మాన్సాస్ ట్రస్ట్ ని 1958లో పూసపాటి వంశస్థుడు పీవీజీ రాజు స్థాపించారు. మాన్సాస్ ట్రస్ట్ ఆద్వర్యంలో నాటి నుంచి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆయన తరువాత పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ అయ్యారు. ఆయన చనిపోవడంతో 2016లో అశోక్ ట్రస్ట్ బాధ్యలను చేపట్టారు. మధ్యలో 2020 మార్చి నుంచి నిన్నటి దాకా సంచయిత గజపతిరాజు మాన్సాస్ చైర్ పర్సన్ గా ఉన్నారు.
ఇక కోర్టు తీర్పుతో మరో మారు మారు అశోక్ చైర్మన్ అయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే మాన్సాస్ ట్రస్ట్ కి వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. మరి వాటి వివరాలు అన్నీ రికార్డులలో ఉన్నాయా అన్నదే ఇపుడు చర్చ. అటు అశోక్ కానీ ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ భూములను కాపాడుతామని చెబుతున్నారు.
కానీ భూములు ఎన్ని వున్నాయి. ఎన్ని లేవు అన్నది కచ్చితమైన డేటా ఉండాలి కదా. దాని మీదనే ఇపుడు రచ్చ సాగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ భూములు 14 వేల ఎకరాల దాకా ఉన్నాయని అంటున్నారు. అయితే 2016లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను తెచ్చి 105 ఎకరాలను అమ్మేశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారు.
అదే విధంగా 2010లోనే మరో అయిదు వందల ఎకరాల భూములు కూడా విక్రయించారని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో మాన్సాస్ భూముల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపిస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇక ఒక్క అంగుళం భూమి కూడా పోకుండా కాపాడుతానని చైర్మన్ అశోక్ అంటూంటే సింహాచలంలోని భూములను కాపాడేందుకు ప్రహారీ గోడ కూడా నిర్మిస్తామని మంత్రులు చెబుతున్నారు.
మొత్తం మీద చూసుకుంటే ఒక్క ఏపీలోనే కాదు, దేశంలో చాలా చోట్ల భూములు ఉన్నాయని చెబుతున్న మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం లో సమగ్రమైన విచారణ జరిపించి ఆ భూములు కాపాడాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని మేధావులు సూచిస్తున్నారు.
అయితే మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ ఇటు ప్రభుత్వ పెద్దల మధ్య రాజకీయ యుద్ధమే జరుగుతున్న వేళ ఇదంత సులువుగా కనిపించడంలేదు అంటున్నారు. పదేళ్ళుగా ఆడిట్ కూడా జరగలేదని ప్రభుత్వం అంటోంది అంటే చాలా లోతుల్లోకే వెళ్లాలేమో.