కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో జగన్ సర్కార్ రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోతోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కర్ఫ్యూ సడలింపు చర్యలు చేపట్టాయి. అదే బాటలో ఏపీ సర్కార్ కూడా పయనిస్తోంది.
ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులో ఉంది. ఈ నెల 20 నాటికి కర్ఫ్యూ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కర్ఫ్యూ నూతన నిబంధనలను ప్రభుత్వం వెల్లడించింది.
ఈ నెల 21 నుంచి కర్ఫ్యూ వేళలను సడలించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కచ్చితంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయత్రం 5 గంటలకే మూతపడనున్నాయి.
కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పని చేస్తాయి. అయితే ఒక్క తూర్పుగోదావరిలో మాత్రం కర్ఫ్యూలో మార్పు ఉండదు. కరోనా కేసులు అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు కొనసాగనుంది.