ముంబై సినీ ఇండస్ట్రీని ఫేక్ వ్యాక్సినేషన్ వ్యవహారం చుట్టుముట్టింది. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలు కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి వ్యాక్సినేషన్ వేయించాయి. టిప్స్, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్, ఇలా పలు ప్రొడక్షన్ కంపెనీలు సిబ్బందిని షూటింగ్ కి సమాయత్తం చేసే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేయించాయి.
అయితే వీరంతా ప్రైవేటు ఆస్పత్రులతో టై-అప్ అయ్యారు. ఇక్కడే వ్యవహారం తేడా కొట్టింది. ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో మధ్యవర్తులు రంగంలోకి దిగారు. ఎస్పీ ఈవెంట్స్ ప్రతినిధి సంజయ్ గుప్తా ఆయా కంపెనీలతో మాట్లాడి వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు.
టిప్స్ సంస్థలో 350 మంది ఉద్యోగులు, మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ కి సంబంధించి 150 మంది ఉద్యోగులు.. ఇలా వివిధ ప్రొడక్షన్ హౌస్ లు, చిత్ర యూనిట్ లు వేలాదిమంది ఇండస్ట్రీ కార్మికులు, సిబ్బందికి వ్యాక్సిన్ వేయించాయి. మే నెలలో వీరందరికీ వ్యాక్సినేషన్ పూర్తయినా ఇప్పటి వరకూ ఆ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. కనీసం కొవిన్ యాప్ లో కూడా వీరి పేర్లు కనిపించలేదు.
ఈ క్రమంలో ముంబైలోని ఓ అపార్ట్ మెంట్ వెల్ఫేర్ కమిటీ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. సదరు అపార్ట్ మెంట్ వాసులకి కూడా మే నెలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించిన ఏజెన్సీ ఇప్పటి వరకూ సర్టిఫికెట్లు ఇవ్వలేదట.
ఏజెన్సీ నిర్వాహకులు పత్తా లేకుండా పోవడంతో అపార్ట్ మెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. అసలు తమకు టీకా వేశారా, లేక సెలైన్ వాటర్ ని శరీరంలోకి ఎక్కించారా అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫేక్ వ్యాక్సినేషన్ వ్యవహారం బయటకొచ్చింది.
సినీ ఇండస్ట్రీ నుంచే బాధితులెక్కువ..
సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా షూటింగ్ లకు అనుమతి రావాలంటే.. చిత్ర యూనిట్, సిబ్బంది అందరూ టీకాలు వేయించుకోవాలని ప్రభుత్వాలు నిబంధనలు విధిస్తాయనే ప్రచారం జరిగింది. దీంతో ఇటు టాలీవుడ్ లో కూడా సినిమా వాళ్లకు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించారు.
బాలీవుడ్ లో ఈ వ్యవహారం జోరుగా సాగింది. ప్రొడక్షన్ హౌస్ లు, జూనియర్ ఆర్టిస్ట్ లను సప్లై చేసేవారు, ఇతర అన్ని శాఖలవారు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు చేపట్టారు.
దాదాపుగా అందరూ ఒకటే ఏజెన్సీని నమ్ముకోవడం, ప్రైవేటు ఆస్పత్రుల పేరు చెప్పి వాడు అందర్నీ ముంచేయడంతో ఫేక్ వ్యాక్సినేషన్ వ్యవహారం రచ్చకెక్కింది. చివరకు పోలీసు కేసుల వరకూ వెళ్లింది. ఇప్పుడు సర్టిఫికెట్ లేనివారు మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా..అసలు ఇంతకుముందు తమకు వేసింది వ్యాక్సినేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.