జగన్ సర్కార్‌కు ఎలా చెబితే అర్థమవుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. కోరికోరి సమస్యలను జగన్ సర్కార్ కొనుక్కుంటోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం చివరికి న్యాయస్థానాల్లో నిలబడడం లేదు. ఇందులో జగన్ సర్కార్ స్వీయ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక నిర్ణయం తీసుకునే ముందు, కనీసం న్యాయనిపుణులతో చర్చిస్తున్న దాఖలాలు కూడా లేవు.
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి మొదలుకుని తాజాగా నంద్యాలలో వైద్య కళాశాల నిర్మాణానికి స్థలం కేటాయింపు వరకూ ప్రతిదీ అడ్డగోలు వ్యవహారంగానే తయారైంది. కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి సంబంధించిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయిస్తూ రెవెన్యూశాఖ 2020 డిసెంబరు 12న జీవో 341ను జారీ చేసింది. నంద్యాలలో వైద్య కళాశాల ఏర్పాటును రాయలసీమవాసులంతా ఆహ్వానించారు.
అయితే ఒకటి తీసుకురావడం అంటే, మరొకటి పోగొట్టడం కాదని … నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్యకళాశాలకు తీసుకోవడం ఏంటని రాయలసీమ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం భూమి కాకుండా మరేదైనా చూడాలని కోరారు. సీమ వాసుల విన్నపాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మొండిగా ముందుకెళ్లింది.
దీంతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ప్రభుత్వ దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు సీమ ఉద్యమకారుడు, నంద్యాలకు చెందిన బొజ్జా దశరథరామిరెడ్డి, మరో నలుగురు కలిసి జీవో 341ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
వైద్య కళాశాల నిర్మాణానికి.. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం భూమికి బదులు ప్రత్యామ్నాయ స్థలం ఎందుకు పరిశీలించకూడదని రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించి.. వివరాలను తన ముందుం చాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరాంను ఆదేశించింది.
మెడికల్ కాలేజీ, పరిశోధనా కేంద్రం రెండూ ముఖ్యమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాయలసీమ రైతులు, ఉద్యమకారుల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశోధన కేంద్రంలో కాకుండా మరో ప్రత్యామ్నాయ స్థలంలో వైద్యకళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాయలసీమ సమాజం కోరుతోంది.