ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు.. గత ఐదు సంవత్సరాల్లో తమ ఖాతాదారుల అకౌంట్లలో మినిమం అమౌంట్ ను మెయింటెయిన్ చేయలేదనే నెపంతో బ్యాంకులు పెనాల్టీ రూపంలో దక్కించుకున్న మొత్తం ఇది! ఇందులో కొంత ఏటీఎం సర్వీస్ ను అదనంగా వాడారని, ఎస్ఎంఎస్ ల కోసమంటూ వసూలు చేసిన మొత్తం ఉంది. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ, ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు ఈ మేరకు ఖాతాదారుల జేబులకు చిల్లు వేశాయి. వారి అకౌంట్ల నుంచి డబ్బులు కట్ చేస్తూ.. ఈ మేరకు బ్యాంకులు భారీగా లాభపడ్డాయి!
పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ఇది. తమ ఖాతాదారులు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలంటూ బ్యాంకులు నియమం పెట్టిన సంగతి చాలా మందికి తెలిసి ఉండవచ్చు. చాలా మందికి తెలియకపోయి ఉండవచ్చు కూడా! గ్రామీణుల, నిరక్షరాస్యులతో పాటు.. అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేని వారు కూడా ఇక్కడ బాధితులే. ఐదు సంవత్సరాల్లో బ్యాంకులన్నీ కలిపి నెపాలతో ఇలా 35 వేల కోట్ల రూపాయలను దోచేశాయంటే మాటలేమీ కాదు! దేశంలో బుల్లిరాష్ట్రాల వార్షిక బడ్జెట్ మొత్తానికి సమానం ఇది.
ఏడాదికి ఏడు వేల కోట్ల రూపాయలు సగటున. బ్యాంకర్లు తమ ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో ఎంతో కొంత శాతం కేవలం ఈ పెనాల్టీగా వసూలు చేసిన మొత్తానికి ఇది సమానం కావొచ్చు. ఇలాంటి పెనాల్టీలతో పాటు.. లేట్ పేమెంట్లకు సంబంధించి, ఈఎంఐల చెల్లింపుల్లో నిదానాలతో కూడా బ్యాంకులు భారీ మొత్తాలను ఆర్జిస్తూ ఉన్నాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేదనే నెపంతో వసూలు చేసిందే ఇంత అంటే, క్రెడిట్ కార్డుల ఈఎంఐ చెల్లింపుల్లో అటూఇటూ అయిన వారి నుంచి వసూలు చేసింది ఇంకే రేంజ్ లో ఉంటుందో! క్రెడిట్ కార్డులు మరో పెద్ద ఊబి.
మరి సామాన్య ఖాతాదారుల నుంచి ఇలా పెనాల్టీలుగా ఇలా వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన బ్యాంకులు ఏ రేంజ్ లో లాభాల్లో ఉండాలి? అయితే వాటికి కుచ్చుటోపీ పెట్టడానికి వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు ఉండనే ఉన్నారు. సామాన్యులను కొట్టి సంపాదిస్తున్న బ్యాంకులు.. లోన్ల రూపంలో వాటిని పెద్ద పెద్ద వాళ్లకు ఇస్తూ, తిరిగి వసూలు చేసుకోలేక నిరార్ధక ఆస్తులంటూ ప్రకటించుకుంటూ ఉన్నాయి!