బాబు పోయాడు…జాబ్ వ‌స్తోంది!

ఐదేళ్లలో ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబునాయుడు చేయ‌లేంది…జ‌గ‌న్ రెండేళ్ల‌లోనే చేసి చూపించారు, చూపిస్తున్నారు. నిరుద్యోగుల పాలిట జ‌గ‌న్ పాల‌న వ‌ర‌మైంద‌నే చెప్పాలి. జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న పూర్తి అయిన నేప‌థ్యంలో నేడు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌తో…

ఐదేళ్లలో ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబునాయుడు చేయ‌లేంది…జ‌గ‌న్ రెండేళ్ల‌లోనే చేసి చూపించారు, చూపిస్తున్నారు. నిరుద్యోగుల పాలిట జ‌గ‌న్ పాల‌న వ‌ర‌మైంద‌నే చెప్పాలి. జ‌గ‌న్ రెండేళ్ల పాల‌న పూర్తి అయిన నేప‌థ్యంలో నేడు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌తో మ‌రో ముంద‌డుగు వేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

జాబు రావాలంటే బాబు రావాల‌ని 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ ఊద‌ర‌గొట్టి నిరుద్యోగుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టింది. తీరా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌థ దేవుడెరుగు… ఏ అర్హ‌తా లేని బాబు త‌న‌యుడు లోకేశ్‌కు మాత్రం మంత్రి ప‌ద‌వి ఉద్యోగం ద‌క్కింద‌నే విమ‌ర్శ‌లు అప్ప‌ట్లో వెల్లువెత్తాయి. 

ఉద్యోగం క‌ల్పించ‌క‌పోలే, ప్ర‌తి నెలా నిరుద్యోగుల‌కు రూ.2 వేలు చొప్పున భృతి క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో టీడీపీ చేర్చింది. టీడీపీ పాల‌న‌లో ఉద్యోగాల ఊసే లేదు. అధికారం చివ‌రి రోజుల్లోకి వ‌చ్చే స‌రికి నిరుద్యోగుల‌కు నెల‌కు వెయ్యి రూపాయ‌లు చొప్పున, అది కూడా పార్టీకి చెందిన వారికే మాత్ర‌మే మంజూరు చేసింద‌న్న విమ‌ర్శ‌లొచ్చాయి. దీంతో నిరుద్యోగుల్లో బాబు పాల‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త వ‌ల్లే 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ట్టికొట్టుకు పోయింది.

ఇక జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ను తు.చ‌ త‌ప్ప‌క అమ‌లు చేస్తున్నార‌నే పేరు సంపాదించుకున్నారు. ఈ నేప‌థ్యంలో గాంధీజీ క‌ల‌లు క‌న్న గ్రామ స్వ‌రాజ్య స్థాప‌న‌కు జ‌గ‌న్ పాల‌న శ్రీ‌కారం చుట్టింది. 

గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లను అందిస్తోంది. ఈ సంద‌ర్భంగా స‌చివాల‌యంలో ప‌ర్మినెంట్ ఉద్యోగుల‌తో పాటు ఆ వ్య‌వ‌స్థ‌కు అనుసంధానంగా వాలెంటీర్ల‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ క్ర‌మంలో 4 ల‌క్ష‌ల‌కు పైగా నిరుద్యోగుల‌కు ఉద్యోగావ కాశాలు క‌ల్పించి దేశంలోనే ఓ రికార్డును సృష్టించింది.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ రెండేళ్లో మొత్తం 6,03,756 మందికి ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు అధికారుల లెక్క‌లు చెబుతున్నాయి. ఇందులో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్రంలో ఏటా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌నే హామీని నెర‌వేర్చే క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో ముంద‌డుగు వేస్తోంది.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి 2021-22 జాబ్‌క్యాలెండ‌ర్ విడుద‌ల‌కు నేడు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఇందులో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉద్యోగాల భ‌ర్తీలో పారదర్శకత‌కు పెద్ద పీట వేయ‌నున్నారు. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల‌తో నిరుద్యోగుల్లో అనందం వెల్లువిరుస్తోంది. 

ఉద్యోగాల భ‌ర్తీ త‌మ ప‌ని కాద‌న్న‌ట్టు గ‌త ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది. కానీ ఇప్పుడు త‌మ చ‌దువుకు సార్థ‌క‌త ల‌భించేలా ఉద్యోగాల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంద‌ని నిరుద్యోగ యువ‌త ఆనందంతో చెబుతోంది. బాబు పోయాడు జాబ్ వ‌స్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.