పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరితపిస్తున్నారు. ఇది ప్రతి పథకం అమల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. విద్య, వైద్యం తదితర ముఖ్యమైన రంగాల్లో భారీ సంస్కరణలు తీసుకురావాలని జగన్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది.
ఈ సందర్భంగా కొన్ని సంస్కరణలు ప్రశంసలు అందుకుంటుండగా, మరికొన్ని తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. మరీ ముఖ్యంగా నాడు-నేడు స్కీం విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కారణమవుతోంది. ఇది అందరి ప్రశంసలు అందుకుంటోంది.
అలాగే ప్రాథమిక విద్యలో, తాజాగా డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వైద్య రంగానికి వస్తే…ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ సందర్భంగా ఒకేసారి 16 వైద్య కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేసి తనకెవరూ సాటిలేరని, రారని జగన్ ప్రభుత్వం నిరూపించుకుంది. నేడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం మరో ప్రశంసదగ్గ నిర్ణయం.
ప్రస్తుతానికి వస్తే గ్రూప్-1 పోస్టుల్లో మినహా మిగిలిన కేడర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జగన్ ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గ్రూప్-1 మినహా మిగిలిన కేడర్ పోస్టులను పూర్తిగా మెరిట్ ప్రాతిపదికనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇంత వరకూ గ్రూప్-1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు చేపట్టేవారు.
ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించడం ఇంత వరకూ వస్తున్న సంప్రదాయం. ఇకపై గ్రూప్-2, గ్రూప్-3 సహా ఇతర కేడర్ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పట్టుదలతో ఉంది.
కేవలం ఒక పరీక్షే నిర్వహించి, అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులను సంబంధిత పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపా దనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు వివరించాయి.
దీనివల్ల అభ్యర్థులకు ఆర్థిక భారం, వ్యయ ప్రయాసల నుంచి విముక్తి కల్పించవచ్చని కమిషన్ భావిస్తోంది. అలాగే కోచింగ్ సెంటర్ల దందాను అరికట్ట వచ్చని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నమ్ముతోంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచనలు ఎంత వరకు ఆచరణకు నోచుకుంటాయో చూడాల్సి వుంది.