బెయిల్‌పై విడుదలైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అలుపెరగని రాతలతో విజృంభిస్తున్నారు. కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఎంపీనని కూడా చూడకుండా నిబంధనలకు విరుద్ధంగా రాజద్రోహం కేసు నమోదు చేశారని …ఇలా అనేక అంశాలతో దేశ వ్యాప్తంగా ప్రముఖులందరికీ రఘురామకృష్ణంరాజు ఫిర్యాదులు, లేఖలు రాశారు. తనకు మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు గత 9 రోజులుగా వరుసగా రోజుకొకటి చొప్పున 9 లేఖాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటిని నెరవేర్చాలని జగన్ సర్కార్‌ను డిమాండ్ చేస్తూ రఘురామకృష్ణం రాజు లేఖలు రాశారు.
వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచాలని కోరుతూ మొదలైన లేఖల పర్వం తాజాగా సంపూర్ణ మద్యపాన నిషేధం కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చివరిదైన 9వ లేఖ రాశారు.
వైసీపీ ఎన్నికల హామీలపై ‘నవ హామీలు- వైఫల్యాలు’ పేరుతో ఆయన మొత్తం 9 లేఖాస్త్రాలను జగన్ సర్కార్‌పై సంధించారు. వీటికి ఎల్లో మీడియాలో కూడా పెద్దగా ప్రచారం రాలేదు. ఈ లేఖలపై జగన్ సర్కార్ అసలు స్పందించలేదు.
చివరి లేఖలో మద్య నిషేధం కంటే మద్యపాన ప్రోత్సాహం ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. గతేడాదితో పోలిస్తే 16 శాతం అమ్మకాలు ఏపీలో పెరిగాయన్నారు. మద్యపానం నిషేధిస్తారని మహిళలు వైకాపాకు ఓటేశా రని.. సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామ డిమాండ్ చేయడం గమనార్హం.
ఇక లేఖలు రాసే పని కూడా నేటితో పూర్తయింది. జగన్ సర్కార్‌పై రఘురామకృష్ణంరాజు నెక్ట్స్ సంధించే అస్త్రం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే జగన్ సర్కార్‌కు మనశ్శాంతి లేకుండా చేయడమే ఏకైక లక్ష్యంగా రఘురామ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్‌పై ఏం చేయాలనే అంశాల వెతుకులాటలో రఘురామ ఉన్నారని సమాచారం.