టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మళ్లీ తప్పులో కాలేశారు. తప్పులు మాట్లాడ్డం లోకేశ్ అలవాటుగా చేసుకున్నారనే దెప్పి పొడుపులు ఎంతో కాలంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో తప్పులు దొర్లకుండా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆవేశంలో సహజంగానే లోకేశ్ అలవాటులో భాగంగా చెప్పాలనుకున్న దానికి బదులో మరొకటి చెప్పి నెటిజన్లకు దొరుకుతున్నారు. దీంతో ఆయన్ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో లోకేశ్ నెటిజన్లకు దొరికిపోయారు. కర్నూలు జిల్లా పెసరవాయిలో గురువారం హత్యకు గురైన టీడీపీ నేతలు నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి కుటుంబాలను లోకేశ్ పరామర్శించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలను హెచ్చరించే ఆవేశంలో ఆయన తప్పులో కాలేశారు. ఆ తర్వాత దాన్ని సరిదిద్దుకున్నారు. ఆయన ఏమన్నారంటే…
“అధికార పార్టీ నేతలు మంచి పని చేయాలంటే అభివృద్ధి చేయండి. రాయలసీమకు కొత్త పరిశ్రమలు తీసుకురావాలి. అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి. కానీ ఇవేవీ చేతకాకే మా కార్యకర్తలు, నేతలపై ఎదురుదాడి చేస్తున్నారు. మా ఓపికను శిక్షించొద్దు” అని లోకేశ్ హెచ్చరించారు.
మా ఓపికను పరీక్షించొద్దు అనేదానికి బదులు ఆయన శిక్షించొద్దు అని మాట్లాడ్డంతో టీడీపీ శ్రేణులు, విలేకరులు అవాక్కయ్యారు. ఆ తర్వాత వెంటనే తాను మాట్లాడిన దాంట్లో తప్పు దొర్లిందని గుర్తించి పరీక్షించొద్దని సరిచేసుకున్నారు. దీంతో లోకేశ్ పరువు కాపాడుకున్నారు.
లోకేశ్ మాట్లాడుతున్నారంటే, ఇలాంటి ఆణిముత్యాలు జాలువారుతాయని నెటిజన్లు ఎదురు చూస్తూ ఉంటారు. నెటిజన్లు ఆశించినట్టే లోకేశ్ తన మార్క్ స్పీచ్ ఇచ్చి కామెడీ పంచారు.