప్రతిపాదన కు ఆమోదం తెలిపారు. ఆ తర్వాత ఆయన లండన్ వెళ్లారు. ఆ సమయాన్ని చంద్రబాబు ఎలా  వాడుకున్నారో తెలిసినవారికి ఆశ్చర్యం కలిగిస్తుంది.ఎన్.టి.ఆర్. నిర్ణయంతో ఎపి అంతా భగ్గుమంటున్నట్లు, తాను దానిని నివారించడానికి కృషి చేస్తున్నట్లు పత్రికలలో వార్తలు వచ్చేలా చూసుకున్నారు. తదుపరి లండన్ లో ఉన్న ఎన్.టి.ఆర్.కు ఆయన తో పాటు ఉన్న అదికారులతో మాట్లాడి ఆ జిఓ ని రద్దు చేయించారు.

దీనివల్ల ఎన్.టి.ఆర్ ప్రతిష్టను దెబ్బగొట్టడం, మరో వైపు తన పరపతి పెంచుకోవడం ఇలా ఆయన చేసేవారు. ఇక లక్ష్మీపార్వతి ని బూచీగా చూపించి ఎన్.టి.ఆర్ .కు వ్యతిరేకంగా ఎన్ని కదలు ప్రచారం చేసేవారో అప్పటి సంగతులు తెలిసినవారందరికి ఎరుకే.ఆ బూచి సాకుతో టిడిపిలో పెద్ద సంక్షోభాన్ని చంద్రబాబు సృష్టించారు.దానికి తానే పరిష్కారం చేయగల వ్యక్తినని ప్రచారం చేయించుకుని,వ్యూహాత్మకంగా ఆనాటి ప్రదాని పివి నరసింహారావుతో సహా ఎవరెవరిని మేనేజ్ చేయాలో అందరిని చేశారు.

ఇదంతా ఆయన సమర్దత కింద ఆయన అభిమానులు భావిస్తారు. ఇవన్ని కుట్ర రాజకీయాలుగా ఆయన వ్యతిరేకులు నమ్ముతారు.  ఎన్.టి.ఆర్ స్వయంగా తన అల్లుడిని ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలతో వీడియో విడుదల చేసింది తెలిసిన విషయమే. ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు లాక్కొన్నారు.ఎన్ టిఆర్ ను   టిడిపి అద్యక్ష పదవి నుంచి తొలగించారు. అంతేకాదు.. బ్యాంకులో ఉన్న డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా స్వాధీనం అయ్యేలా కోర్టు ద్వారా సఫలం అయ్యారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ గుండె పగిలి కన్నుమూశారు.

ఇదంతా ఒక చరిత్ర. అప్పటివరకు ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా సంక్షోభాలను సృష్టించి తన అవకాశాలుగా మార్చుకున్నారు.ఎన్.టి.ఆర్.మరణం తర్వాత మళ్లీ ఇంకో రూపంలో అవకాశాలను వాడుకున్నారు. ఎన్.టి.ఆర్ కు తామే వారసులమని, ఎన్.టి.ఆర్.ఆశయాలకోసమే తాము ఉన్నామని ప్రచారం చేసుకోగలిగారు.తదుపరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాలలో ఎదుటివారు ఎంత బలమైనవారైతే అంతగా వారిపై బురద చల్లడం, తాను స్వచ్చమైన వ్యక్తినని ప్రచారం చేసుకోవడానికి అత్యంత ప్రదాన్యత ఇచ్చేవారు.

అప్పట్లో పి.జనార్దనరెడ్డి సిఎల్పి నేతగా ఉంటే ఎగతాళి చేసి మాట్లాడేవారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎన్నో కేసులు ఉన్న వ్యక్తిగా ప్రొజెక్టు చేసేవారు.  వైఎస్ తనపై ఉన్న కేసులన్ని ఎన్నికలలో బానర్లు కట్టినవి,..ఇతరత్రా చిన్ని కేసులు అని మీడియా సమావేశం పెట్టి చెప్పుకోవలసి వచ్చింది.చివరికి వైఎస్ పై ఉన్న కేసులన్నీ పోయాయి. అది వేరే విషయం.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో  వైఎస్ తండ్రిని కొందరు టిడిపి నేతలు హత్య చేశారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. వైఎస్ వీటన్నిటిని తట్టుకుని నిలబడి డీకొట్టగలిగాడు కాబట్టి గెలవగలిగాడు.

కాంగ్రెస్ లో ఆయన తప్ప మరొకరు చంద్రబాబును ఎదుర్కునే పరిస్థితి లేదంటే ఆశ్చర్యం కాదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఏ అవకాశం వచ్చినా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించకపోలేదు. అప్పట్లో టిడిపి ఎమ్మెల్యే పరిటాల రవిని కొందరు హత్య చేస్తే దానిని వైఎస్ పై నెట్టడానికి ప్రయత్నించారు.టిడిపి కార్యకర్తలు,నేతలు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల ఆర్టిసి బస్ లను దగ్దం చేశారంటే దాని వెనుక ఎవరి ప్రోద్బలం ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.

అనూహ్యంగా వైఎస్ మరణం తర్వాత మళ్లీ తన అవకాశాలను వెదకడం చేశారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీతో  కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై కేసులు పెట్టించడం, ఆయనను జైలులో పెట్టించడం వరకు జరిగాయి. సిబిఐ లక్ష్మీనారాయణను ఆయన ఎలా మేనేజ్ చేశారన్నదానిపై పలు కధలు ప్రచారంలో ఉన్నాయి. అలాగే కోర్టులో తనపై విచారణ జరగకుండా ఎలా జాగ్రత్తపడిందన్నదానిపై వార్తలు వచ్చాయి.జగన్ లో తనకు ప్రత్యర్ధి ఉన్నాడని ఊహించే చంద్రబాబు ఆ రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడారు.

బిజెపితో కలవడం,విడిపోవడం వంటివి సరేసరి, ఆ తర్వాత రాష్ట్ర విభజన , అనుకూలంగా లేఖ ఇవ్వడం, తర్వాత కాంగ్రెస్ ను, సోనియాగాందీని దారుణంగా విమర్శించడం , మళ్లీ మోడీతో జతకట్టి 2014 లో అధికారంలోకి రావడం వంటి పరిణామాలు మన కళ్ల ముందు ఉన్నాయి.2014లో అదికారంలోకి వచ్చాక కూడా అదే పద్దతి ఆయన కొనసాగించారు.

జగన్ నాయకత్వంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను లేకుండా చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనేయడం వంటివి ఎన్నో చేశారు. ఆయన పాలించిన ఐదేళ్లు ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నట్లు పిక్చర్ ఇచ్చుకోవడానికి ఎన్ని కదలు సృష్టించేవారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.అంతేకాదు.తాను యజ్ఞం చేస్తుంటే జగన్ అనే రాక్షసుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అనే రాక్షస పార్టీ అడ్డుపడుతోందని తెగ ప్రచారం చేసేవారు.అన్నిటిని ఈవెంట్లుగా మార్చేవారు.

గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఆ సంఖ్య కూడా మీడియాలో ఒకేసారి రాకుండా చూసుకున్నారు.పైగా సంబందిత పుటేజీ ఏమైందో ఇప్పటికీ తెలియదు.హైదరాబాద్ లో పదేళ్ల ఉమ్మడి రాజదాని అవకాశం ఉంటే ఓటుకు నోటు కేసుతో విజయవాడ వెళ్లిపోయి ,ప్రజలకోసమే అక్కడకు వెళ్లినట్లు ప్రొజెక్టు చేసుకున్నారు. తెలుగుదేశం మీడియా కూడా అదే పనిగా ఊదరగొట్టింది. విశాఖపట్నంలో హుద్ హుద్ తుపాను వస్తే ఏకంగా అరవైవేల కోట్ల నష్టం అని ప్రచారంచేశారు.

ప్రదాని మోడీ వచ్చి వెయ్యికోట్లు ప్రకటించి 600 కోట్లతో సరిపెట్టారు. ఇవన్ని ఆయన సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకునే యత్నాలే. అమరావతి పేరుతో రాజధాని ప్రాంతం ఎంపిక కాని, భూముల సమీకరణ గురించి కాని ఎవరికి ఏమీ చెప్పలేదు. తొమ్మిది నగరాలను అక్కడే కడతానని, హైకోర్టు అక్కడే పెడతానని ప్రకటించారు తప్ప ఎవరికి సంప్రదించలేదు.ఎందుకంటే ఆ అవకాశాన్ని తన ఒక్కడికే ,లేదా అక్కడ తన వాళ్ల ఆస్తుల విలువలే పెరగాలని ఆయన వాంచించారన్నది ఎక్కువ మంది భావన. ప్రజలకు ఈ టక్కు,టమార విద్యలన్ని తెలిసిపోయాయి.

అందుకే 2018లో  చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించారు. అయినా చంద్రబాబు దోరణి మారలేదు.ప్రతిదానిలో ఏదో ఒక సంక్షోభం సృష్టించడం లేదా.ఏదైనా సంక్షోభం వస్తే దానిని తనకు వీలుగా మలచుకునే యత్నం సాగిస్తున్నారు,కొంతకాలం ఇసుకు అన్నారు.మరికొంతకాలం అమరావతి అన్నారు. ఇంకొంతకాలం ఏమీ జరగడం లేదని ప్రచారం చేశారు.

జగన్ తన షెడ్యూల్ ప్రకారం తన స్కీములు అమలు చేసుకుంటూ పోతుంటే చంద్రబాబు నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.ప్రభుత్వంలో లోపాలు ఉంటే చెప్పడం తప్పు కాదు.కాని తాను ముఖ్యమంత్రిగా ఉంటేనా..తాను లేకపోవడం వల్లే..అంటూ గొప్పలు చెప్పుకోవడం..మరో వైపు ఉన్నవి లేనివి కలిపి అసత్యాలు ప్రచారం చేయడం సాగిస్తున్నారు.అందులో భాగంగానే ఇప్పుడు దేశ వ్యాప్త కరోనా సంక్షోభాన్ని కూడా తన రాజకీయ అవసరాలకు వాడుకోవడానికి చంద్రబాబు వెనుకాడకపోవడం దారుణమైన రాజకీయంగా  కనిపిస్తుంది.

అందరికి టెస్టులు చేయడం లేదని, నిజాలు చెప్పడం లేదని,ఇలా ఇవేవో ఆరోపణలు చేస్తూ తన వర్గం మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారు బహుశా మరే రాష్ట్రంలోప్రతిపక్షం  ఇంత ఘోరంగా లేదంటే ఆశ్చర్యం కాదు.ప్రదాని మోడీని ఎన్నికల ముందు బండబూతులు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను ఒక్క మాట అనే సాహసం చేయడం లేదు.కాని ముఖ్యమంత్రి జగన్ తాను చెప్పినట్లు వెయ్యిరూపాయల ఆర్ధిక సాయం పేదలకు అందించినా, బియ్యం పంపిణీ చేసినా, వ్యవసాయపరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నా చంద్రబాబు విమర్శలు ఆపడం లేదు.

చివరికి వైసిపి నేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని తప్పడు ఆరోపణలకు కూడా దిగారు. పైగా తన మిత్రుడైన సిపిఐ నేత రామకృష్ణతో పేదలకు సాయం అందకూడదన్న లక్ష్యంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పిర్యాదు చేయించారు.వారికి వ్యక్తిగత ద్వేషంతో ఉన్న బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తోడయ్యారు.వెంటనే దానికి ఎన్నికల కమిషనర్ కూడా స్పందించారు .దీనిని బట్టే అర్దం చేసుకోవచ్చు. జగన్ కు వ్యతిరేకంగా ఎలా కుట్రలు సాగుతున్నాయన్నది తెలిసిపోతూనే ఉంది.

జగన్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లో ఉండేవారు.అప్పుడు చంద్రబాబు కాని, టిడిపి నేతలు కాని,తెలుగుదేశం మీడియా కాని ఎంత ఘోరమైన ప్రచారం చేసిందో గుర్తుకు తెచ్చుకోంది..మరి ఇప్పుడు ఇంత కరోనా సంక్షోభంలో తన హైదరాబాద్ బంగళాలోనే ఉంటున్నారు. ఉంటే పర్వాలేదు..కాని అక్కడ నుంచి నిత్యం మీడియా సమావేశాల పేరుతో,లైవ్ లో గంటల తరబడి మాట్లాడడం చేస్తున్నారు.చెప్పడానికే నీతులు అన్నదానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమి ఉంటుంది? నిజానికి ఓటు కు నోటు కేసు తర్వాత కెసిఆర్ పేరు ఎత్తడానికే  చంద్రబాబు బయపడ్డారు.

ఇప్పటికీ అదే పరిస్థితి. చంద్రబాబు ఇలాగే కుట్రలు, మీడియాను నమ్ముకుని పిచ్చి ఆరోపణలు చేస్తే ఎపిలో కూడా తెలుగుదేశం పార్టీని తనకు తానే నాశనం చేసుకునే రోజు రావచ్చన్న అనుమానం కలుగుతోంది.చంద్రబాబు ఎప్పటికీ పాతపద్దతిలోనే రాజకీయం చేస్తారా?కాస్త మారి పద్దతిగా వ్యవహరిస్తూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటారా అన్నది ఆయనే తేల్చుకోవాలి. ఆయన నుంచి ధర్మం ఆశించడం, న్యాయం కోరుకోవడం. నిజాయితీ రాజకీయాలు అభిలషించడం అత్యాశే అవుతుందా?

ఆ డాక్ట‌ర్ పెద్ద‌త‌ప్పు చేశాడు క్ష‌మాప‌ణ చెప్పాలి